Cyber Crime: సైబర్ కేటుగాళ్ల బారిన పడ్డ బాధితులకు గోల్డెన్ హవర్(Golden Hour) ఊరట కల్పించింది. మోసపోయినట్టు తెలిసిన మొదటి గంటలోనే బాధితులు ఫిర్యాదులు చేయటంతో వెంటనే స్పందించిన సిబ్బంది వాళ్లు పోగొట్టుకున్న డబ్బును ఆయా అకౌంట్లలో ఫ్రీజ్ చేయించారు. యూసుఫ్ గూడలో నివాసముంటున్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు వెయ్యి రూపాయల జరిమానా కట్టాలంటూ ఆర్టీవో అధికారులు పంపినట్టుగా ఎం పరివాహన్ పేర సైబర్ క్రిమినల్స్ ఏపీకే ఫైల్ ను పంపించారు.
Also Read: Farmhouse Party: మద్యం మత్తు.. బర్త్ డే పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ జంట
సైబర్ కేటుగాళ్ల ఖాతాల్లోకి వెళ్లకుండా..
ఫైల్ ను ఓపెన్ చేయగానే అతని మొబైల్ ఫోన్ ను తమ ఆధీనంలోకి తీసుకున్న సైబర్ మోసగాళ్లు 5.23లక్షలు కొట్టేశారు. అయితే, బాధితుడు వెంటనే 1930 నెంబర్ కు ఫిర్యాదు చేయటంతో కానిస్టేబుల్ ప్రియాంక ఐసీఐసీఐ బ్యాంక్ నోడల్ ఆఫీసర్ తోపాటు ఆమెజాన్ ఉద్యోగులను అలర్ట్ చేసింది. దాంతో నగదు సైబర్ కేటుగాళ్ల ఖాతాల్లోకి వెళ్లకుండా ఫ్రీజ్ చేయగలిగారు. మరో ఉదంతంలో అంబర్ పేటకు చెందిన ఓ 53ఏళ్ల వ్యక్తికి సైబర్ క్రిమినల్స్ ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు అప్ డేట్స్ పేర ఏపీకే ఫైల్ ను పంపించారు. దానిని ఇన్ స్టాల్ చేయగానే అతని అకౌంట్ నుంచి 1.25 లక్షలను తమ ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు. అయితే, బాధితుడు మోసాన్ని గ్రహించి వెంటనే ఎన్సీఆర్పీ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయటంతో వెంటనే స్పందించిన సిబ్బంది అతను పోగొట్టుకున్న డబ్బులో లక్ష రూపాయలను ఫ్రీజ్ చేయించారు. త్వరలోనే నగదును బాధితులకు వాపస్ ఇవ్వనున్నట్టు సైబర్ క్రైం డీసీపీ అరవింద్ తెలిపారు.
Also Read: JNTU Hyderabad: జేఎన్టీయూలో కీచక ప్రొఫెసర్ అరెస్ట్.. సహోద్యోగినిపై లైంగిక వేధింపులు!

