Assembly Session KCR: తొలిరోజు సమావేశాలకు హాజరుకానున్న మాజీ సీఎం
ఎర్రవెల్లి నుంచి నంది నగర్ చేరుకున్న గులాబీ అధినేత
అక్కడి నుంచి నుంచి అసెంబ్లీకి
ఇరిగేషన్ పై జరిగే చర్చలు పాల్గొంటారా లేదా అన్నదానిపై సర్వత్రా ఆసక్తి
కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ ఇప్పటికే సీఎం మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేల డిమాండ్లు
కేసీఆర్ అసెంబ్లీ వస్తే హాట్ హాట్‌గా జరగనున్న సమావేశాలు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. తొలి రోజు జరిగే సమావేశానికి బీఆర్ఎస్ అధినేత, అసెంబ్లీ ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతున్నారు. ఈ సమావేశాల్లో కృష్ణ, గోదావరి జలాలపై జరిగే చర్చలో కేసీఆర్ పాల్గొంటారా లేదా అనేదానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. గులాబీ పార్టీ నేతలు మాత్రం కేసీఆర్ సభకు హాజరవుతారని.. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగడతారని పేర్కొంటున్నారు. అయితే, తొలి రోజు సమావేశానికి హాజరై.. ఆ తర్వాత ఇరిగేషన్‌పై జరిగే చర్చలో పాల్గొనబోరంటూ మరోవైపు ప్రచారం జరుగుతోంది.
అసెంబ్లీకి కేసీఆర్ రావాలని.. ఇరిగేషన్‌పై, సభపై సలహాలు, సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే వేతనం తీసుకుంటున్నప్పటికీ ప్రజల పక్షాన సమస్యలను చర్చించేందుకు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ తరుణంలోనే కీసీఆర్ సభకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం సాయంత్రం ఎర్రవెల్లి నుంచి హైదరాబాద్‌లోని నంది నగర్ నివాసానికి చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయినట్లు సమాచారం. సోమవారం ఉదయం గాంధీనగర్ నుంచి అసెంబ్లీకి చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, అసెంబ్లీకి వచ్చిన తర్వాత నది జలాలపై జరిగే చర్చలో పాల్గొంటారా.? బీఏసీ సమావేశానికి హాజరవుతారా?.. లేకుంటే సభకు హాజరైనట్లు సంతకం పెట్టి వెళ్లిపోతారా అనే చర్చ ఊపు అందుకుంది.
Read Also- Cylinder Explosion: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. అపార్ట్‌మెంట్‌లో పేలిన గ్యాస్ సిలిండర్
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షానికే గులాబీ పార్టీ పరిమితం కావడంతో.. కేసీఆర్ ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగానికి, మరోమారు రెండోసారి బడ్జెట్ ప్రసంగం సమయంలో మాత్రమే కేసీఆర్ వచ్చి.. అనంతరం మీడియాతో మాట్లాడి బడ్జెట్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆ తర్వాత పార్టీ నేతలకు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేసి వెళ్లిపోయారు.
ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగాకృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఇతర పెండింగ్ ప్రాజెక్టుల అంశంపై చర్చించేందుకు సిద్ధమని కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. అందుకు ప్రణాళిక సైతం రూపొందించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సైతం కౌంటర్లు ఇచ్చేలా సంసిద్ధం చేస్తుంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు సైతం ఇదే అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. కృష్ణ, గోదావరి జలాలపై, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీలకు మంత్రి ఉత్తమ కుమారుడు ఒప్పుకున్నట్లు లేక రాశారని.. ఏపీకి నీళ్లు తరలించకపోయేందుకు అంగీకారం తెలుపుతున్నారని ఇప్పటికే గులాబీ పార్టీ విమర్శలు అందిస్తుంది. కెసిఆర్ ఈనెల 21న తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో కృష్ణ జలాలు, పాలమూరు రంగారెడ్డి పై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని చేసిన విమర్శలు.. గత వారం రోజులుగా కాంగ్రెస్, టిఆర్ఎస్ నేతల మధ్య విమర్శ ప్రతి విమర్శలకు దారితీసింది. ఇప్పుడు కెసిఆర్ అసెంబ్లీకి హాజరవుతున్న నేపథ్యంలో సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయని భావిస్తున్నారు. అయితే కెసిఆర్ వాటర్ పై జరిగే చర్చలు పాల్గొంటారా లేదా అనేది చూడాలి. ఒకవేళ కెసిఆర్ చర్చలో పాల్గొంటే మాత్రం సవాల్ ప్రతి సవాలకు సభ వేదిక కానుంది. అంశాలపై సైతం అర్థవంతంగా చర్చ జరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read Also- Bhatti Vikramarka: మధిర నుంచే దేశానికి దిశా నిర్దేశం.. డిప్యూటీ సీఎం భట్టి హామీ

