Private Buses: నిబంధనలకు ప్రైవేట్ ట్రావెల్స్ తిలోదకాలు
తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన లోపాలు
తొలి రోజే 4 బస్సులు సీజ్
68 బస్సులపై కేసుల నమోదు
ముమ్మరంగా ప్రైవేట్ ట్రావెల్స్‌ల తనిఖీలు
లక్షా 17 వేల జరిమానా విధింపు
నిబంధనలు అతిక్రమించి సీట్లు పెంచిన బస్సులపై కేసులు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రవాణాశాఖ నిబంధనలు పాటించని ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై (Private Buses) అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. తనిఖీల్లో ట్రావెల్స్‌లోని లోపాలు బయటపెడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు వెలుగులోకి తెస్తున్నారు. కర్నూల్ బస్సు ప్రమాద ఘటనతో ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ విస్తృత తనిఖీలు చేపట్టింది. విజయవాడ, బెంగుళూరు జాతీయ రహదారిపై ఆర్టీఏ బృందాలు బస్సుల్లో తనిఖీ చేపడుతున్నారు. మూడు జిల్లాల పరిధిలో 8 బృందాలతో తనిఖీ చేస్తున్నారు. పర్మిట్ లేకుండా వెళ్తున్న బస్సులపై, నిబంధనలు పాటించని పలు బస్సులపై కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా నడుపుతున్న ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు. రాజేంద్రనగర్, ఎల్బీనగర్ చింతలకుంటలో ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న బస్సులను తనిఖీ చేస్తున్నారు. అదే విధంగా కర్నూల్ నుంచి వచ్చే బస్సుల్లో ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను పరిశీలిస్తున్నారు. బీమా, ఫిట్‌నెస్, పర్మిట్ పత్రాలు, బస్సు లోపల భద్రతను పరిశీలిస్తున్నారు. రాజేంద్రనగర్, చింతలకుంట వద్ద నిబంధనలు పాటించని ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదుచేశారు. ఒక్కరోజే 68 కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ ఈస్ట్ జోన్ పరిధిలో 6, వెస్ట్ జోన్ పరిధిలో 9, సౌత్ జోన్ పరిధిలో9, నార్త్ జోన్ పరిధిలో 23, రంగారెడ్డి జిల్లాలో 14, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 7 బస్సులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రయాణికులతో ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులపై కాకుండా, హైదరాబాద్‌కు వచ్చే బస్సులపై మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ జాయింట్ కమిషనర్ రమేశ్ తెలిపారు. బస్సుల ఫిట్ నెస్‌ను తనిఖీ చేస్తున్నామని, లేని వాటిపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. శనివారం లక్షా 17వేల జరిమానా విధించి వసూలు చేశామన్నారు. మంటలు ఆర్పే యంత్రం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేనివాటిపై కేసులు నమోదు చేస్తున్నామని, సెల్ ఫోన్స్, మోటార్ సైకిల్స్ సైతం తరిస్తున్నట్లు వెలుగులోకి వస్తుందని ఇది నిబంధనలకు విరుద్దమన్నారు. అదే విధంగా బస్సులు కన్వర్జేషన్, ఆల్ర్టనేషన్, సీట్ల సంఖ్య పెంపునకు వీల్లేదు. స్వీపర్ ను ఎక్స్ ప్రెస్ గా చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వస్తున్నాయి.
Read Also- Thummala Nageswara Rao: పత్తికొనుగోళ్లపై పర్యవేక్షణ చేయాలి.. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు
అధికారుల నిర్లక్ష్యం సైతం స్పష్టం
ట్రావెల్స్ బస్సుల రిజిస్ట్రేషన్ సమయంలో రవాణాశాఖ అధికారులు తనిఖీ చేసి, ఫిట్ నెస్, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, సీటింగ్ సదుపాయం సరిగ్గా ఉందా లేదా? నిబంధనల ప్రకారం ఉంటేనే ఓకే చెప్పారు. రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. కానీ అలా కాకుండా కొంతమంది అధికారులు వీడియో కాల్స్ తో బస్సులు పరిశీలించి రిజిస్ట్రేషన్ చేశారని తనిఖీల్లో వెలుగులోకి వస్తున్నట్లు స్పష్టమైంది. దీంతో రవాణాశాఖ ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. ఏ వాహనం అయినా రవాణాశాఖ కార్యాలయానికి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఒక ట్రావెల్స్ బస్సు 23 సీటింగ్ కెపాసిటీ అనుమతి ఉండగా ఎన్ ఫోర్స్ మెంట్ తనికీలో 29 సీటింగ్ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. అంటే 6 సీట్లను అదనంగా పెంచినట్లు వెల్లుగులోకి రావడం గమనార్హం. దీంతో రవాణాశాఖ అధికారులు బస్సులకు సంబంధించిన డాక్యుమెంట్లతో పాటు బస్సులను పూర్తిస్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు.
