Bhu Bharati Portal: భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని భూభారతి చట్టాన్నితీసుకువచ్చినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) అన్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన భూభారతి చట్టం ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేరినప్పుడే దానికి సార్ధకత ఏర్పడుతుందన్నారు. భూభారతి అవగాహన సదస్సులపై తాజాగా మంత్రి సమీక్షించారు. ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు, పకడ్బందీగా అమలు చేయాలన్న లక్ష్యంతో గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
రెవెన్యూ సదస్సులు
భూభారతి పైలట్ ప్రాజెక్ట్ అమలు చేసే నాలుగు మండలాల్లో గురువారం నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. నారాయణ్‌పేట జిల్లా మద్దూర్ మండలంలోని కాజాపురం గ్రామంలో భూభారతి పైలట్ ప్రాజెక్ట్‌ను తానే స్వయంగా ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఆ తర్వాత వికారాబాద్ జిల్లా పూడూరు గ్రామంలో జరిగే అవగాహనా సదస్సులో పాల్గొంటానని చెప్పారు. 18వ తేదీన ములుగు జిల్లా వెంకటాపురంలో ఉదయం జరిగే రెవెన్యూ సదస్సులోనూ, తర్వాత ఆదిలాబాద్ జిల్లాలోనూ జరిగే సదస్సులో పాల్గొంటానని మంత్రి పొంగులేటి తెలిపారు.
ముందు రోజే అందజేత
రాష్ట్రంలోని నారాయణ్‌పేట్ జిల్లా మద్దూర్ మండలంతోపాటు , ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాల్లో ప్రయోగాత్మకంగా ఈ చట్టాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ప్రయోగాత్మకంగా భూభారతిని అమలు చేసే ఈ నాలుగు మండలాల్లో భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి వాటికి రశీదులను అందజేస్తారన్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక ఫార్మేట్ లో తయారుచేసిన దరఖాస్తులను రెవెన్యూ సదస్సు ముందురోజే ప్రజలకు ఇవ్వడం జరుగుతుందన్నారు.
Also Read: Cricket Stadium Amaravati: దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం.. ఇక్కడే అన్నీ మ్యాచ్ లు.. మీరు సిద్ధమా!
కలెక్టర్లకు ఆదేశాలు
కోర్టు పరిధిలో ఉన్న భూముల మినహా ప్రతి దరఖాస్తును మే 1వ తేదీ నుంచి పరిష్కరిస్తామని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఏ రోజుకారోజు కంప్యూటర్ లో నమోదు చేసి ఆయా సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుందన్నారు. ఒకవైపు నాలుగు మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో భూభారతి చట్టంపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ అవగాహన సదస్సులకు సంబంధించి కలెక్టర్లు ప్రతిరోజూ ప్రతి మండలంలో రెండు కార్యక్రమాలలో పాల్గొనే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.