Jubilee Hills Byelection:
ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారుల నియామకం
పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ అభ్యంతరాలకు సోమవారంతో గడువు పూర్తి
నియోజకవర్గంలో 88 కొత్త పోలింగ్ స్టేషన్లు ప్రతిపాదన
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: నగరంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి (Jubilee Hills Byelection) ఉప ఎన్నికను నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ హఠన్మారణంతో అనివార్యమైన ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. అధికార పార్టీ పలు అభివృద్ది పనులను చేపడుతూ ప్రజల మధ్యలోకెళ్తోంది. ఉప ఎన్నిక నిర్వహణకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ఆదేశాల మేరకు అధికారులు ఏర్పాట్లను కూడా ముమ్మరం చేశారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే కొత్త ఓటర్ల నమోదుతో పాటు ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కూడా చేపట్టారు. ఇపుడు తాజాగా ఉప ఎన్నికను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా వివిధ రకాల పనుల నిమిత్తం జిల్లా ఎన్నికల అధికారి నోడల్ ఆఫీసర్లను కూడా నియమిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెలాఖరులో ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ కానన్నట్లు విశ్వసనీయ సమాచారం. నియోజకవర్గంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వీలుగా ఓటర్ల సౌకర్యార్థం మరో 88 కొత్త పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కూడా జిల్లా ఎన్నికల అధికారి పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ఉప ఎన్నికల పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్‌పై అభ్యంతరాలను ఇప్పటికే ఆహ్వానించగా, మంగళవారం కూడా అభ్యంతరాల సమర్పణకు గడువు ముగియనుంది.
రాజకీయ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి సమావేశం
హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రక్రియలో భాగంగా పోలింగ్ స్టేషన్ రేషనలైజేషన్‌పై ప్రత్యేక సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎన్నికల అదనపు కమిషనర్ మంగతాయారు, జూబ్లీహిల్స్ డిప్యూటీ కమిషనర్ ఈవోఆర్.రజనీకాంత్ రెడ్డి, తహశీల్దార్లు, రాజకీయ పార్టీల తరఫున బహుజన్ సమాజ్ పార్టీ నుంచి నందేష్ కుమార్, భారతీయ జనతా పార్టీ నుంచి పీ.వెంకటరమణ, పవన్ కుమార్, సుప్రియ గౌడ్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి విజయ్ మల్లంగి, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) తరపున ఎం.శ్రీనివాసరావు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి రాజేష్ కుమార్, తెలుగుదేశం పార్టీ నుంచి బీవై శ్రీకాంత్, విజయరత్న, మజ్లీస్ పార్టీ నుంచి సయ్యద్ ముస్తాక్ ఖలియుల్లా, తదితరులు పాల్గొన్నారు.
Read Also- Mysore Crime incident: ప్రియురాలి నోట్లో బాంబు పెట్టి పేల్చేసిన ప్రియుడు.. అలా ఎందుకు చేశాడంటే?
408 పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదన
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఉన్న 320 పోలింగ్ స్టేషన్లు ఉండగా, వాటితో కలుపుకుని మొత్తం 408 పోలింగ్ స్టేషన్లు ప్రతిపాదించినట్లు జిల్లా ఎన్నికల అధికారి సోమవారం వెల్లడించారు. గతంలో 132 లొకేషన్లలో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 139 లొకేషన్లలో ఈ మొత్తం 403 పోలింగ్ స్టేషన్లను ప్రతిపాదించినట్లు ఆయన వెల్లడించారు. అదనంగా 88 కొత్త పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ రేషనలైజేషన్ నివేదికను ఈ నెల 28వ తేదీ లోగా ఎన్నికల కమిషన్‌కు పంపించాల్సి ఉన్నందున, అభ్యంతరాలను 26వ తేదీ లోగా తప్పనిసరిగా సమర్పించాలని కమిషనర్ సూచించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 329 పోలింగ్ స్టేషన్లకు బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓ) లు అందుబాటులో ఉన్నారని కమిషనర్ తెలిపారు. అయితే, కొన్ని రాజకీయ పార్టీలు మాత్రమే బూత్ లెవెల్ ఏజెంట్‌ల జాబితా సమర్పించాయని, ఇంకా ఇవ్వని పార్టీలు వెంటనే జాబితా అందజేయాలని కోరారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న 88 పోలింగ్ స్టేషన్లకు బూత్ లెవెల్ అధికారులను త్వరలోనే నియమిస్తామని చెప్పారు.
క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్
జనవరి 6 నుండి ఆగస్టు 15 వరకు మొత్తం 19,237 ఓటర్ల నమోదు దరఖాస్తులు అందగా, అందులో 3,767 తిరస్కరించబడ్డాయని, ఇంకా 16 పెండింగ్‌లో ఉన్నాయని కమిషనర్ వివరించారు. ఫారం-6 ద్వారా వచ్చిన 5,426 దరఖాస్తుల్లో 1,478 తిరస్కరించబడ్డాయని, ఫారం-7 ద్వారా వచ్చిన 3,453 దరఖాస్తుల్లో 1,010 తిరస్కరించబడ్డాయని, 12 పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. ఫారం-8 ద్వారా వచ్చిన 10,358 దరఖాస్తుల్లో 1,279 తిరస్కరించినట్లు వెల్లడించారు.
Read Also- Hanumakoda District: వినాయక చవితి నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ కీలక సూచన
నోడల్ అధికారులు వీరే
* మ్యాన్ పవర్ మేనేజ్‌మెంట్ – ఖైరతాబాద్ జోనల్ కమిషనర్- అనురాగ్ జయంతి
* ఈవీఎం, వీవీ వివిప్యాట్ నిర్వహణ – కూకట్‌పల్లి జోనల్ కమిషనర్- అపూర్వ చౌవన్
* ట్రైయినింగ్ – ఎల్బీనగర్ జోనల్ కమిషనర్- హేమంత్ కేశవ్ పాటిల్
* ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్ మెంట్ – చీఫ్ ట్రాన్స్ పోర్టు ఆఫీసర్- శ్రీనివాస్
* మెటీరియల్ మేనేజ్ మెంట్ – అదనపు కమిషనర్ అడ్మిన్) -కె. వేణుగోపాల్
* ఎంసీసీ – అదనపు ఎస్పీ(విజిలెన్స్ జీహెచ్ఎంసీ) – ఎం. సుదర్శన్
* లా అండ్ ఆర్డర్, వల్నరబుల్ మ్యాపింగ్, డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ ప్లాన్ – డీఎస్పీ నరసింహా రెడ్డి
* ఎన్నికల వ్యయ పరిశీలకులు – చీఫ్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ (జీహెచ్ఎంసీ ) – వెంకటేశ్వర్ రెడ్డి
* ఎన్నికల పరిశీలకులు – అసిస్టెంట్ వెటర్నరీ అధికారి – విల్సన్
* డమ్మీ బ్యాలెట్ పేపర్ – సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ – రవి కిరణ్
* మీడియా కమ్యూనికేషన్, ఎంసీఎంసీ – సీపీఆర్‌ఓ సెక్షన్ పీఆర్‌వో – ఎం.దశరథ్
* సైబర్ సెక్యూరిటీ, ఐటీ, కంప్యూటరైజేషన్ – జాయింట్ కమిషనర్ (ఐటీ) – సీ. రాధా
* హెల్ప్‌లైన్, కంప్లైంట్ రీడ్రెస్సల్ – ఐటీ (ఏఈ) – కార్తీక్ కిరణ్
* వెబ్‌కాస్టింగ్ – ఐటీ (ఏఈ) – తిరుమల కుమార్.