Hanumakoda District: మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడుదాం
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
కలెక్టరేట్‌లో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ
హనుమకొండ, స్వేచ్ఛ: వినాయక విగ్రహాల తయారీలో కృత్రిమ రంగులు, రసాయనాల వినియోగంతో జల వనరులు కాలుష్యానికి గురవుతాయని, కాబట్టి, కృత్రిమ రంగులు, రసాయనాలతో చేసిన విగ్రహాలను మానివేసి, మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ (Hanumakoda District) స్నేహ శబరీష్ పిలుపునిచ్చారు. వినాయక చవితి నేపథ్యంలో ఆమె ఈ సందేశం ఇచ్చారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గట్టి గణపతుల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా పర్యావరణం పట్ల ప్రజల్ని చైతన్యపరిచే విధంగా ‘గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మట్టి గణపతులను ప్రతిష్టించి పూజిద్దాం’ అనే నినాదం ఇచ్చారు. ఈ మేరకు రూపొందించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
Read Also- Team India: సహనం కోల్పోయాడు.. టీమిండియా స్టార్ పేసర్‌పై పంజాబ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ సందర్భంగా, వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ, వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతి జిల్లాకు 2,000 మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తోందని తెలిపారు. మట్టి వినాయకులను పూజించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని, చెరువులను కలుషితం కాకుండా కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి , జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేష్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సునీత, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మా కష్టాలు తీర్చండి
గ్రీవెన్స్‌లో జనగాం జిల్లా కలెక్టర్‌కు విన్నపాలు
జనగామ, స్వేచ్ఛ: ‘మాకు సొంత జాగా ఉంది. కానీ, ఇల్లు కట్టుకునే స్థోమత లేదు. సర్కార్ సాయం చేయాలి. ఇందిరమ్మ ఇల్లు ఇస్తే నిర్మించుకుంటాం’ అని కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషాతో పలువురు పేదలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. జనగామ మున్సిపల్ పరిధిలోని బీరప్పగడ్డ 23వ వార్డు కు చెందిన మేరుగు స్రవంతి కలెక్టర్ ఒక విన్నపం సమర్పించారు. తన భర్త చనిపోయాడని, తాను జీవించేందుకు కూలీ నాలీ చేయడం తప్ప వేరే మార్గం లేదని ఆమె వాపోయారు. వితంతు ఫించన్ ఇస్తే తనకు ఎంతోకొంత సాయంగా ఉంటుందని కలెక్టర్‌ను కోరారు. స్టేషన్ ఘన్‌పూర్ మండలం నమిలికొండ గ్రామానికి చెందిన పులి వనమ్మ తన సమస్యను మొరపెట్టుకున్నారు. ఈ విధంగా పలువురు తమ వ్యక్తిగత సమస్యలు సోమవారం జనగామ జిల్లా కలెక్టరెట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ల దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల సమస్యలు విన్న కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా అధికారులకు పేదలకు వచ్చిన కష్టాలను సానుకూలంగా స్పందించారు. త్వరతగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా 74 దరఖాస్తులను స్వీకరించామని కలెక్టర్ తెలిపారు. అధికారులు చేయదగిన పనులు సత్వరమే చేయాలని, ఏమైనా పెద్ద సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బెన్షాలోమ్, పింకేష్ కుమార్, జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ ఆర్డీవోలు గోపి రామ్, డిఎస్ వెంకన్న, డిప్యూటీ కలెక్టర్ కొమరయ్య, కలెక్టరేట్ ఏ.వో. శ్రీకాంత్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.