Harish Rao: గ్రావిటీతో నీళ్లు తెచ్చి చూపించండి
ప్రభుత్వానికి జనం బుద్దిచెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ్
148 మీటర్ల వద్ద తుమ్మిడిహట్టి నిర్మిస్తే మనకు 50 టీఎంసీలే
మూసీ నిర్వాసితులకు 2013 ప్రకారం పరిహారం చెల్లించాలి
కాళేశ్వరంలో భాగమే మల్లన్న సాగర్
ఈ ప్రాజెక్టు హైదరాబాద్‌కు, రైతులకు వరం
నోరుంటే అబద్దాలు నిజాలు కావు
మంచి పనులు చేస్తే మేము సహకరిస్తాం
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయన్నారు కదా తెచ్చి చూపించాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీశ్ రావు సవాలు విసిరారు. ‘‘152 మీటర్లకు అగ్రిమెంట్ ఉండగా మేడిగడ్డకు ఎందుకు పోయారని ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు వారే నిజం ఒప్పుకున్నారు. తుమ్మిడిహట్టి వద్ద 148 మీటర్లకు అగ్రిమెంట్ ఉందని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. 148 మీటర్ల వద్ద బ్యారేజీ కడితే కేవలం 50 టీఎంసీల కంటే మనం ఎక్కువ తీసుకోలేం’’ అని హరీశ్ రావు (Harish Rao) పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి జనం బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే తాము కూడా సహకరిస్తామని చెప్పారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడంతోనే, మల్లన్న సాగర్ 50 టీఎంసీలతో నిర్మించబట్టే హైదరాబాద్‌కు నీళ్లు తేగలుగుతున్నావంటూ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.
Read Also- Siachen Avalanche Tragedy: మంచుకొండ చరియలు విరిగిపడి ముగ్గురు సైనికులు కన్నుమూత
రేవంత్ కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతున్నారని, ఎక్కడ రిబ్బన్ కనిపిస్తే అక్కడ కత్తిరిస్తున్నారంటూ హరీశ్ రావు ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి నిన్న ప్రారంభించిన ట్యాంకులు కేసీఆర్ పాలనలోనే ప్రారంభించినవేనని అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు హై లెవెల్ బ్రిడ్జి పూర్తి కాలేదు.. ఆర్అండ్ఆర్ పూర్తి కాలేదు.. ల్యాండ్ అక్విజేషన్ పూర్తి కాలేదు.. గ్రామ ప్రజలను ఖాళీ చేయించలేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టును రూ.2052 కోట్లతో పూర్తి చేసి 2016లో పూర్తిస్థాయిలో 20 టీఎంసీల నీళ్లు నింపామన్నారు. చిల్లర రాజకీయాలకు పోలేదని, ఎల్లంపల్లి కెపాసిటీ 20 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ మూడు టీఎంసీలు అని పేర్కొన్నారు. మిగిలిన 17 టీఎంసీల్లో సొంత ఆయకట్టు 1,65,000 ఎకరాలు అంటే 12 టీఎంసీలు పోతాయన్నారు.
ఎల్లంపల్లి కెపాసిటీకి మించి మరో 20 టీఎంసీలు హైదరాబాద్‌కి ఎలా తెస్తారని రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్ కు నీళ్లు గాలిలో వస్తున్నాయా ? అని నిలదీశారు. కాళేశ్వరంలో భాగంగానే మల్లన్న సాగర్‌ను నిర్మించామన్నారు. కేసీఆర్ ముందు చూపుతో హైదరాబాద్ మంచి నీటి కోసం మల్లన్న సాగర్లో స్లూయిస్ కూడా నిర్మించారన్నారు. గండిపేట దగ్గర కొబ్బరికాయ కొట్టినవంటే ఆ గండిపేటకు హిమాయత్ సాగర్ కి వచ్చే నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు..అవి కాళేశ్వరం మోటార్ల ద్వారా వచ్చే నీళ్లు అని స్పష్టం చేశారు. కాళేశ్వరం కోసం ఖర్చు చేసిన రూ.93 వేల కోట్లలో భాగంగా నిర్మించింది మల్లన్న సాగర్ ప్రాజెక్టు అని హరీశ్ రావు అన్నారు.
మూసీలో ఖాళీ చేయించిన వారికి రేవంత్ రెడ్డి 25 వేల చెక్కు ఇచ్చారని, ఆ చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయని ఎద్దేవా చేశారు. మూసీ నిర్వాసితులకు 2013 చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ హైదరాబాద్‌కి, రైతులకు ఒక వరంగా మారిందన్నారు. నోరు ఉంది కదా అని గావుపెట్టినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావు.. నిజాలు అబద్ధాలు కావు అన్నారు. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదన్న విషయాన్ని అబద్దంగా మార్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 7,000 కోట్లను హైదరాబాద్ మంచినీటి కోసం ఖర్చు చేశామన్నారు. మీరు ఎల్లంపల్లి నుండి హైదరాబాదుకు తెచ్చే మంచినీటి పథకం 2008లో ప్రారంభమై ఏడేళ్లయినా పూర్తి కాలేదన్నారు. కృష్ణా ఫేజ్-4 పనులను కూడా పూర్తి చేసి కృష్ణ నీళ్లను కూడా హైదరాబాద్ తెచ్చింది కేసీఆర్ అని వెల్లడించారు. అధికారంతో తిమ్మినిబమ్మిని చేద్దామని చూస్తే జనం సహించరని తిప్పికొడతారని హెచ్చరించారు.