Anti-Narcotics Award: రాష్ట్ర పోలీసుల కిరీటంలో మరో కలికితురాయి చేరింది. పోలీసింగ్ లో ఇటీవల దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన మన పోలీసులు మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ఈసారి డ్రగ్స్ కట్టడిలో హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. దుబాయ్ లో నిర్వహించిన వరల్డ్ పోలీస్ సమ్మిట్ లో హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం తరపున కమిషనర్ సీ.వీ.ఆనంద్ ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్ అవార్డును అందుకున్నారు.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్కతలు స్వీకరించిన వెంటనే తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్ గా మార్చాలని పోలీసు శాఖకు దిశా నిర్దేశం చేసిన విషయం తెలిసిందే. దీని కోసం ప్రభుత్వం తరపున ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైనా అంద చేస్తానని ఆయన చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్ర పోలీసులు…ముఖ్యంగా నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ డ్రగ్స్ పై యుద్ధాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఈ వింగ్ కు డైరెక్టర్ గా ఉన్న సందీప్ శాండిల్య మాదక ద్రవ్యాల దందాకు చెక్ పెట్టటానికి విస్తృత చర్యలు తీసుకున్నారు.
Also Read: Uttam Kumar Reddy: ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై కలెక్టర్లతో.. మంత్రి కీలక సమీక్ష!
ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయాన్ని కుదుర్చుకున్నారు. అదే సమయంలో డ్రగ్స్ వినియోగించటం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ముఖ్యంగా విద్యార్థినీ, విద్యార్థుల్లో విస్తృత అవగాహన కల్పించారు. కాలేజీల్లో యాంటీ డ్రగ్స్ బృందాలను ఏర్పాటు చేయించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
అదే సమయంలో పటిష్టమైన ఇన్ఫార్మర్ల నెట్ వర్క్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ డ్రగ్స్ ను అరికట్టటంలో సత్ఫలితాలను సాధిస్తూ వస్తోంది. ఈ క్రమంలో మాదక ద్రవ్యాలను అరికట్టటంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. దుబాయ్ లో జరిగిన వరల్డ్ పోలీస్ సమ్మిట్ లో ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్ అవార్డును కమిషనర్ ఆనంద్ అందుకున్నారు.
Also Read: Also Read: BRS Party: అసలు మ్యాటర్ ఏంటి? గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది?
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలోని 138 దేశాలకు చెందిన పోలీసు దళాలతో పోటీ పడి హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం అగ్రస్థానంలో నిలబడటంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును సాధించటంలో కీలక పాత్ర వహించిన సిబ్బంది కృషిని ప్రశంసించారు. డ్రగ్స్ ను అరికట్టటానికి మరింత అంకిత భావంతో పని చేయటానికి ఈ అవార్డు స్ఫూర్తినిస్తుందన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు