School Bus: ఈ విద్యా సంవత్సరంలో జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభమైనా, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల బుక్స్, ఫీజు వసూలుపై చూపుతున్న శ్రద్ధ బస్సులపై చూపడం లేదు. గద్వాల జిల్లా వ్యాప్తంగా 281 బస్సులుండగా ఇంకా 14 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించలేదు. ఉదయం, సాయంత్రం విద్యార్థులను పాఠశాలలకు తీసుకెళ్లి ఇంటికి చేర్చే బస్సులకు కచ్చితంగా సామర్థ్య పరీక్షలను చేయించుకోల్సి ఉన్నా కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ముందుకు రావడం లేదు. ఫిట్నెస్ చేయించని బస్సులపై రవాణా శాఖ అధికారులు కూడా చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవల ఐజ పట్టణంలో నవభారత్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయి తెలంగాణ చౌరస్తా సమీపంలో రెండు బైకులను ఢీకొనడంతో వాహనాలు దెబ్బతినగా అదృష్టవశాత్తు వాహనదారులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అదేవిధంగా ఐజ మండలం తూంకుంట గ్రామ సమీపంలో డ్రైవర్లు అతివేగంగా బస్సులు నడపడంతో ఇరుకు రోడ్డులో బస్సులు క్రాస్ కాకపోవడంతో పాక్షికంగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. రెండు ఘటనల్లో బస్సుల్లో ఉన్న విద్యార్థులు క్షేమంగా బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కేవలం సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే రవాణా శాఖ అధికారులు హడావుడి చేస్తారే తప్ప, తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా డ్రైవింగ్‌పై అవగాహన, నిరంతర నిఘా, తనిఖీలు చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ఎన్ని ఘటనలు జరుగుతున్నా..
ఈ నెల 27న స్కూల్ బస్సు ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇటీవల గట్టు మండలం బల్గెరలో చోటు చేసుకోగా ప్రైవేట్ పాఠశాల బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు, రోడ్ ట్యాక్స్, పర్మిట్లు లేకున్నా, ఇన్సూరెన్స్ చేయకున్నా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలకు జిల్లా రవాణా అధికారి వత్తాసు పలుకుతున్నాడని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు హలీం పాషా, యూఎస్ఎఫ్ఐ రంగస్వామి, హరీష్‌లు ఆరోపిస్తూ తక్షణమే జిల్లా రవాణా అధికారిని తప్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణకు వినతి పత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో రవాణా శాఖ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఐజ మున్సిపాలిటీలోని లయోలా పాఠశాలకు చెందిన స్కూల్ బస్సును ఆంధ్రప్రదేశ్ నుంచి కొనుగోలు చేశారని, ఈ నెల 23న బస్సుకు ఫిట్నెస్ పరీక్షలకు కేవలం స్లాట్ మాత్రమే బుక్ చేసుకున్నారని, కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదన్నారు. ఈ నెల 27న బలిగేరలో బస్సు ఢీకొనడంతో బజారన్న (60)అనే వ్యక్తి మరణించాడన్నారు. ఈ నెల 30న ఫిట్నెస్ పరీక్షలకు బస్సును తీసుకొచ్చారన్నారు. బస్ రీ అసెస్మెంట్ ప్రక్రియ తర్వాత రోడ్ ట్యాక్స్ కట్టారని చెప్పారు. ఫిట్నెస్ పూర్తికాకుండా పర్మిట్‌కు అనుమతించమని తెలిపారు. బస్సు పర్మిట్ అనుమతులు లేకుండా వాహనాన్ని వాడడం వల్ల ప్రమాదానికి గురైన సంఘటనపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.పాఠశాల ఫీజు తోపాటు అదనంగా బస్సు ఫీజులను కూడా వసూలు చేస్తున్నా వాటి సామర్థ్య పరీక్షలు చేపట్టడంతో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. చాలా బస్సులు 15 సంవత్సరాలు దాటినవి ఉండటం, సరిగ్గా ఫిట్నెస్ లేకపోవడంతోనే యాజమాన్యాలు వాటికి పరీక్షలు నిర్వహించడం లేదని తెలుస్తోంది. ఒక్కో ప్రైవేట్ పాఠశాలకు రెండు మూడు బస్సులు ఉండగా జిల్లా కేంద్రంలో అధిక విద్యార్థులు ఉన్న పాఠశాలలకు 10 నుంచి 20 వరకు ఉన్నాయి. వీటిలో కొత్త వాటికి మాత్రమే ఫిట్నెస్ చేయించి పాత వాటికి పరీక్షలు చేయించకుండానే తిప్పుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఆటోలలో సైతం విద్యార్థుల తరలింపు
మరోవైపు, ఎంతో ప్రమాదకరంగా ఒక్కో ఆటోలో సుమారుగా 15 నుంచి 20 మంది విద్యార్థులను తీసుకొస్తూ యాజమాన్యాలు వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఇలాంటి విద్యా సంస్థలపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
Read Also- Heart Disease Diet: మీ గుండె పదిలంగా ఉండాలంటే.. ఇలా చేయండి.. లేదంటే ఢమాలే!
బస్సు నిర్వహణకు ఇవి తప్పనిసరి
- తప్పనిసరిగా సామర్థ్య పరీక్షలు చేయించి రవాణా శాఖ ధ్రువ పత్రం ఉండాలి.
- బస్సును నడిపే వ్యక్తి హెవీ లైసెన్స్‌తో పాటు 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. వారి వయసు 45 సంవత్సరాలకు మించకూడదు.
- బస్సులో మంటలార్చే పరికరంతోపాటు ప్రథమ చికిత్స కిట్ ఉండాలి.
- బస్సు ముందు, వెనుక భాగంలో విద్యార్థుల చిత్రాలతో పాటు విద్యాసంస్థల పేర్లు, రేడియం స్టిక్కర్లు, రూప్ బాటమ్, హారన్, బ్రేక్ సరిగ్గా ఉండాలి. విద్యార్థులు బస్సు ఎక్కడం, దిగడం చోదకుడికి కనిపించేలా అద్దాలు స్పష్టంగా ఉండాలి.
- అత్యవసర ద్వారం ఉండడంతోపాటు ఆపద సమయంలో గ్లాసులను పగలగొట్టేలా హామర్ అందుబాటులో ఉండాలి.
- విద్యార్థులు బస్సు ఎక్కేందుకు మెట్లు భూమి నుంచి 325 ఎం.ఎం. ఎత్తులో ఉండాలి. చేతులు బయట పెట్టకుండా కిటికీల చుట్టూ మూడు వరుసల రెయిలింగ్ ఏర్పాటు చేయాలి.
ప్రతి పాఠశాల బస్సుకు సామర్థ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి. ఫిట్నెస్ లేకుండా వినియోగిస్తే వాటిని సీజ్ చేయడంతో పాటు యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తాం. బస్సుల పరిశీలనకు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నాం. తల్లితండ్రులు పిల్లలను బస్సుల్లో మాత్రమే బడికి పంపాలి. ఆటోలు ఇతర వాహనాల్లో పంపవద్దు. పాఠశాల యాజమాన్యాలు పిల్లల ప్రయాణం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రైవర్లతోపాటు అసిస్టెంట్‌ను నియమించి, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సురక్షిత డ్రైవింగ్‌కు వారికి సూచనలు ఇవ్వాలి. ఫిట్నెస్ లేకుంటే సీజ్ చేస్తాం- వెంకటేశ్వరరావు, జిల్లా రవాణా శాఖ అధికారి
Read Also- War 2: కియారాకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన ‘వార్ 2’ మూవీ టీం.. అదిరిందిగా..