Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీగా అవినీతి జరిగిందంటూ అధికార కాంగ్రెస్ తో పాటు విపక్ష బీజేపీ చేస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో ఖండించారు. కాళేశ్వరం నిర్మాణంలోని నిజా నిజాలను బయటపెడుతూ ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం మీడియా మాట్లాడుతూ హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. మేడగడల్లో రెండు పిల్లర్స్ కూలితే కాళేశ్వరమే కూలిపోయినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో బనకచర్ల ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
కాళేశ్వరంపై తప్పుడు ఆరోపణలు
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి తెలంగాణను కేసీఆర్ సస్యశ్యామలం చేశారని హరీష్ రావు అన్నారు. నీళ్లిచ్చి కన్నీరు తుడిచిన కేసీఆర్ పైనే అభాండాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణ గొంతు పిసికే ప్రయత్నం చేస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. ఒక్క పిల్లర్ కుంగితే మేడిగడ్డ కొట్టుకుపోయినట్లుగా ప్రచారం చేస్తున్నారని.. కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరముందని హరీష్ రావు అన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో తాను చెప్పింది నూటి నూరు పార్లు నిజాలేనని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని పేర్కొన్నారు.
Also Read: KTR: కాళేశ్వరం కమిషన్ పేరిట నాటకాలు.. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే.. కేటీఆర్ ఫైర్!
బనకచర్లపై ఎందుకు ప్రశ్నించరు?
కాళేశ్వరం కూలిపోయిదంటూ సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ఆరోపిస్తుండటాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది సీఎం కామన్ డైలాగ్ గా మారిపోయిందని మండిపడ్డారు. మేడిగడ్డలో రెండు పిల్లర్స్ కూలితేనే రాద్దాంతం చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. ఏపీ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ పై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎందుకు ఖండించలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణలో కమీషన్ల పాలన సాగుతోందని.. త్వరలోనే నిజా నిజాలు బయటకు వస్తాయని హరీష్ రావు తేల్చి చెప్పారు.