Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రజల మధ్య నాలుగు నెలల పాటు యాత్ర చేయనున్నట్లు కవిత అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ‘జాగృతి జనం బాట’ పేరుతో ఆమె పోస్టర్ ను లాంచ్ చేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. మరోమారు బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. తన తండ్రి కేసీఆర్ గురించి ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘తొలి నుంచి జాగృతి సెపరేట్’
తెలంగాణ జాగృతి పుట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తున్నట్లు కవిత అన్నారు. కేసీఆర్ (KCR) నుంచి సలహాలు తీసుకొని జాగృతి కార్యక్రమాలు ఎప్పుడూ నిర్వహించలేదని స్పష్టం చేశారు. భౌగోళిక తెలంగాణను తెచ్చుకున్నాం కానీ సామాజిక తెలంగాణను సాధించలేకపోయామని కవిత పేర్కొన్నారు. సామాజిక తెలంగాణ గురించి ప్రస్తావిస్తే.. బీఆర్ఎస్ (BRS) తనను తప్పుబట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని ఆరోపించారు. సామాజిక తెలంగాణ అనేది విధానపరమైన అంశమన్న కవిత.. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మించిన గురువులు లేరని చెప్పుకొచ్చారు.
ప్రతీ జిల్లాలో రెండ్రోజులు బస
హైదరాబాద్ లో కూర్చుని రాష్ట్ర ప్రజల సమస్యలు గురించి మాట్లాడితే ఉపయోగం ఉండదని కల్వకుంట్ల కవిత అన్నారు. అందుకే గ్రౌండ్ లెవెల్ లో పని చేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ‘జాగృతి జనం బాట’ (Jagruthi Janam Bata) కార్యక్రమంలో భాగంగా.. ప్రతీ జిల్లాలో రెండు రోజులు ఉండనున్నట్లు చెప్పారు. అక్కడి ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటానని చెప్పారు. ‘గ్రామాల్లోని ప్రతి రైతు, మహిళా, యువతతో మాట్లాడతాం. నాలుగు నెలల యాత్రను చేపడుతున్నాం’ అని అన్నారు.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దెబ్బకు నర్సింగ్ స్కూళ్లపై ఏకకాలంలో డీఎంఈ అధికారుల దాడులు!
కేసీఆర్ ఫొటో లేకపోవడంపై..
‘జాగృతి జనం బాట’ పోస్టర్ లో తన తండ్రి కేసీఆర్ ఫొటో లేకపోవడంపై కవిత స్పందించారు. కేసీఆర్ ఫోటో లేకుండానే ఈ యాత్ర సాగుతుందని స్పష్టం చేశారు. ‘బీఆర్ఎస్ నన్ను సస్పెండ్ చేసింది. కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ అధినేత. నేను చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకం కాదు. కేసిఆర్ అనే మహా వృక్షం కింద దుర్మార్గులు ఉన్నారు. ఈ విషయం అనేక మార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో నేను నా దారి వెతుక్కుంటున్నా. ఇంత జరిగిన తర్వాత కూడా కేసీఆర్ ఫొటోను పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లలేను. అది నైతికంగా మంచిది కాదు’ అని కవిత చెప్పుకొచ్చారు.
LIVE: ప్రజా యాత్ర పోస్టర్ ఆవిష్కరణ https://t.co/MCCIKKcWQD
— Telangana Jagruthi (@TJagruthi) October 15, 2025
‘జాగృతి జనం బాట’ వ్యూహాం
జాగృతి సంస్థ బలోపేతంలో భాగంగానే కవిత రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల చివరి వారం నుంచి పర్యటనలకు ప్లాన్ చేశారు. ప్రతి జిల్లాలో రెండ్రోజుల పాటు పర్యటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ మేధావులు, కవులు, కళాకారులు, నిరుద్యోగులు, యువత, మహిళా, విశ్రాంత ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలతో భేటి అయ్యి వారి సమస్యలను కవిత తెలుసుకోనున్నారు. ఆయా జిల్లాలోని ప్రధాన సమస్యలు తెలుసుకొని వాటిని నివేదిక రూపంలో పొందుపర్చనున్నట్లు సమాచారం. ప్రాధాన్యత క్రమంలో ఆ సమస్యలపై పోరాటం బాట పట్టనున్నట్లు తెలిసింది. తద్వారా బీఆర్ఎస్ కంటే బెటర్ గా అధికార కాంగ్రెస్ పై పోరాటం చేయాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది.
