BJP Politics: సికింద్రాబాద్ కార్పొరేషన్‌పై బీజేపీలో భిన్నస్వరాలు
కేంద్ర మంత్రి మద్దతిస్తే.. వ్యతిరేకిస్తున్న ఎంపీ
సికింద్రాబాద్‌నే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ కిషన్ రెడ్డి పట్టు
మల్కాజిగిరిని చేయాలంటున్న ఈటల
ఎవరి సెగ్మెంట్ కోసం వారి పట్టు
ఇరువురి తీరుతో శ్రేణుల అయోమయం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : సికింద్రాబాద్ ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే అంశంపై తెలంగాణ బీజేపీలో భిన్నస్వరాలు (BJP Politics) వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఈ నిర్ణయాన్ని ఆహ్వానించగా.. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) మాత్రం వ్యతిరేకించడం కొత్త చర్చకు దారితీసింది. దీంతో కిషన్ రెడ్డి వర్సెస్ ఈటల అన్నట్లుగా పరిస్థితి మారింది. నిన్నటికి నిన్న పాత, కొత్త నేతల అంశంపై భిన్నస్వరాలు వినిపించిన కమలం పార్టీలో మరుసటిరోజే మరో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వడంతో పార్టీ లైన్‌పై కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. దేనికి సమర్థించాలి? దేనికి వ్యతిరేకించాలో తెలియక సతమతమవుతున్నారు. ఈ తరహా వ్యాఖ్యలు పార్టీకి డ్యామేజ్‌గా మారే అవకాశాలున్నాయని కార్యకర్తలు భావిస్తున్నారు. ఎందుకంటే, త్వరలోనే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో భిన్న స్వరాలు వినిపించడం పార్టీకి మైనస్ అవుతుందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనే మూడు కార్పొరేషన్లుగా విభజించాలని ప్రతిపాదించింది. ఈ ప్రణాళికలో సికింద్రాబాద్ పేరున విస్మరించడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రాంతం యొక్క గుర్తింపును చెరిపివేయడమేనని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇదిలాఉండగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత లోక్ సభ స్థానం సికింద్రాబాద్. అందుకే ఆయన ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటును స్వాగిస్తున్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా మల్కాజిగిరి లోక్ సభ నుంచి ఎంపీగా ఈటల రాజేందర్ కొనసాగుతున్నారు. కాగా మల్కాజిగిరిలో.. సికింద్రాబాద్ ను కలపొద్దని చెబుతున్నారు. మల్కాజిగిరినే ప్రత్యేక కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని ఆయన పట్టుపడుతున్నారు. ఎవరి లోక్ సభ సెగ్మెంట్ ను వారు ప్రత్యేక కార్పొరేషన్ గా మార్చుకోవాలని భావిస్తుండటం విశేషం.
Read Also- AP Politics: వరుసగా ప్రారంభాలు, శంకుస్థాపనలు.. ఏపీలో వైసీపీ ముఖచిత్రం ఏంటో?
సికింద్రాబాద్‌ను ప్రత్యేక మునిసిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌కు చారిత్రక, ఆర్థిక, రాజకీయ కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో అంతర్భాగంగా ఉంది. సికింద్రాబాద్‌కు 220 సంవత్సరాల ప్రత్యేక చరిత్ర, సాంస్కృతిక గుర్తింపు(లష్కర్ అని కూడా పిలుస్తారు) ఉన్నాయి. 1950లో మునిసిపల్ కార్పొరేషన్‌గా ఉన్నప్పటికీ, 1960లో హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో విలీనమైంది. ఇప్పుడు దాని గుర్తింపును కాపాడేందుకు ప్రత్యేక కార్పొరేషన్ కావాలని స్థానికులు, వివిధ సంఘాలు, రాజకీయ నాయకులు, ప్రధానంగా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. కాగా దీనికి కిషన్ రెడ్డి మద్దతు ప్రకటించడం గమనార్హం. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం జీహెచ్ఎంసీని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనే మూడు కార్పొరేషన్లుగా విభజించాలని ప్రతిపాదించింది. ప్రభుత్వ ప్రణాళికనే ఇంప్లిమెంట్ చేయాలని ఈటల రాజేందర్ పట్టు పడుతుండటం గమనార్హం. సికింద్రాబాద్ బ్రాండ్ కు తాను వ్యతిరేకం కాదని, మల్కాజిగిరి మినీ ఇండియా అనే అంశాన్ని మరిచిపోవద్దని రాజేందర్ పట్టు పడుతున్నారు. ఈ ఇరువురు కీలక నేతల తీరు వల్ల నాయకులు, కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. ఈ అయోమయానికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాలి.

