Future City: భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునేలా సీఎం రేవంత్ రెడ్డి ‘భారత్ ఫ్యూచర్ సిటీ(Future City)’ని నిర్మించాలని సంకల్పిస్తున్నారు. గత బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వంలో ఏర్పాటు చేయదల్చిన ’ఫార్మాసిటీ’ని రద్దు చేసిన రేవంత్ ప్రభుత్వం నాలుగో నగరానికి పకడ్బందీ ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. అయితే రైతుల సయోధ్యతోనే ఫ్యూచర్ సిటీని నిర్మించడంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం భూ నిర్వాసితులకు ప్లాట్లను కేటాయించేందుకు సంకల్పించింది. గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోగా.. రేవంత్ ప్రభుత్వం మెగా లే అవుట్‌ను ఏర్పాటు చేసి ప్లాట్లకు పొజిషన్ చూపడంతోపాటు రిజిస్ట్రేషన్లు సైతం చేసి ఏండ్లనాటి నిర్వాసితుల కలను సాకారం చేస్తున్నది. దీంతో ఒకప్పుడు నిర్వాసితులుగా ఇబ్బందులు పడ్డ రైతులు నేడు కోటీశ్వరులుగా మారనున్నారు. సోమవారం నిర్వహించే ప్లాట్ల డ్రా ప్రక్రియకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ప్రొసీడింగ్స్‌తో సరిపెట్టిన గత ప్రభుత్వం
గత బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వం ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని సంకల్పించి కందుకూరు మండలంలోని మీర్‌ఖాన్ పేట్, ముచ్చర్ల, పంజగూడ, యాచారం మండలంలోని కుర్మిద్ద, మేడిపల్లి, నానక్ నగర్, తాడిపర్తి గ్రామాలకు చెందిన రైతుల నుంచి 13,972 ఎకరాలను సేకరించింది. పరిహారంగా పట్టా భూమికి ఎకరాకు రూ.16.5 లక్షల చొప్పున, అసైన్డ్ భూమికి రూ.8.5 లక్షల చొప్పున గత ప్రభుత్వం పరిహారం చెల్లించింది. పరిహారం సొమ్ముతో పాటు అదనంగా ఎకరాకు 121 గజాల చొప్పున ప్లాటును సైతం ఇచ్చేందుకు గత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూ నిర్వాసితులకు ప్రొసీడింగ్స్ ఇచ్చి చేతులు దులుపుకుంది. ఆతర్వాత ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్లాట్ల కేటాయింపుపై సందిగ్ధత నెలకొంది. అయితే ఫార్మాసిటీ(Pharma City) స్థానంలో ఫ్యూచర్ సిటీని నిర్మించ తలపెట్టిన రేవంత్(Revanth) సర్కారు భూ నిర్వాసితులకు ప్లాట్లను కేటాయించి ఎటువంటి అవరోధాలు లేకుండా నాలుగో నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించి ఆ దిశగా ముందడుగు వేసింది.
Also Read: Ramchandra Rao: గ్యారంటీల పేరుతో హడావుడి.. అమలులో శూన్యం!
పాట్లు లేకుండా ప్లాట్ల కేటాయింపు
కేవలం ప్లాట్ల పొజిషన్ చూపించి చేతులు దులుపుకోకుండా కాంగ్రెస్(Congress) ప్రభుత్వం మెగా వెంచర్‌లో సకల సదుపాయాలను కల్పించింది. మీర్‌ఖాన్ పేట్‌లోని సర్వే నంబర్ 120లో, పంజాగూడ సర్వే నంబర్ 90లో 650 ఎకరాల్లో టీజీఐఐసీ మెగా లే అవుట్‌ను అభివృద్ది చేసింది. రోడ్లు, విద్యుత్ లైన్లు, డ్రైనేజీ వంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలను లే అవుట్‌లో కల్పించింది. రోడ్డుకు ఇరువైపులా పూల మొక్కలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో గజం భూమి ధర రూ.25 వేల నుంచి రూ.30వేల వరకు ఉంది. నాలుగో నగరం అందుబాటులోకి వచ్చాక ఇక్కడి భూములకు మరింత డిమాండ్ రానుంది. భూములు కోల్పోయిన రైతుల్లో అర ఎకరం మొదలు ఐదు ఎకరాలకు పైగా భూములు కోల్పోయిన రైతులు ఉన్నారు. 40 గుంటల లోపు భూములు కోల్పోయిన రైతులకు 60 గజాల చొప్పున ప్లాట్లను ఇస్తున్నారు. ఎకరం భూమి కోల్పోతే 121 గజాల చొప్పున, ఎకరం నుంచి రెండు ఎకరాలలోపు వారికి 181 గజాల చొప్పున, ఐదు ఎకరాలు కోల్పోయిన రైతులకు 600 గజాల చొప్పున ప్లాట్లను ఇస్తున్నారు.
ఉచితంగా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్
నిన్నమొన్నటి వరకు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ప్లాట్లు ఆర్థికంగా తోడ్పాటునందించనున్నాయి. 5,298 మంది లబ్దిదారులకు ప్లాట్ల కేటాయింపుకు సంబంధించి ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు డ్రా పద్దతిన ప్లాట్లను కేటాయించనున్నారు. మొదటి రోజు 60 గజాలు, రెండవ రోజు 121 గజాలు, మూడోరోజు 181గజాల ప్లాట్లకు డ్రా నిర్వహించి చివరి రోజున మిగతా రైతులకు ప్లాట్లను కేటాయించనున్నారు. తర్వాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్స్బుక్ చేసి ఉచితంగా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేయనున్నది. ఒకే కుటుంబానికి సంబంధించి ఎన్ని ప్లాట్లు ఉంటే అన్నీ ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. డ్రా కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనే అధికారులకు శిక్షణ ఇచ్చారు. కందుకూరు మండలం మీర్ఖాన్ పేట్ గ్రామ పరిధిలోని బేగరికంచ వద్ద ఏర్పాటు చేస్తున్న కార్యక్రమానికి లబ్దిదారులు ఉదయం 9 గంటలకు చేరుకోవాలని, వచ్చేటప్పుడు వెంట గతంలో జారీ చేసిన ప్లాట్ పట్టా సర్టిఫికెట్, ఆధార్ కార్డు(Adharr), పాన్ కార్డు లేకుంటే ఫారం- 60, ఫారం- 32ఏ, రెండు పాస్ పోర్టు సైజు ఫోటోలను తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: Personal Finance: త్వరగా కోటీశ్వరులు కావాలంటే ఎఫ్‌డీ మంచిదా?, సిప్ కరెక్టా?