Jubilee Hills Bypoll: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను అమాంతం పెంచేశాయి. జూబ్లీహిల్స్ లో విజయమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ముందుకు సాగుతున్నాయి. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థిని ప్రకటించగా.. బీజేపీ అభ్యర్థి ఖరారు కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై తీవ్ర స్థాయిలో చర్చ సైతం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా జూబ్లీహిల్స్ అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసింది.
బీజేపీ అభ్యర్థి ఎవరంటే?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల బరిలో బీజేపీ తరపు అభ్యర్థిగా దీపక్ రెడ్డికి అవకాశం లభించింది. ఆయన పేరును బీజేపీ అధినాయకత్వం ఖరారు చేసింది. దీంతో ఆయన తోటి అభ్యర్థులు నవీన్ యాదవ్ (కాంగ్రెస్), మాగంతి సునీత (బీఆర్ఎస్)తో ఎన్నికల్లో తలపడనున్నారు. అయితే జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి స్థానం కోసం చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రధానంగా జూటూరి కీర్తి రెడ్డి, లంకల దీపక్ రెడ్డి మధ్య పోటీ ఏర్పడింది. చివరకి దీపక్ రెడ్డి వైపే పార్టీ అధిష్టానం మెుగ్గుచూపింది. కాగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి దీపక్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉండటం గమనార్హం.
2023 ఎన్నికల్లో ఓటమి..
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి దీపక్ రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దివంగత మాగంటి గోపినాథ్ (Maganti Gopinath) చేతిలో ఓటమి పాలయ్యారు. జూబ్లీహిల్స్ లో పోలైన మెుత్తం ఓట్లలో 14.11 శాతం దీపక్ రెడ్డికి వచ్చాయి. దీపక్ రెడ్డిని ఎమ్మెల్యేగా కోరుకుంటా 25,866 మంది ఆయనకు ఓటు వేశారు. అయితే మాగంటి గోపినాథ్ మరణంతో మరోమారు జూబ్లీహిల్స్ స్థానానికి ఉప ఎన్నికలు రావడంతో.. తిరిగి దీపక్ రెడ్డికే బీజేపీ అవకాశం కల్పించడం గమనార్హం.
