Mysore Crime incident: ప్రియురాలిని ఓ లాడ్జ్‌కు తీసుకెళ్లి, ఆమె నోట్లో పేలుడు పదార్థాలు పెట్టి పేల్చివేసి అత్యంత పాశవికంగా హత్య చేసిన షాకింగ్ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. మైసూరు జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఏదో విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో కోపోద్రిక్తుడైన ప్రియుడు.. పేలుడు పదార్థాలను బలవంతంగా ప్రియురాలి నోట్లో పెట్టాడు. మైనింగ్ క్వారీల్లో జిలిటెన్ స్టిక్స్‌ను పేల్చడానికి ఉపయోగించే ట్రిగ్గర్ సాయంతో ఆ పేలుడు పదార్థాలను నోట్లోనే (Mysore Crime incident) పేల్చివేశాడు. దీంతో, సదరు ప్రేయసి అక్కడికక్కడే చనిపోయింది.
పేలుడు ధాటికి ఆమె ముఖంలోని కింది భాగం ఛిద్రమైపోయింది. తీవ్రమైన రక్తస్రావం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోగా మహిళ మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది. సాలిగ్రామ తాలూకాలోని భేర్యా గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. చనిపోయిన మహిళ వయసు 20 ఏళ్లు అని, ఆమె పేరు రక్షిత అని, హత్యకు పాల్పడ్డ ప్రియుడి పేరు సిద్ధరాజు అని పోలీసులు వెల్లడించారు. ఓ లాడ్జ్‌లో ఈ దారుణ హత్య జరిగిందని తెలిపారు.
Read Also- Hydraa: జూబ్లీ హిల్స్‌లో హైడ్రా పంజా.. 2,000 గజాల స్థలానికి విముక్తి.. రూ.100 కోట్లు సేఫ్!
పోలీసులు తెలిపిన మరిన్ని వివరాల ప్రకారం, ఇద్దరూ లాడ్జ్‌కి వెళ్లిన తర్వాత వారి మధ్య ఘర్షణ జరిగింది. దాంతో సిద్ధరాజు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. రక్షిత నోట్లో పేలుడు పదార్థాన్ని బలవంతంగా పెట్టి పేల్చివేశాడు. అయితే, రక్షిత సెల్‌ఫోన్ పేలి చనిపోయిందని నమ్మించేందుకు నిందితుడు సిద్ధరాజు తొలుత ప్రయత్నించాడు. కానీ, ఆ కొద్దిసేపటికే అసలు నిజం బయటపడింది.
రక్షితకు ఇదివరకే వివాహం
మృతురాలు రక్షిత మైసూరు జిల్లా హున్సూర్ తాలూకాలోని గెరసనహళ్లి గ్రామానికి చెందినదని పోలీసులు తెలిపారు. ఆమెకు కేరళలో ఓ వలస కార్మికుడిగా పనిచేస్తున్న వ్యక్తితో గతంలోనే పెళ్లి జరిగిందని, వివాహం అయినప్పటికీ, సిద్ధరాజుతో సంబంధాన్ని కొనసాగించిందని చెప్పారు. హంతకుడు సిద్ధరాజు స్వస్థలం పెరియపట్న తాలూకాలోని బెట్టదపుర గ్రామమని చెప్పారు. ఇద్దరూ బహిరంగంగా కలుసుకుంటున్నారని, ఓ గొడవ తీవ్రంగా మారి ఈ హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు.
ఘటనా స్థలంలోని తీసిన ఓ వీడియోలోని దృశ్యాలు హృదయవిదారకంగా కనిపిస్తున్నాయి. యువతి శవం మంచంపై పడి ఉండగా, ముఖం కింద భాగం పూర్తిగా పేలిపోయింది. ఫ్లోర్‌పై రక్తం కనిపించింది. మృతురాలి మొబైల్ ఫోన్ పేలడంతో చనిపోయిందంటూ లాడ్జ్ సిబ్బందిని సిద్ధరాజు తొలుత నమ్మించే ప్రయత్నం చేశాడు. అంతలోనే అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. పసిగట్టిన లాడ్జ్ సిబ్బంది సిద్ధరాజుని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు మొదలుపెట్టామని పోలీసులు తెలిపారు.
ఈ షాకింగ్ ఘటనపై మైసూరు జిల్లా ఎస్పీ విష్ణువర్ధన్ కూడా మీడియాతో మాట్లాడారు. మృతురాలు కేరళలో పనిచేస్తున్న ఓ వ్యక్తిని వివాహం చేసుకుందని, అయినప్పటికీ, హంతకుడు సిద్ధరాజుతో సంబంధాన్ని కొనసాగించిందని చెప్పారు. నిందితుడు ఓ రసాయన పదార్థాల మిశ్రమాన్ని ఉపయోగించి హత్య చేశాడని, ఆ పదార్థాలు ఏంటనేది తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పరీక్ష కోసం నమూనాలను పంపించామని ఆయన వెల్లడించారు.