KTR: రాష్ట్రంలోని పత్తి రైతులు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి దిక్కులేని పరిస్థితి నెలకొనడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ(BJP), రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల ఉమ్మడి నిర్లక్ష్యమేనని మండిపడ్డారు. ఈ రెండు ప్రభుత్వాల నిర్లక్ష్యం పత్తి రైతులకు శాపంగా మారిందన్నారు. దాదాపు 50 లక్షల ఎకరాల పత్తి పంట పండించిన రైతన్నలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) ప్రభుత్వాలు మొద్దు నిద్రలో ఉన్నాయని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వలన రైతన్నకు కనీస మద్దతు ధర కూడా దొరకడం లేదన్నారు. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.8,110 ఎంఎస్పీ ఉన్నప్పటికీ, బహిరంగ మార్కెట్‌లో రైతులు కేవలం రూ.6 వేలు నుంచి రూ.7వేలు మాత్రమే పొందడం కష్టంగా మారిందన్నారు. దీనివల్ల ప్రతి క్వింటాల్‌పై రైతులు దాదాపు రూ.2వేలు వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Etela Rajender: హైదరాబాద్ ట్రాఫిక్ పై కేంద్ర మంత్రి గడ్కరీకి బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేల విజ్ఞప్తి..!
సీసీఐ కొర్రీలు, తక్కువ కొనుగోళ్లు
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అడ్డగోలు నిబంధనలతో, కుంటి సాకులతో కొనుగోలు ఆపివేసిన వైఖరిని కేటీఆర్ తీవ్రంగా ఎండగట్టారు. తేమశాతం, కపాస్ మొబైల్ యాప్ రిజిస్ట్రేషన్, జిన్నింగ్ మిల్లుల అవినీతి అంటూ సీసీఐ కొనుగోలు నిరాకరిస్తోందన్నారు. ఎడతెగని వర్షాల కారణంగా పత్తి తడిసిపోయి, తేమ శాతం పెరిగిన రైతన్నలు ఇబ్బందులు పడుతుంటే, ఇదే సాకును చూపించి సీసీఐ కొనుగోళ్లు చేయకుండా కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. నెల రోజుల్లో సీసీఐ కేవలం 1.12 లక్షల టన్నుల పత్తిని మాత్రమే కొనుగోలు చేసిందని, ఈ సీజన్‌లో అంచనా వేసిన 28.29 లక్షల టన్నుల ఉత్పత్తితో పోలిస్తే ఇది అత్యంత స్వల్పమని ఎత్తి చూపారు. కొనుగోళ్లు అతి తక్కువగా ఉండటం రాష్ట్రంలో నెలకొన్న పత్తికొనుగోళ్ల సంక్షోభానికి నిదర్శనమని ఆయన తెలిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా కొర్రీలు పెడుతోందని కేటీఆర్ ఆరోపించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి ఒక ప్రతినిధి బృందాన్ని పంపించి కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలని, గతంలో ధాన్యం కొనుగోలు విషయంలో అప్పటి కేసీఆర్ ప్రత్యేకంగా చొరవ చూపిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.
Also Read: Nizamabad News: సీపీ ఆదేశాలతో దాడి చేసిన నేరస్తుడు వినయ్ గౌడ్ పై కేసు నమోదు
