KP Vivekananda: బీఆర్‌ఎస్, మాజీ మంత్రులపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(MLC Kavitha) చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్(Congress)కు ప్రయోజనకరంగా ఉన్నాయని, ఆమె కాంగ్రెస్ ట్రాప్‌లో చిక్కుకున్నారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద(MLA KP Vivekananda) తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందు కవిత ఒక విధంగా, ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత మరో విధంగా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ‘కేసీఆర్ సర్కారు హయాంలో ఎంపీ, ఎమ్మెల్సీ వంటి పదవులలో ఉన్నప్పుడు లేని సమస్యలు ఇప్పుడెందుకు వస్తున్నాయి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని చెప్పి, ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే బీఆర్‌ఎస్‌పై, మాజీ మంత్రులపై వ్యతిరేకంగా మాట్లాడటం ఎందుకు? ఎవరి ప్రయోజనాల కోసం? ఈ విషయంలో కవిత ఆత్మవిమర్శ చేసుకోవాలి’ అని ఆయన హితవు పలికారు.
బాధాకరం..
కేటీఆర్(KTR), హరీశ్‌రావు(Harish Rao), ఇతర మాజీ మంత్రులను విమర్శించడం బాధాకరమన్నారు. బీఆర్‌ఎస్ నాయకులపై కవిత చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని ప్రకటించారు. పార్టీ పెడితే పెట్టుకోవచ్చు, కానీ ఈ క్రమంలో కవిత నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలని ఆయన హితవు పలికారు. తాను కేసీఆర్(KCR) కూతురిగా ఆమెను గౌరవిస్తున్నామని, బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం మంచి సంప్రదాయం కాదని, సభ్య సమాజం కూడా తప్పుగా భావిస్తుందని కేపీ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు చేసిన అరాచకాలు, రౌడీయిజం, గెలిచిన తీరు తెన్నులు కవితకు కనబడలేదా? అని ప్రశ్నించారు. కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని, ఆయనే తిరిగి ముఖ్యమంత్రిగా రావాలని తెలంగాణ ప్రజానీకం ముక్తకంఠంతో కోరుకుంటుందని వివేకానంద స్పష్టం చేశారు. కేసీఆర్ తెలంగాణ సాధించిన బాపు అని, ఒక మహాత్మగా ఆయన పిలువబడుతున్నారని పేర్కొన్నారు. అలాంటి నాయకుడి కూతురుగా ఉన్న కవితను పార్టీలో కార్యకర్తలు, అందరూ ఎంతో గౌరవిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
Also Read: Shubman Gill injury: ఐసీయూలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. డాక్టర్స్ ప్యానల్ ఏర్పాటు
