Huzurabad: గ్రామాల్లోని సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. సోమవారం ఇల్లందకుంట మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో నిర్వహించిన ‘పల్లె పల్లెకు ప్రణవ్’ కార్యక్రమంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని సమస్యలే ప్రధాన ఎజెండాగా చర్చించారు. ఈ పర్యటనలో భాగంగా మండల వ్యాప్తంగా రూ. 6,28,000 విలువ చేసే 19 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) చెక్కులను ప్రణవ్ అందజేశారు. లబ్ధిదారులు త్వరగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని కోరారు.
Also Read: Telangana: ‘దూపదీప నైవేథ్యం’ స్కీమ్.. ఆలయాల నుంచి భారీగా దరఖాస్తులు.. అధికారుల మల్లాగుల్లాలు!
అనంతరం కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ప్రణవ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ కాలంలో అమలు చేసిన ఇందిరమ్మ ఇళ్లు, రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పెంపు, ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు. కోవర్టు రాజకీయాలు, గ్రూప్ రాజకీయాలకు తావులేకుండా సిన్సియారిటీతో కష్టపడి పనిచేయాలని, కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో హుజురాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
