BC Reservation Bill: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ క్యాబినెట్ చేసిన సవరణ తీర్మానం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నందున, గవర్నర్ తక్షణమే క్యాబినెట్ (Cabinet) ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసి గెజిట్ జారీ చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kaviutha) విజ్ఞప్తి చేశారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో యూపీఎఫ్ నాయకులు, 72 కులాల ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ 25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Also Read: MLC Kavitha: కవిత కయ్యాలపై కీలక భేటీ.. జాగృతిపైనే ప్రధానంగా చర్చ!
వార్డు మెంబర్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు 25 వేల మంది బీసీ బిడ్డలకు రాజకీయ పదవులు దక్కితే, అందులో సగం పదవులు ఆడబిడ్డలకే వస్తాయన్నారు. ఇప్పటివరకు రాజకీయంగా ఎలాంటి అవకాశం దక్కని కులాలకు రాజకీయ రిజర్వేషన్ల ఫలాలు దక్కాల్సిన అవసరం ఉందని కవిత అభిప్రాయపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని, అది కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని గుర్తుచేశారు.
రూ.8 వేల కోట్లు విడుదల చేయాలి
గవర్నర్ ఆర్డినెన్స్ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కేవియట్ వేయకుంటే ఎవరైనా కోర్టుకు వెళ్లి రిజర్వేషన్లకు అడ్డు తగిలే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరికి అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లను పెంచుతూ చట్ట సవరణ చేసే అధికారం కేంద్రం పరిధిలో ఉంటే.. ఉన్న రిజర్వేషన్లలో సబ్ కేటగరైజేషన్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవియెట్ వేయకుండా ఆర్డినెన్స్ ఇస్తే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతామని హెచ్చరించారు. దీనిపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఇవ్వకుండా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: MLC Kavitha: పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించిన కవిత.. బస్తీమే సవాల్