Kishan Reddy: ప్రధాని నరేంద్ర మోదీపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు హేయమైనవని, ఏమాత్రం అర్థంలేనివని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, దేశాభివృద్ధికి అహోరాత్రులు కష్టపడుతూ, అంతర్జాతీయస్థాయిలో భారతదేశ గౌరవాన్ని పెంచుతున్న దార్శనిక నాయకుడిపై ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి, అసభ్యమైన వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు కూనంనేని రాజకీయ దివాళాకోరుతనాన్ని బయటపెట్టాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Also Read: Sleeping Pods: రైల్వే గుడ్ న్యూస్.. రైలు వచ్చే వరకు ఎంచక్క అక్కడ పడుకోవచ్చు!
ప్రజాస్వామ్య విలువలపై..
రాజకీయాల్లో హూందాతనం, పరిణితి అవసరమని, అంతేకానీ ప్రధానిపై వ్యక్తిగత దూషణలు, అర్థంలేని ఆరోపణలు చేయడం దురదృష్టకరమని కిషన్ రెడ్డి చురకలంటించారు. ప్రజలన్నీ గమనిస్తుంటారనే విషయం గుర్తుంచుకోవాలని కూనంనేనికి సూచించారు. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజలకు ప్రజాస్వామ్య విలువలపై, రాజకీయ వ్యవస్థపై ఏవగింపు కలుగుతోందని ఆయన ఫైరయ్యారు. ప్రధానిపై చేసిన వ్యాఖ్యలకు గానూ, కూనంనేని సాంబశివరావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. సభా మర్యాదలు కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్పీకర్ దీనిపై జోక్యం చేసుకుని మరెవరూ ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయకుండా, సభా మర్యాదలు పాటించేలా చొరవ తీసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు.

