Madhusudhan Reddy: పదేండ్ల పాటు నిధులు లేక, కనీసం సున్నం కూడా వేయక కునారిల్లిన ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు సీఎం రేవంత్ రెడ్డి హయాంలో మహర్దశ పట్టుకుందని తెలంగాణ ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పీ మధుసూధన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో గురువారం నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఇంటర్ విద్యను గాలికొదిలేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి కార్పొరేట్ కు దీటుగా తీర్చిదిద్దుతోందని చెప్పారు. రాష్ట్రం వచ్చిన కొత్తలో ప్రభుత్వ కాలేజీల్లో కేవలం 60 వేల మంది విద్యార్థులే చేరేవారని, సౌకర్యాలు లేక అడ్మిషన్లు పడిపోయాయన్నారు.
రూ.56.16 కోట్లు ఈ సర్కార్ ఖర్చు
గత ప్రభుత్వం 2015-16లో ఉచిత విద్యను ప్రారంభించిందని గొప్పలు చెప్పిందని, కానీ కాలేజీల నిర్వహణకు నిధులు ఇవ్వలేదని విమర్శించారు. తొమ్మిదేండ్లలో కేవలం రూ.65 లక్షలు మాత్రమే ఇచ్చారని, దీంతో కాలేజీల్లో జాతీయ పండుగలు కూడా నిర్వహించలేని దుస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కాలేజీల రూపురేఖలు మారుతున్నాయని మధుసూధన్ రెడ్డి తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో 326 కాలేజీల్లో మౌలిక వసతులు, మరమ్మతుల కోసం రూ.56.16 కోట్లు ఈ సర్కార్ ఖర్చు చేసిందని కొనియాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రతి నెలా కాలేజీ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్ కింద రూ.8 వేల నుంచి రూ.20 వేల వరకు మంజూరు చేస్తోందని వివరించారు. ప్రయోగ పరీక్షల కోసం రూ.25 వేలు, స్పోర్ట్స్ మెటీరియల్ కోసం రూ.10 వేల చొప్పున నిధులు అందిస్తోందని తెలిపారు.
Also Read: High Court: హైకోర్టుకు హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. ఎందుకంటే..?
15 ఏండ్ల నుంచి లెక్చరర్ల నియామకలే లేవు
రాష్ట్రంలో 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా, ప్రస్తుతం 90 వేల అడ్మిషన్లు ఉన్నాయని, వచ్చే విద్యాసంవత్సరానికి ఈ సంఖ్య 1.25 లక్షలకు చేరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా జూనియర్ కాలేజీల్లో 15 ఏండ్ల నుంచి లెక్చరర్ల నియామకలే లేవని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక టీజీపీఎస్సీ ద్వారా 1300 మంది లెక్చరర్లను కొత్తగా నియమించిందని గుర్తు చేశారు. అలాగే ఇటీవల మరో వెయ్యి మంది గెస్ట్ లెక్చరర్లను కూడా రిక్రూట్ చేసుకున్నట్లు తెలిపారు. విద్యాశాఖలో సీఎం ఆదేశాల మేరకు సెక్రటరీ యోగితా రాణా, కమిషనర్ కృష్ణా ఆదిత్య పనిచేస్తున్నారని కొనియాడారు. బయోమెట్రిక్ అటెండెన్స్, సీసీ కెమెరాల ఏర్పాటు, పేరెంట్స్-టీచర్స్ మీటింగ్స్ వంటి విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. 1, 2 మార్కులతో ఫెయిలయ్యే విద్యార్థుల కోసం ప్రభుత్వమే ఉచితంగా రీవాల్యువేషన్ చేసే విధానాన్ని తీసుకురావడం హర్షణీయమన్నారు.
రూ.34 కోట్లతో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు
ప్రభుత్వ కాలేజీల్లో డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు రూ.34 కోట్లతో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రతీ కాలేజీకి రెండు చొప్పున ఈ డిజిటల్ బోర్డులు రావడం వల్ల బోధన మరింత సులభతరమైందన్నారు. విద్యార్థుల హాజరు కోసం బయోమెట్రిక్ విధానం, పరీక్షల నిర్వహణలో క్యూఆర్ కోడ్ విధానం వంటి సాంకేతికతను వాడుతున్నట్లు మధుసూదన్ రెడ్డి తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరంలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో ఇంటర్ విద్యాజేఏసీ, ప్రిన్సిపల్స్ సంఘం, జీజేఎల్ఏ నాయకులు బలరామ్ జాదవ్, రవీందర్ రెడ్డి, కవిత, ఆంజనేయులు, లక్ష్మణ్ రావు, శ్రీనివాస్, కే రజిత తదితరులు పాల్గొన్నారు.
Also Read: HILT Policy: హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ పోరుబాట.. అందుకు ప్రణాళికలు సిద్ధం

