- వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులకు ఆశీర్వాదం
- ఓ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలకు కూడా హాజరు
- పాలేరు, ఖమ్మం నియోజకవర్గాలను చుట్టేసిన మంత్రి పొంగులేటి సతీమణి మాధురి
ఖమ్మం, స్వేచ్ఛ: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) సతీమణి పొంగులేటి మాధురి (Ponguleti Madhuri) కేవలం ఆరున్నర గంటల వ్యవధిలోనే వివిధ రకాల 24 శుభ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం సీత్యా తండాలో అభయాంజనేయస్వామి విగ్రహా ప్రతిష్ఠాపనకు హాజరవ్వడంతో మాధురి పర్యటన మొదలైంది.
Read this- Chandrababu: ఆపరేషన్ సిందూర్‌పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అక్కడి నుంచి నిర్విరామంగా సుమారు ఆరున్నర గంటలపాటు పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగించారు. పర్యటనలో భాగంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన ఆలయ విగ్రహా ప్రతిష్టా మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసి పట్టు వస్త్రాలను కానుకగా అందించారు. వివాహ వేడుకలకు సైతం హాజరై నిండు నూరేళ్లు చల్లగా ఉండాలంటూ నూతన వధూవరులను ఆశీర్వదించారు. పంచెకట్టు, ఓణీల అలంకరణ వేడుకల్లో సైతం ఆమె పాల్గొని చిన్నారులను దీవించారు.
బిజీబిజీగా ఆదివారం
పొంగులేటి మాధురి ఆదివారం రోజంతా ఆయా ప్రాంతాల్లో జరిగిన శుభకార్యాలకు హాజరయ్యి బిజీబిజీగా గడిపారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం బికారి తండా, సీత్యా తండా, నాయకన్ గూడెం, పాలేరు, చేగొమ్మ గ్రామాల్లో, ఆ తర్వాత నేలకొండపల్లి మండలం కోరట్లగూడెం, పైనంపల్లి, గువ్వలగూడెం గ్రామాల్లో, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుదిమళ్ల, సత్యనారాయణ పురం, కరుణగిరి, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని దానవాయిగూడెం, ఎఫ్‌సీఐ గోదాం, ఖానాపురం, బల్లేపల్లి, శ్రీనగర్ కాలనీ, రాపర్తినగర్ , గోపాలపురం, మమత రోడ్ తదితర ప్రాంతాల్లో జరిగిన శుభకార్యక్రమాల్లో మాధురి పాల్గొన్నారు.
Read this- Rinku Singh Engagement: పొలిటీషియన్‌తో క్రికెటర్ రింకూ సింగ్ నిశ్చిత్తార్థం
మంగళ హారతులతో స్వాగతం
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకుంటున్న లబ్ధిదారుల వద్దకు, వివాహ వేడుకలు, ఇతర శుభకార్యక్రమాలు జరుపుకుంటున్నవారి ఇళ్లకు, ఫంక్షన్ హాళ్లకు స్వయంగా మంత్రి గారి సతీమణి విచ్చేయడంపై కార్యక్రమాల నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. మాధురి అడుగుపెట్టిన ప్రతిచోటా నిర్వాహకులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు, మంగళ హారతులు ఇచ్చారు. పలుచోట్ల శాలువాలు కప్పి సత్కరించారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, పొంగులేటి అభిమానులు పాల్గొన్నారు.