Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. డబ్బులు తీసుకోకుండా మంత్రులు ఏ పని చేయరంటూ చేసిన వ్యాఖ్యలను ప్రత్యర్థి పార్టీలు రాజకీయ అస్త్రంగా మార్చుకుంటున్నాయి. తమ పార్టీకి చెందిన మంత్రులను ఉద్దేశించే కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. దీంతో మంత్రుల కమిషన్ల వ్యాఖ్యలపై కొండ సురేఖ తాజాగా క్లారిటీ ఇచ్చారు.
మంత్రి ఆగ్రహం
మంత్రులు కమిషన్లు తీసుకుంటారంటూ తన చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. తాను గత బీఆర్ఎస్ (BRS Party) ప్రభుత్వంలోని మంత్రుల కమిషన్ల గురించి చెప్పినట్లు పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ మంత్రుల గురించి మాట్లాడినట్లు వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ (KTR), కేసీఆర్ (KCR), కవిత (Kalvakuntla Kavitha)ల అవినీతి ఏంటో ప్రజలకు తెలుసన్న ఆమె.. గత పదేళ్లలో గులాబీ మంత్రులు ఎన్ని ఫైల్స్ క్లియర్ చేసి ఎంత సంపాదించారో తెలీదా? అంటూ వ్యాఖ్యానించారు.
స్ట్రాంగ్ వార్నింగ్
కవిత సొంతగా పార్టీ పెడతారన్న ఊహాగానాలను ప్రస్తావిస్తూ.. సొంత పార్టీ పెట్టేంత డబ్బు ఆమెకు ఎలా వచ్చిందని కొండా సురేఖ నిలదీశారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల్లో ఎంత దోచుకున్నారో తెలియదా అంటూ వ్యాఖ్యానించారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు.. నా వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతలు రెస్పాండ్ అవుతున్నారని అన్నారు. సోషల్ మీడియా ట్రోలర్స్ కు చివరి అవకాశం ఇస్తున్నానని.. కేటీఆర్ ఇచ్చే డబ్బుల కోసం ఇష్టం వచ్చినట్లు తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని అన్నారు. వారిపై సైబర్ సెక్యూరిటీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
నన్ను ఫేస్ చేసే ధైర్యం లేదు
తనను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకనే తన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీరు ఎలా ఉందో.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఎలా ఉందో ప్రజలకు బాగా తెలుసని అన్నారు.
Also Read: Pakistan Air Force: ఫేక్‌లో కాలేసిన పాక్ ఉప ప్రధాని.. పార్లమెంటు సాక్షిగా నవ్వులపాలు!
అసలేం జరిగిందంటే?
గురువారం వరంగల్‌లోని కృష్ణ కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘నా దగ్గరకు కొన్ని కంపెనీల ఫైల్స్ వస్తుంటాయి. మామూలుగా మంత్రులు డబ్బులు తీసుకుని ఫైల్స్ క్లియర్ చేస్తుంటారు. నేను అలా కాదు. సమాజ సేవే చేయమంటాను. నాకు నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పా. స్కూల్ డెవలప్‌మెంట్ చేయమని కోరా’ అని మంత్రి వ్యాఖ్యానించారు.