Ponguleti Srinivasa Reddy: పేదవాడి సొంతింటి కలను నెరవర్చే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, చెల్లింపుల విషయంలో అవినీతికి పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Min Ponguleti Srinivass Reddy) హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సమస్యలు, సందేహాలకోసం గతవారం హౌసింగ్ కార్పొరేషన్‌లో ప్రారంభించిన కాల్‌సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులపై సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంత్రి పొంగులేటి హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్(VP Goutham), సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏడీజీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తోకలిసి సుదీర్ఘంగా సమీక్షించారు. ఏయే అంశాలపై కాల్ సెంటర్‌కు ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులను అడిగి తెలుసుకుని తక్షణ చర్యలకు ఉపక్రమించారు.
ఇల్లు మంజూరు కోసం రూ.10 వేలు డిమాండ్..
ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు లబ్ధిదారుల నుంచి లంచం అడిగే ఇందిరమ్మ కమిటీ సభ్యులను తక్షణమే కమిటీ నుంచి తొలగించి క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి సూర్యాపేట(Suryapet) జిల్లా మధిరాల మండలం పోలుమల్ల గ్రామంలో కొండ లింగయ్య అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం రూ.10 వేలు డిమాండ్ చేసిన ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సత్తయ్యను, జనగామ(janagon) జిల్లా దేవరుప్పుల మండలం పడమటితండాలో శివమ్మ అనే లబ్ధిదారురాలి నుంచి రూ.30 వేలు ఇవ్వాలని గ్రామపంచాయతీ సెక్రటరీ డిమాండ్ చేశారని ఫిర్యాదు అందిందని అధికారులు మంత్రికి వివరించారు. విచారణలో ఇందిరమ్మ కమిటీ సభ్యుడి పాత్ర ఉందని తేలిందని పేర్కొన్నారు. దీంతో ఈ అంశంపై పూర్తిస్ధాయి విచారణ జరిపి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
Also Read: Shocking Incident: ఇండియన్ తాత.. అమెరికా బామ్మ.. విస్తుపోయే క్రైమ్ కథా చిత్రం!
బ్యాంకులపై చర్యలు..
ఖమ్మం(Khammam), జగిత్యాల, కొత్తగూడెం(Kothagudem), ఆదిలాబాద్(Adhilabad) జిల్లాల్లో ఇండ్లు మంజూరుకాని నలుగురికి వారి ఖాతాలో నిధులు జమచేసిన గ్రామపంచాయతీ కార్యదర్శులను తక్షణమే సస్పెండ్ చేసి ఈసంఘటనపై పూర్తిస్ధాయి విచారణ జరిపించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ దశలను బట్టి ప్రతి సోమవారం నిధులు మంజూరు చేస్తున్నామని, అయితే కొన్ని బ్యాంకులు ఈ నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమచేసి పాత బకాయి కింద జమ చేసుకుంటున్నాయని, ఇలాంటి చర్యలను సహించేదిలేదన్నారు. సదరు బ్యాంకులపై చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దీనిపై రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీకి లేఖ రాయాలని హౌసింగ్ ఎండీని ఆదేశించారు. ఆధార్ నంబర్ ఆధారంగా చెల్లింపుల్లో ఎదురవుతున్న సమస్యలను ఈనెల 25వ లోగా పరిష్కరించి దసరా పండగలోపు చెల్లింపులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.
దిద్దుబాటు చేసుకునేలా యాప్..
ఏఈలు కూడా ప్రతి గ్రామంలో లబ్ధిదారుడి వద్దకు వెళ్లి ఆధార్, బ్యాంకు వివరాలను పరిశీలించాలన్నారు. లబ్ధిదారుడు కూడా బ్యాంకుకు వెళ్లి ఆధార్‌నంబర్‌తో బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకోవాలని సూచించారు. ఆధార్ నంబర్, పేరు తప్పు ఉంటే గ్రామ కార్యదర్శి, ఎంపీడీవో దృష్టికి తీసుకువెళ్లి సరిచేసుకోవాలన్నారు. త్వరలో లబ్ధిదారుడే స్వయంగా ఈ దిద్దుబాటు చేసుకునేలా యాప్‌ను తయారుచేశామని, ఒకట్రెండు రోజుల్లో ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో పేదలను ఇబ్బందిపెట్టి డబ్బుల వసూళ్లకు పాల్పడితే ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదును ఆయా జిల్లా కలెక్టర్, ఎస్పీకి పంపడంతోపాటు సచివాలయంలోని తన కార్యాలయానికి కూడా పంపించాలని అధికారులకు సూచించారు. ఇటువంటి ఫిర్యాదులపై తమ కార్యాలయం కూడా మానిటరింగ్ చేస్తుందని తెలిపారు. లంచమడిగితే టోల్ ఫ్రీ నంబర్ 18005995991కు కాల్ చేసి వివరాలను తెలియజేయాలని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు.
Also Read: Rahul Gandhi: ఉదయం 4 గంటలకు నిద్రలేచి.. 36 సెకన్లలోనే 2 ఓట్లు డిలీట్.. రాహుల్ గాంధీ మరో బాంబ్