GHMC: రాష్ట్రంలోనే అతి పెద్ద స్థానిక సంస్థ అయిన జీహెచ్ఎంసీ ఆదాయాన్ని పెంచుకునే దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే జీహెచ్ఎంసీకి ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్‌ను పెంచుకునేందుకు అందుబాటులో ఉన్న అన్నిమార్గాలను సద్వినియోగం చేసుకోవటంతో పాటు సిటీలో ప్రస్తుతం ఆస్తి పన్ను చెల్లిస్తున్న ప్రాపర్టీలపై గత సంత్సరం జూలై నెల నుంచి నియోజియో సంస్థతో జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే( జీఐఎస్ ) సర్వేను ప్రారంభించింది. అయితే ఈ సర్వేలో భాగంగా టెక్నాలజీ ఆధారంగా సేకరించిన సమాచారాన్ని మ్యానువెల్ గా క్రాస్ వెరిఫికేషన్ చేసి, పక్కాగా పకడ్బందీగా సమాచారాన్ని సేకరించాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో సుమారు 19.5 లక్షల ఆస్తుల యజమానులు ప్రస్తుతం ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. వీరిలో రెండున్నర లక్షల ఆస్తులు కమర్షియల్ ట్యాక్స్ చెల్లిస్తుండగా, మిగిలిన ఆస్తులు రెసిడెన్షియల్ ట్యాక్స్ ను చెల్లిస్తున్నారు.
సుమారు పదిన్నర లక్షల ఆస్తులు
అయితే దశాబ్దాల క్రితం అసెస్ చేసిన ఆస్తులు ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం పలు భవనాల అంతస్తులు పెరగటం, యూసేజీలు మారటంతో అదనంగా వచ్చిన నిర్మాణాలను సైతం ప్రాపర్టీ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావటంతో పాటు సిటీలోని అన్నిఆస్తులకు డిజిటల్ డోర్ నెంబర్లను కేటాయించటంతో పాటు బృహత్తర ప్రమాద నివారణ కార్యాచరణను సిద్దం చేయాలన్న వివిధ అవసరాల నిమిత్తం జీహెచ్ఎంసీ మొత్తం ఆస్తులపై జీఐఎస్ సర్వే చేయిస్తుంది. ఇప్పటి వరకు సుమారు పదిన్నర లక్షల ఆస్తులకు సంబంధించి జీఐఎస్ సర్వే పూర్తయినట్లు సమాచారం. నియోజియో సంస్థ ఈ సర్వే మొత్తాన్ని పూర్తి చేసేందుకు 18 నెలల గడువు పెట్టుకోగా, ఇప్పటి వరకు గడిచిన 11 నెలల్లో పదిన్నర లక్షల ఆస్తులకు సర్వేను ముగిసింది. మిగిలిన మరో తొమ్మిది లక్షల ఆస్తుల సర్వేను కూడా రానున్న రెండునెలల్లో పూర్తి చేసేందుకు నియోజియో సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
Also Read: MP Dharmapuri Arvind: ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్.. ఢిల్లీలో ఎంపీ గరం గరం
డిప్యూటీ కమిషనర్లకే ఆ బాధ్యతలు
ఇప్పటి వరకు సిటీలోని సుమారు పదిన్నర లక్షల ఆస్తులకు జీఐఎస్ సర్వే ముగించగా, వీటిలో రెండున్నర ఆస్తుల వివరాలను మ్యానువెల్‌గా క్రాస్ వెరిఫికేషన్ చేసే బాధ్యతలను ఉన్నతాధికారులు సర్కిల్ స్థాయి డిప్యూటీ కమిషనర్లకు అప్పగించినట్లు సమాచారం. ముఖ్యంగా టెక్నాలజీని వినియోగించి సేకరించిన భవనాల ఇమేజ్‌లు, సమాచారాన్ని ఫీల్డు లెవెల్‌లో డిప్యూటీ కమిషనర్లు క్రాస్ వెరిఫై చేసి, ప్రధాన కార్యాలయానికి నివేదికలను సమర్పించాల్సి ఉంది. ముఖ్యంగా జీఐఎస్ సర్వే నిర్వహించిన ప్రాపర్టీలకు సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్ (పీటీఐఎన్) ఉందా? లేదా? ఉంటే భవనంలో ఎంత మేరకు పోర్షన్‌కు ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు? అదనంగా నిర్మించిన భాగం ఎంత? అది యూసేజీ కమర్షియలా? రెసిడెన్షియలా? అన్న సమాచారాన్ని డిప్యూటీ కమిషనర్లు క్రాస్ వెరిఫికేషన్ చేసి సమర్పించాల్సి ఉంటుంది. నేరుగా ఆస్తులను సందర్శించి, ట్యాక్స్ సంబంధిత సమాచారాన్ని సేకరించి, జీఐఎస్ సర్వేతో సేకరించిన సమాచారంతో వెరిఫై చేసి డిప్యూటీ కమిషనర్లు పంపే నివేదికల ప్రకారం పన్ను చెల్లింపు పరిధిలోకి రాని ఆస్తులు, భవనాలను జీహెచ్ఎంసీ పన్ను పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.
ట్యాక్స్ కలెక్షన్ పై అంచనాలు
జీహెచ్ఎంసీకి ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్‌ను గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో సుమారు రూ.2038 కోట్ల మేరకు వసూలు చేశారు. వీటిలో సుమారు రూ.70 కోట్లకు సంబంధించిన చెక్కులు బౌన్స్ కాగా, వాటి తాలుకూ ట్యాక్స్‌ను వసూలు చేసే బాధ్యతలను ఇప్పటికే అధికారులు స్థానిక డిప్యూటీ కమిషనర్లకు అప్పగించారు. వర్తమాన ఆర్థిక సంవత్సరం రూ.2500 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ను టార్గెట్ పెట్టుకున్న జీహెచ్ఎంసీ అధికారులు జీఐఎస్ సర్వే ముగిసిన తర్వాత పన్ను చెల్లింపు పరిధిలోకి రాని భవనాలను, ఇతర ఆస్తులను చెల్లింపు పరిధిలోకి తీసుకువస్తే అదనంగా మరో రూ.2 వేల కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పెరుగుతుందని జీహెచ్ఎంసీ అధికారులు అంచనాలేస్తున్నారు. వర్తమాన ఆర్థిక సంవత్సరం ముగింపు నెల అయిన మార్చి లోపు జీఐఎస్ సమాచారాన్ని డిప్యూటీ కమిషనర్లతో క్రాస్ వెరిఫికేషన్ చేసిన వెంటనే పన్ను చెల్లింపు పరిధిలోకి రాని ఆస్తులకు పన్నును వర్తింపజేసి ఈ వర్తమాన సంవత్సరం చివరి కల్లా కనీసం రూ.వెయ్యి కోట్ల అదనపు ట్యాక్స్ కలెక్షన్ తో రూ.3500 కోట్ల వరకు ట్యాక్స్ వసూలు చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: Bomb Threat: హైదరాబాద్ బయల్దేరిన విమానానికి ముప్పు.. అత్యవసర ల్యాండింగ్!