TG Mining Department: ప్రభుత్వానికి ఆదాయం వచ్చే శాఖల్లో మైనింగ్ శాఖ ఒకటి. ఆ శాఖకు వచ్చే ఉన్నతాధికారులంతా ఇన్ చార్జులుగానే వస్తుండటంతో పైళ్లు ముందుకు సాగడం లేదని సమాచారం. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయంపైనా ఎఫెక్ట్ పడుతుందని విశ్వసనీయ సమాచారం. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. 22 నెలల్లోనే 6గురు డైరెక్టర్లు మారడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీంతో శాఖలో పారదర్శకత లోపించిందని ప్రచారం జరుగుతుంది. ఇదే అదునుగా కొంతమంది అధికారులు అన్నీ చక్కబెట్టుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భూగర్భ వనరుల శాఖ(Department of Underground Resources)తో పాటు అనుబంధ డైరెక్టరేట్, తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ)లో పూర్తి అదనపు బాధ్యతల పేరిట ఇన్‌చార్జి అధికారుల పాలన కొనసాగుతోంది.
గడిచిన 22 నెలల్లో..
రాష్ట్ర గనులు భూగర్భ వనరుల శాఖలో తరచూ బదిలీలు జరుగుతున్నాయి. శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన జయేశ్ రంజన్ 2024 జనవరిలో బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మహేశ్ దత్ ఎక్కా బదిలీపై వచ్చారు. ఆయన స్థానంలోమూడునాలుగు నెలల వ్యవధిలోనే సురేంద్ర మోహన్ బాధ్యతలు చేపట్టారు. సురేంద్ర మోహన్(Surendra Mohan) బదిలీతో ఈ ఏడాది జనవరి నుంచి ఎన్.శ్రీధర్ పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) నిర్వర్తిస్తున్నారు. గనుల శాఖ డైరెక్టర్ స్తానంలో గడిచిన 22 నెలల్లో ఆరుగురు అధికారులు మారారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే గనుల శాఖ డైరెక్టర్‌గా ఉన్న పి.కాత్యాయని దేవి స్థానంలో 2024 జనవరిలో బీవీఆర్ సుశీల్ కుమార్(BVR Sushil Kumar)ను నియమించారు. తిరిగి కొద్ది నెలల వ్యవధిలోనే అదే ఏడాది సెప్టెంబర్‌లో కె.సురేంద్ర మోహన్, డిసెంబర్‌లో కె.శశాంక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆరు నెలలు తిరగమునుపే శశాంక స్తానంలో ప్రస్తుతం టూరిజం కార్పోరేషన్ వీసీ, ఎండీగా ఉన్న క్రాంతి వల్లూరును ఇన్‌చార్జిగా నియమించారు. తాజాగా ఈ నెల 20న వల్లూరు క్రాంతిని గనుల శాఖ డైరెక్టర్ పదవి నుంచి తప్పిస్తూ ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రాకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
Also Read: Mithra Mandali OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మిత్రమండలి.. నెల కాకముందే..
బీవీఆర్ సుశీల్ కుమార్..
ఇది ఇలా ఉంటే తెలంగాణ(Telangana) ఖనిజాభివృద్ది సంస్థలోనూ తరచూ అధికారుల బదిలీ సైతం విమర్శలను ఎదుర్కొంటోంది. 2016 డిసెంబర్ నుంచి 2024 జనవరి వరకు సంస్థ వైస్‌ఛైర్మన్, ఎండీగా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ జి.మల్సూర్ స్తానంలో గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మహేశ్ దత్ ఎక్కా, ఆ తర్వాత కార్యదర్శి కే.సురేంద్ర మోహన్ ఇన్‌ఛార్జులుగా వ్యవహరించారు. సుమారు ఆరు నెలల అనంతరం గతంలతో వీసీ, ఎండీగా పనిచేసిన మల్సూర్‌ను తిరిగి ఇన్‌చార్జిగా నియమించారు. నెల రోజులు తిరగకుండానే ఎండీగా రెండు పర్యాయాలు పనిచేసిన బీవీఆర్ సుశీల్ కుమార్ బాధ్యతలు అప్పగించారు. కొద్ది నెలల్లోనే సుశీల్ కుమార్‌ను కూడా తొలగించి భవేశ్ మిశ్రాకు బాధ్యతలు అప్పగించారు.
అధికారుల మార్పిడితో..
గత ఏడాది 2024-25లో గనుల శాఖ ద్వారా రూ.5వేల కోట్ల ఆదాయమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. నిర్దేశించిన లక్ష్యంలో సుమారు రూ.1200 కోట్ల మేర ఆదాయం రాబట్టడంలో శాఖ అధికారులు విఫలమైనట్లు స్పష్టమవుతోంది.అంతేకాదు గ్రానైట్, లైమ్‌స్టోన్ లీజుల అక్రమాలను అరికట్టి జరిమానా రూపంలో భారీ ఆదాయం సమకూర్చాలనే లక్ష్యం కూడా నెరవేరకపోవడంతోనే అధికారుల బదిలీ జరుగుతుందనే ప్రచారం జరుగుతుంది. గనులు భూగర్భ వనరుల శాఖలో తరచూ అధికారుల మార్పిడితో లీజులు, రాయల్టీ, జరిమానాల వసూలు, పర్యవేక్షణ లోపిస్తుందని సమాచారం. దీనికితో డు తరచూ జరుగుతున్న బదిలీలతో అధికారుల్లో అభద్రతా భావం పెరిగి నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులకు శాఖపై అవగాహన వచ్చే లోపే బదిలీ అవుతుండటం, పూర్తి బాధ్యతలు అప్పగించకపోవడంతో కొంత జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. దీనికి తోడు కొంది స్థాయి అధికారులు ఇదే అదునుగా తీసుకొని తమ పనులు చక్కబెట్టుకుంటున్నారని, దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. తరచూ అధికారుల బదిలీలు జరుగుతుండటతో వారి నిర్ణయాల్లో పారదర్శకత లోపించడంతో పాటు విధాన నిర్ణయాల్లో ఆలస్యం జరుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం మైనింగ్ శాఖకు పూర్తిస్థాయి డైరెక్టర్, వీసీఅండ్ ఎండీలుగా నియమిస్తే ప్రభుత్వం నిర్ధేశించిన టార్గెట్ ను రీచ్ కావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Heroes turned villains: టాలీవుడ్‌లో హీరోలుగా పరిచయమై విలన్లుగా మారిన నటులు ఎవరో తెలుసా..
