Drug Racket Busted: మహేంద్ర యూనివర్సిటీ విద్యార్థులకు మాదక ద్రవ్యాలు సప్లయ్ చేస్తున్న అంతర్ రాష్ట్ర డ్రగ్ పెడ్లింగ్ రాకెట్ గుట్టును ఈగల్ టీం(Eagle Team) అధికారులు రట్టు చేశారు. ఇద్దరు విద్యార్థులతోపాటు నలుగురిని అరెస్ట్ చేశారు. వర్సిటీలో చదువుతున్న 50మంది విద్యార్థులు డ్రగ్స్ సేవిస్తున్నట్టుగా గుర్తించారు. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి 1.15 కిలోల గంజాయి, 47 గ్రాములు ఓజీ వీడ్, డిజిటల్ వేయింగ్ మిషన్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈగల్ టీం డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Tanikella Bharani: ‘మటన్ సూప్’ మూవీకి ఆ విఘ్నేశ్వరుడి దయతో ఏ విఘ్నాలు కలగకూడదు
మల్నాడు’ కేసులో క్లూ…
కొన్ని రోజుల క్రితం ఈగల్ టీం(Eagle Team) అధికారులు కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ పై దాడి చేసి దాని యజమాని సూర్యతోపాటు మరికొందరిని డ్రగ్స్ తో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నిందితులను విచారించినపుడు శ్రీ మారుతీ కొరియర్స్ ఫ్రాంచైజ్ అయిన రాజేశ్ ఎంటర్ ప్రైజెస్ నుంచి కొరియర్ పార్సిళ్ల రూపంలో డ్రగ్స్ ఢిల్లీ, బీదర్ తదితర ప్రాంతాల నుంచి వస్తున్నట్టుగా వెల్లడైంది. దీంట్లో నైజీరియా దేశస్తుడు కీలకంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలిసింది.
డెలివరీ బాయ్ ల నుంచి…
ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఈగల్ టీం(Eagle Team) అధికారులు శ్రీ మారుతీ కొరియర్స్, రాజేశ్ ఎంటర్ ప్రైజెస్ లో డెలివరీ బాయ్స్ గా పని చేస్తున్న వారితో ముందుగా పరిచయం చేసుకున్నారు. వారి సహకారంతో ఢిల్లీలో ఉంటున్న నైజీరియా దేశస్తుడు నిక్ నుంచి రెండు డ్రగ్ పార్సిళ్లు మహేంద్ర యూనివర్సిటీలో చదువుకుంటున్న దినేశ్ కు అందినట్టుగా తెలుసుకున్నారు. విచారణను ముందుకు నడిపించగా భాస్కర్ అనే వ్యక్తి నిక్ కు డ్రగ్స్ కోసం ఒకసారి 9వేలు, మరోసారి 8వేల రూపాయలను ఏటీఎం క్యాష్ డిపాజిట్ పద్దతిలో పంపించినట్టుగా వెల్లడైంది. ఇలా 4 ఎండీఎంఏ డ్రగ్ మాత్రలను తెప్పించుకున్న దినేశ్, భాస్కర్ లు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి క్వేక్ ఎరీనా పబ్బులో దానిని సేవించినట్టుగా నిర్ధారణ అయ్యింది.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
సెక్యూరిటీ గార్డులు…విద్యార్థులతో…
మహేంద్ర యూనివర్సిటీ(Mahendra University)లో డ్రగ్స్ వాడకం జరుగుతున్నట్టు పూర్తి స్థాయిలో నిర్ధారించుకున్న తరువాత ఈగల్ టీం అధికారులు క్యాంపస్ పై దృష్టిని కేంద్రీకరించారు. ఈ క్రమంలో యూనివర్సిటీలో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డులతోపాటు చదువుకుంటున్న కొందరు విద్యార్థులను కాన్పిడెన్స్ లోకి తీసుకున్నారు. వీరి ద్వారా గతంలో వర్సిటీ హాస్టల్ లో ఉండి ఆ తరువాత బయట గదిని అద్దెకు తీసుకుని ఉంటున్న విద్యార్థి నెవెల్లె టాంగ్ బ్రాం (మణిపూర్), వర్సిటీలోనే చదువుతున్న మహ్మద్ అషర్ జావేద్ ఖాన్ లు డ్రగ్ విక్రయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నట్టు తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరికి సంబంధించిన మొబైల్ ఫోన్ల నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ల వివరాలు సేకరించారు. ఇక, వీరికి జీడిమెట్లకు చెందిన అంబటి గణేశ్, బూసా శివకుమార్ లు సహకరిస్తున్నట్టుగా దర్యాప్తులో తేలింది.
50మంది విద్యార్థులు…
ఈ విచారణలోనే టాంగ్ బ్రాం, మహ్మద్ అషర్ జావేద్ ఖాన్ లు మహేంద్ర యూనివర్సిటీలో చదువుతున్న 50 మందికి పైగా విద్యార్థులకు నిరంతరం డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా వెల్లడైంది. ఢిల్లీకి చెందిన అరవింద్ శర్మ, అనీల్ సాయిబామ్ ల నుంచి డీటీడీసీ కొరియర్ సర్వీస్ నుంచి డ్రగ్ పార్సిళ్లు తెప్పించి దందా సాగిస్తున్నట్టుగా తెలిసింది. ఒక్క ఔన్స్ ఓజీ వీడ్ ను 30వేల రూపాయలకు వీరి నుంచి కొంటూ వచ్చిన టాంగ్ బ్రాం, మహ్మద్ అషర్ జావేద్ లు ఒక్కో గ్రామును 2,500 రూపాయలకు అమ్ముతున్నట్టు తెలియవచ్చింది. దాంతోపాటు బీదర్ నుంచి మాదక ద్రవ్యాలు తెప్పించి మాదక ద్రవ్యాలు అమ్ముతున్నట్టుగా నిర్ధారణ అయ్యింది.
అన్ని ఆధారాలు సేకరించిన ఈగల్ టీం అధికారులు టాంగ్ బ్రాం, అంబటి గణేశ్, బూసా శివకుమార్న మహ్మద్ అషర్ జావేద్ ఖాన్ లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి గంజాయి, ఓజీ వీడ్ ను స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి డ్రగ్స్ కొంటున్న 50మంది విద్యార్థులకు డ్రగ్ టెస్టులు జరిపించారు. దీంట్లో కొందరికి పాజిటీవ్ వచ్చినట్టుగా ఈగల్ టీం డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. ఢిల్లీలో ఉంటున్న నైజీరియన్ నిక్ నుంచి ఎండీఎంఏ పిల్స్ ను బాస్కర్, దినేశ్ కలిసి శ్రీ మారుతీ కొరియర్స్ ద్వారా తెప్పించుకునేవారని చెప్పారు.
కేసులో విచారణ కొనసాగుతోందని…ముందు ముందు మరిన్ని అరెస్టులు ఉంటాయని తెలిపారు. విద్యార్థులపై యూనివర్సిటీ వర్గాలు ఏమాత్రం నిఘా పెట్టక పోవటంతో క్యాంపస్ లో డ్రగ్స్ దందా విచ్చలవిడిగా కొనసాగుతూ వచ్చిందన్నారు. మాదక ద్రవ్యాల దందా జరుగుతున్నా…వినియోగం గురించి తెలిసినా 8712671111 నెంబర్ కు సమాచారం అందించాలని కోరారు. tsnabho–hyd@tspolice.gov.in కు కూడా వివరాలు పంపించ వచ్చన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా పెడతామన్నారు.
Also Read: Bhukya Murali Naik: రైతులకు సరిపడా యూరియా ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే