*తల్లి కూతురు సంధ్యారాణి, చందనలకు తలకొరివి పెట్టిన తండ్రీ కొడుకులు
*శోకసంద్రమైన శివ్వాయిపల్లి..
*కడసారి చూపుకు భారీ సంఖ్యలో హాజరైన బంధుమిత్రులు, అన్ని పార్టీల నాయకులు
Kurnool Bus Accident: కర్నూల్ జిల్లా చిన్న టేకూర్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్ దగ్ధమైన (Private Bus Fire) ఘటనలో మృతి చెందిన తల్లీ కూతుళ్లు మంగ సంధ్యారాణి (43) (Manga Sandhya Rani), చందన (23) (Chandana) అంత్యక్రియలు సోమవారం.. వారి స్వగ్రామమైన మెదక్ మండలం శివ్వాయిపల్లిలో అంత్యక్రియలు జరిగాయి. గత శుక్రవారం తెల్లవారు జామున ప్రమాదం జరుగగా బస్‌లో సజీవ దహనమైన వారి డెడ్ బాడీలు గుర్తు పట్టలేని విధంగా మారడంతో డీఎన్ఏ పరీక్షల అనంతరం ఆదివారం సాయంత్రం డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. చనిపోయిన మూడు రోజుల తర్వాత కర్నూల్ నుంచి అంబులెన్స్‌లో డెడ్ బాడీలు ఆదివారం అర్ధరాత్రి శివ్వాయిపల్లికి చేరుకున్నాయి. సోమవారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. తల్లీ కూతుళ్లకు ఒకేసారి తండ్రీ కొడుకులు ఆనంద్ గౌడ్, శ్రీవల్లభ తల కొరివి పెట్టడం అందరిని కంట తడి పెట్టించింది.
మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళి
కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిన తండ్రి.. కూతురు చందనకు తల కొరివి పెట్టడం అక్కడున్నవారిని కలిచివేసింది. తల్లీ కూతుళ్ల మృతితో నాలుగు రోజులుగా గ్రామంలో విషాదం అలుముకోగా, వారి అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో హాజరైన బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు బోరున విలపించారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, కంటారెడ్డి, తిరుపతి రెడ్డి, దేవేందర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దస్ మల్లేశం గౌడ్, మాజీ ఎంపీపీ లక్ష్మీ కిష్టయ్య తదితరులు హాజరై.. మృతులు సంధ్యారాణి, చందన మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
బెంగళూరు వెళ్లడానికి కారణమిదే..
మెదక్ మండలం శివ్వాయిపల్లికి చెందిన ఆనంద్ గౌడ్ దుబాయ్‌లో ఉద్యోగరీత్యా స్థిరపడ్డాడు. ఆనంద్ గౌడ్‌కు పాపన్నపేటకు చెందిన సంధ్యారాణికి వివాహం జరిగింది. వీరికి కుమారుడు శ్రీవల్లభ్ గౌడ్, కుమార్తె చందన ఉన్నారు. కుమారుడు అలహాబాద్‌లో విద్యను అభ్యసిస్తున్నాడు. కుమార్తె చందన బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటుంది. ఆనంద్ గౌడ్, సంధ్యారాణిలు దుబాయ్‌లో ఉంటూ అప్పుడప్పుడు వచ్చి పోతుంటారు. పాపన్నపేటలో ఉన్న తల్లిదండ్రుల ఇంటికి సంధ్యారాణి భర్త పిల్లలతో కలిసి ఇటీవల వచ్చారు. రెండు రోజుల క్రితం ఆనంద్ గౌడ్, వల్లభ గౌడ్ వెళ్లిపోగా సాయంత్రం సంధ్యారాణి, చందనలు చింతల్ నుంచి ప్రైవేట్ బస్సులో బెంగళూరు బయలుదేరారు. కూతురు చందనను బెంగుళూరులో దింపివేసి అక్కడ నుంచి దుబాయ్ వెళ్లేందుకు సంధ్యారాణి ఏర్పాటు చేసుకున్నారు. కానీ తెల్లవారుజామున అగ్ని రూపంలో వచ్చిన మృత్యువు ఆ ఇద్దరి తల్లి కూతుర్లను సజీవ దానం చేసింది. విదేశాల్లో ఉన్నా అప్పుడప్పుడు కుటుంబీకులను పలకరించేందుకు వచ్చి వెళ్లే ఆనంద్ కుటుంబం ఇలా ప్రమాదంలో మృతి చెందడంతో పలువురు కన్నీరు పెట్టుకున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
