Hyderabad Metro: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) జపాన్ పర్యటనలో భాగంగా తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ లో సోనీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. సోని కంపెనీకి చెందిన యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ బృందాన్ని కలుసుకుంది. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అధికారిక పర్యటనలో భాగంగా సోనీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని సీఎం బృందం సందర్శించింది.
సోనీ కార్పొరేషన్ తయారు చేస్తున్న కొత్త ఉత్పత్తులు, చేపడుతున్న కొత్త కార్యక్రమాలను ఆ కంపెనీ ప్రతినిధులు సీఎం బృందానికి వివరించారు. ఉత్పత్తుల తయారీ, నాణ్యతతో పాటు వాటి పని తీరును ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సీఎం బృందం సోనీ కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్‌పై వివరణాత్మక చర్చలు జరిపింది.
యానిమేషన్, వీఎఫ్ఐ,గేమింగ్ రంగాలలో హైదరాబాద్ లో ఉన్న అవకాశాలు, అనుకూలతలను తెలంగాణ బృందం సోనీ కంపెనీ ప్రతినిధులకు వివరించింది. తెలంగాణలో ఎండ్-టు-ఎండ్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని కలిగి ఉండే అత్యాధునిక ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భవిష్యత్తు విజన్ ను సోనీ కంపెనీ ప్రతినిధులతో పంచుకున్నారు.
Also Read; Bhu Bharati Act: మీ భూమి సమస్యకు ఇక పరిష్కారం.. భూభారతిలోనే.. కొత్తగూడెం కలెక్టర్!
నిధుల కోసం జైకాతో చర్చలు
రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధులను సమీకరించుకోవటంలరో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం గురువారం జైకాతో చర్చలు జరిపింది. జపాన్ లో పర్యటిస్తున్న సీఎం సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గురువారం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ఉన్నత యాజమాన్యంతో సమావేశమైంది. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షోహెయ్ హరా, ఆ సంస్థ సీనియర్ మేనేజర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు రెండో దశ, మూసీ పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి అవుటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానించే రేడియల్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని సీఎం బృందం జైకాను కోరింది. పెట్టుబడిదారులను ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సానుకూల విధానాలు, ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా హైదరాబాద్ ను అత్యంత ఆకర్షణీయమైన నగరంగా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రి ఈ సమావేశంలో జైకాకు వివరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ. 24,269 కోట్ల అంచనాలతో చేపట్టనున్న మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రం తుది పరిశీలనలో ఉన్నాయని జైకా బృందానికి వివరించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమమ్యే వ్యయంలో 48 శాతం ( రూ.11,693 కోట్లు) రుణం అందించి సహకరించాలని సీఎం కోరారు. భారత ప్రభుత్వ విదేశీ రుణ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పాటిస్తుందని స్పష్టం చేశారు.
మెట్రో తో పాటు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, కొత్త రేడియల్ రోడ్లకు నిధులు సమకూర్చాలని ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్, టోక్యో లాంటి ప్రపంచ నగరాలతో సమానంగా అభివృద్ధి చేయాలనే తన ఆలోచనలను సీఎం వారితో షేర్ చేసుకున్నారు.జైకాకు, తెలంగాణతో ఎన్నో ఏళ్లుగా సంబంధాలున్నాయని జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షోహెయ్ హరా అన్నారు.
Also Read: Bhu Bharati Portal: భూ భారతిపై కీలక అప్ డేట్.. రేపే కీలక సదస్సులు ప్రారంభం..
మెట్రో రైలు విస్తరణతో పాటు, అర్హతలున్న ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు జైకా నుంచి ఆర్థిక సాయం పొందేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సీఎం రేవంత్(Revanth Reddy) కు సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి వి. శేషాద్రి, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, తెలంగాణకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు