Mahabubabad News: బీఆర్ఎస్ నుంచి ఆరుగురు పోటీ
కాంగ్రెస్ నుంచి రేసులో ఇద్దరు
మానుకోట మునిసిపాలిటీ రసవత్తరం
రిజర్వేషన్లు ఖరారు కాకపోయినా.. కాకరేపుతున్న మానుకోట పాలిటిక్స్
సీపీఐ కాంగ్రెస్ వైపు, సీపీఎం రెండు పార్టీ లపై చూపు
మహబూబాబాద్, స్వేచ్ఛ: మానుకోట మునిసిపాలిటీ చైర్మన్ రేస్‌లో రసవత్తర పరిస్థితులు (Mahabubabad News) కనిపిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం ఉన్న వార్డ్ కౌన్సిలర్లు ప్రస్తుతం చైర్మన్ రేస్‌లో బలంగా నిలబడేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన చరిత్ర వాళ్లు కావడం ఆసక్తికరంగా మారింది. అయితే గత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి వార్డు కౌన్సిలర్లుగా మెజారిటీ స్థానాలను గెలిచినప్పటికీ ఈసారి చైర్మన్ రేసులో వాళ్లు లేకపోవడం విశేషం. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం భారీగానే చైర్మన్ రేసులో గత వార్డు కౌన్సిలర్లుగా గెలిచినవారు నిలబడుతున్నారు. చైర్మన్ పదవి గతంలో మొదటిసారి ఎస్టీ, జనరల్ కేటగిరీలకు చెందిన వారికి రిజర్వ్ అయింది. ఈసారి బీసీ జనరల్, బీసీ, ఎస్టీ కేటగిరీలకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ప్రధానంగా బీసీ, బీసీ జనరల్ వారికే ఎక్కువ అవకాశం ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య భారీగా పెరిగింది. ఇందులో మాజీ వైస్ చైర్మన్‌లుగా పనిచేసిన మహమ్మద్ ఫరీద్, మార్నేని వెంకన్న లతోపాటు కౌన్సిలర్లుగా పనిచేసిన గుండ స్వప్న (రాజశేఖర్), గద్దె రవి, పీఏసీఎస్ చైర్మన్లుగా పనిచేస్తున్న నాయిని రంజిత్, మాజీ ఎంపీ మాలోత్ కవిత ఫాలోవర్ ముత్యం వెంకన్నలు చైర్మన్ రేసులో నిలిచేందుకు అన్ని రకాలుగా సంసిద్ధులవుతున్నారు.
మార్నేని వెంకన్న
మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు. మొదటినుంచి బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ అధినేత కేసీఆర్‌కు అత్యంత సుపరిచితులుగా పేరుపొందారు. అంతేకాకుండా ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు కు అనుకూలంగా ఉంటున్నారు. ఈయన గతంలో కూడా రెండు పర్యాయాలు వార్డు కౌన్సిలర్‌గా (భార్య) గెలుపొందారు. అదేవిధంగా మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఫాలోవర్‌గా ఉంటూ వచ్చిన ఎండీ ఫరీద్ రెండు పర్యాయాలు గెలిచి ఒకమారు మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. ఇందులో మారినేని వెంకన్న అన్ని వర్గాలను కలుపుకుపోయి అందరిని సమన్వయ పరిస్తే, ఆయనకు పీఏసీఎస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న నాయిని రంజిత్ సహకరించుతాడని ఆ పార్టీ నాయకుల ద్వారా తెలుస్తోంది.
Read Also- Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో పంట పొలాల్లో తిరుగుతున్న పోలీసులు.. ఎందుకో తెలుసా?
ఘనపురపు అంజయ్య
గణపురపు అంజయ్య తెలంగాణ ఉద్యమకారుడు. బీఆర్ఎస్ పార్టీలో పదవులు లేకపోయినప్పటికీ పార్టీలో సమన్వయం తీసుకొస్తూ వచ్చారు. స్టూడెంట్ యూనియన్ నుంచి ఎన్‌ఎస్‌యూఐలో పనిచేశారు. ఆ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం ఆ పార్టీ నేతలు స్వాగతించి అత్యంత కీలకమైన మహబూబాబాద్ అర్బన్ అధ్యక్షుడి బాధ్యతలను అప్పగించారు. నాటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం పై విరుచుకుపడుతూ మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ గెలుపుకు తనవంతు శాయశక్తులా పనిచేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటూ మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ పదవి కోసం గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా, 2024 సంవత్సరంలో వర్ష బీభత్సానికి గురైన ప్రాంతాలను సందర్శించి ఆయన శక్తిసామర్థ్యాల మేరకు నిరాశ్రయులకు సహాయం చేశారు. అంతేకాకుండా ప్రస్తుత ఎంపీ, ఎమ్మెల్యేలకు అత్యంత సన్నిహితుడిగా మసలుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మన్ రేసులో ముందు వరుసలో ఘనపురపు అంజయ్య ఉన్నారు.
Read Also- Prabhas Interview: సందీప్ రెడ్డితో ప్రభాస్ కింగ్ సైజ్ ఇంటర్వ్యూ.. ఫుల్ వీడియో వచ్చేసింది..
పద్మం ప్రవీణ్
2018 మున్సిపాలిటీ ఎన్నికల్లో తాజా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న మీద పోటీ చేసి 30 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి టిఆర్ఎస్ పార్టీకి ఎన్నో రకాల సేవలు అందించిన మార్నేని వెంకన్న ఒకానొక టైంలో ఓడిపోతారని ప్రచారం కూడా సాగింది. ఆ సమయంలో పద్మం ప్రవీణ్ తన శక్తి సామర్థ్యాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి నిరూపించుకున్నారు. అనంతరం పార్టీలో చురుకుగా పనిచేస్తూ చైర్మన్ రేస్ లో తానున్నానంటూ పార్టీ కోసం పనిచేస్తున్నారు. జిల్లాలో మంత్రుల పర్యటనల సందర్భంగా తన సొంతంగా 30 నుంచి 40 లక్షల దాకా ఖర్చు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ చైర్మన్ పదవి రేసులో ఉన్నారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్‌కు జనబలం… బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆర్థిక బలం
గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీలో పని చేస్తూ ఉన్న వారందరూ ఆర్థికంగా బలంగానే నిలదొక్కుకున్నారు. పార్టీ లో పనిచేసే వారందరూ చైర్మన్ రేస్ లో సిద్ధమై ఆర్థిక బలంతో ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే వారు కూడా ఆర్థికంగానే బలంగా ఉన్నప్పటికీ ప్రజా బలం ఎక్కువగా ఉంది. గత పది ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తి చూపుతూ ఆదిపత్యం కొనసాగిస్తోంది. అదేవిధంగా మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లోను జనబలంతో ఎక్కువ వార్డు కౌన్సిలర్లను గెలిపించుకొని చైర్మన్ పదవిని చేజిక్కించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

