KTR: రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు జూబ్లీహిల్స్ ప్రజలు సిద్ధమయ్యారు
ఓటేసిన పాపానికి అందర్నీ కాంగ్రెస్ మోసం
ఎగురుతున్న వాళ్ల తోకలు కత్తిరిస్తాం
ఆకు రౌడీలను రేవంత్ రెడ్డి కూడా కాపాడలేడు
ప్రజలు కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఈ నెల 14న రాష్ట్రంలో పెను తుఫాను రాబోతోందని, రెండేళ్లలో సర్వనాశనమైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు.. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు జూబ్లీహిల్స్ ప్రజలు సిద్ధమయ్యారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వ్యాఖ్యానించారు. 420 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా కాంగ్రెస్ అమలు చేయలేదని మండిపడ్డారు. అభివృద్ధి అంటూ కాంగ్రెస్ చెబుతున్న మాటలన్నీ అబద్ధమన్నారు. పదేళ్లలో కేసీఆర్ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నారని గుర్తు చేశారు. అభివృద్ధిలోనూ తెలంగాణను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్‌దేనని కేటీఆర్ స్పష్టం చేశారు. యాపిల్, గూగుల్, అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలు నగరానికి వచ్చాయని, వాటి ద్వారా లక్షల సంఖ్యలో ఐటీ జాబ్‌లు పెరిగాయని చెప్పారు. ఒక్క హైదరాబాద్‌లోనే పేదల కోసం లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించామని అన్నారు.
ఒక్కసారి ఓటేసిన పాపానికి ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు రెడీ అయ్యిందనిమండిపడ్డారు. మళ్లీ మోసపోకుండా జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఎర్రగడ్డలో రోడ్ షో నిర్వహించారు.
Read Also- Jubilee Hills byPoll: ఉపఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో ఆంక్షలు.. సజ్జనార్ ఉత్తర్వులు జారీ
కాంగ్రెస్ వచ్చిన రెండేళ్లలోనే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. మహిళలకు తులం బంగారం ఇస్తామని మెడలో ఉన్న గొలుసులు కూడా లాక్కుంటున్నారని వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడించడమే వీటన్నింటికి పరిష్కారమన్నారు. హిట్లర్ వంటి నియంతకు కూడా పతనం తప్పలేదని.. రేవంత్ రెడ్డి ఒక లెక్కా అని ఫైరయ్యారు. ఎన్నికల్లో ఎదురుగా నిలబడి పోరాడే దమ్ములేక ఇలాంటి నీతిమాలిన పనులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్‌కు గట్టి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో పేదల ఇళ్లు కూలగొడుతున్న రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని అన్నారు. బీఆర్ఎస్‌ను గెలిపిస్తే బుల్డోజర్‌కు అడ్డంగా పడుకొని హైడ్రా రాక్షసి నుంచి పేదలను రక్షించే బాధ్యత తమదని భరోసా ఇచ్చారు. ప్రజలను బెదిరిస్తున్న ఆకు రౌడీలకు భయపడాల్సిన పనిలేదన్నారు. ఎవరెవరు తోక జాడిస్తున్నారో.. తొందర్లోనే వారి తోకలు కత్తరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఎగిరెగిరిపడే వాళ్లను రేవంత్ రెడ్డి కూడా రక్షించలేడని హెచ్చరించారు. కాంగ్రెస్ కు జూబ్లీహిల్స్ లో దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలని పిలుపునిచ్చారు.
Read Also- DCC Presidents: తుది దశకు చేరిన ఏఐసీసీ కసరత్తు.. ఈ జిల్లాలో డీసీసీ పదవిపై ఉత్కంఠ!
