Telangana: తెలంగాణలో ‘దూపదీప నైవేద్యం’ పథకంలో తమ గ్రామ ఆలయాన్ని చేర్చాలని కోరుతూ దేవాదాయ శాఖకు అభ్యర్థనల వెల్లువ వచ్చింది. ప్రభుత్వం కేవలం 250 ఆలయాలను ఎంపిక చేయాలని నోటిఫికేషన్ ఇవ్వగా రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 6,300కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ దరఖాస్తులను చూసి అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం లేని ఆలయాల్లో నిత్యం పూజాకైంకర్యాలు కుంటుపడకుండా ఉండేందుకు దేవాదాయ శాఖ ఈ పథకం తీసుకొచ్చింది. దీని కింద ఎంపికైన ఆలయాలకు ప్రతినెలా రూ.10 వేలు అందజేయనుంది. దరఖాస్తులు భారీగా రావడంతో ఎంపిక కోసం అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కాగా ఈ పథకానికి ఆలయం అర్హత పొందాలంటే సంబంధిత ఆలయం విధిగా 15 ఏళ్లు దేవాదాయశాఖలో రిజిస్ట్రార్ అయి ఉండాలి.
విడతలవారీగా ఆలయాలు
‘దూపదీప నైవేద్యం’ పథకంలో భాగమయ్యే ఆలయాలకు ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టింది. దీని ప్రకారం ఆలయానికి ఆర్థిక వనరులు, భక్తుల సంఖ్య, రెవెన్యూ తక్కువగా ఉండాలి. ఆలయం గ్రామీణ ప్రాంతంలో నిర్మితమై ఉండాలి’ అని అధికారులు చెబుతున్నారు. ఈ నిబంధనల ప్రకారం అధికారులు దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. మొత్తం వచ్చిన వాటిలో 1,350 ఆలయాలు అన్ని అర్హతలు ఉన్నట్లు సమాచారం. వీటిలో విడతలవారీగా ఆలయాలను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్‌లో 180 ఆలయాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా మరో 70 ఆలయాల ఎంపిక ప్రక్రియ సెకండ్ ఫేజ్‌లో కొనసాగుతోంది.
రాజకీయ ఒత్తిళ్లు!
ఈ పథకంలో తమ ప్రాంతంలోని ఆలయాలను చేర్చితే రాజకీయంగా లాభం ఉంటుందని భావించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నాయకులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, ఎండోమెంట్ అధికారులు నిబంధనల మేరకే ఎంపిక ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అధిక దరఖాస్తులు రావడంతో, అదనంగా మరో వెయ్యి నుంచి 1500 ఆలయాలను ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన ఫైల్‌ను కూడా ఆర్థిక శాఖకు పంపినట్లు సమాచారం.
Also Read: Trains Cancelled: మెుంథా తుపాను ఎఫెక్ట్.. విశాఖ మీదగా వెళ్లే 43 రైళ్లు రద్దు.. పూర్తి లిస్ట్ ఇదే!
నెలకు రూ.6.54 కోట్లు కేటాయింపు
ప్రస్తుతం రాష్ట్రంలో 6,541 ఆలయాలకు నెలకు రూ. 6.54 కోట్లు కేటాయిస్తున్నారు. అదనంగా మరో 250 ఆలయాలను చేర్చితే ప్రభుత్వానికి రూ.25 లక్షల వరకు భారం పడుతుంది. ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వస్తే, మరికొన్ని ఆలయాల్లో నిత్య పూజలు కొనసాగే అవకాశం ఉంది. నిధులు లేక పూజలు కుంటుపడి, కొన్ని ఆలయాలు శిథిలావస్థకు చేరుతున్న నేపథ్యంలో, ప్రజా ప్రభుత్వంలో తమ ఆలయాలకు మహర్దశ వస్తుందని దరఖాస్తుదారులు ఆశిస్తున్నారు.
