KTR Comments: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ప్రస్తుతం ఏసీబీ ఆయన్ను విచారిస్తోంది. హైదరాబాద్ లోని ఏసీబీ కార్యాలయం వద్ద ప్రస్తుతం ఈ విచారణ ప్రక్రియ జరుగుతోంది. కేటీఆర్ వెంట అడ్వకేట్ రామచందర్ రావు వెళ్లారు. ప్రస్తుతం ఆయన్ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితురాజ్, డీఎస్పీ మాజీద్ ఖాన్ విచారిస్తున్నారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ ఏమన్నారంటే?
కేసుల పేరుతో తమను ఇబ్బంది పెట్టినంత మాత్రన ప్రశ్నించడం ఆపమని బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ (KTR) అన్నారు. చట్టాలు, న్యాయస్థానంపై తనకు గౌరవముందన్న ఆయన.. నిజం నిలకడగా తేలుతుందని అభిప్రాయపడ్డారు. ఫార్మూలా ఈ కారు రేసు కేసు (Formula E-Car Race Case)కు సంబంధించి ఇప్పటి వరకూ 3 సార్లు పిలిచారన్న ఆయన.. ఇంకో 30 సార్లు పిలిచినా విచారణకు వస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్ (KCR), హరీశ్ రావు (Harish Rao)ను కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) వద్ద కూరోబెట్టి పైశాచిక ఆనందం పొందారన్న కేటీఆర్.. ఇవాళ తనను ఏసీబీ విచారణకు పిలిచి మానసిక సంతోషం పొందుతున్నారని మండిపడ్డారు.
Also Read: Bomb Threat: హైదరాబాద్ బయల్దేరిన విమానానికి ముప్పు.. అత్యవసర ల్యాండింగ్!
లైడిటెక్టర్ పరీక్షకు సిద్ధమా?
తెలంగాణ కోసం గతంలో జైలుకు వెళ్లొచ్చామన్న కేటీఆర్.. మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఒకసారి కాదు.. వంద సార్లు అయినా జైలుకు వెళ్తామని పేర్కొన్నారు. తనతోపాటే ఓటుకు నోటు కేసుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పైనా ఏసీబీ కేసు ఉందని కేటీఆర్ గుర్తుచేశారు. లైడిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నారా? అని సవాలు విసిరారు. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీనేని వ్యాఖ్యానించారు. ఈ కారు రేసు వల్ల గతంలో తెలంగాణ ఖ్యాతి పెరిగిందని.. ప్రస్తుత ప్రభుత్వ చర్యలతో రాష్ట్రం పరువు పోతోందని కేటీఆర్ మండిపడ్డారు.
కేటీఆర్‌పై కేసు ఎందుకంటే?
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. దీని ద్వారా హైదరాబాద్ ప్రపంచ పటంలో నిలుస్తుందని, వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అప్పటి ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేశారు. అయితే, రెండోసారి రేస్ జరగకముందే స్పాన్సర్ చేయటానికి ముందుకొచ్చిన సంస్థ వైదొలిగింది. దీంతో అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) రేస్ నిర్వహణా సంస్థకు చెల్లింపులు జరిపింది.ఈ చెల్లింపులు కేబినెట్ ఆమోదం లేకుండానే జరిగాయని, అంతేకాకుండా ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి విదేశీ మారక ద్రవ్యం రూపంలో చెల్లింపులు చేసినట్లు గుర్తించారు. దీంతో ఏసీబీ విచారణకు ఆదేశించగా, అధికారులు కేటీఆర్‌తో పాటు కొందరు ప్రభుత్వ అధికారులపై కేసులు నమోదు చేశారు.