Padmanabha Reddy: రాష్ట్రంలో అమలులో ఉన్న ఓవర్సీస్ విద్యా నిధి పథకాన్ని పునఃపరిశీలించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం. పద్మనాభరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులు దేశంలోనే స్థాపించబడుతున్న విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లలో ప్రవేశం పొందేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పద్మనాభరెడ్డి విజ్ఞప్తి చేశారు.
Also Read: M Padmanabha Reddy: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ.. ఎందుకంటే..?
రూ.25 లక్షల వరకు ఆర్థిక సహాయం
మహాత్మా జ్యోతిబా ఫూలే, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాలను 2013లో ప్రవేశపెట్టినట్లు పద్మనాభరెడ్డి గుర్తు చేశారు. ఈ పథకం ద్వారా ప్రతీ విద్యార్థికి ప్రభుత్వం రూ.25 లక్షల వరకు ఆర్థిక సహాయం మంజూరు చేస్తుందన్నారు. ఇప్పటివరకు బీసీలకు చెందిన 2,226 మంది, ఎస్సీ, ఇతర వర్గాలకు చెందిన దాదాపు 2,300 మందితో సహా మొత్తం సుమారు 5,000 మంది విద్యార్థులు యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, దక్షిణ కొరియా, జర్మనీ మొదలైన దేశాలలో ఉన్నత విద్యాభ్యాసం చేశారని తెలిపారు.
రూ.1,250 కోట్లు ఖర్చు
ఇప్పటివరకు ఈ పథకం కింద సుమారు రూ.1,250 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. అయితే, ఈ పథకం ఆశించిన ఫలితాలు సాధించడం లేదని పద్మనాభరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలోనే అంతర్జాతీయ ప్రమాణాల విద్య అందుబాటులో ఉండి, తక్కువ ఖర్చుతో లభ్యమవుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం విద్యార్థులను దేశీయ విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యాభ్యాసానికి ప్రోత్సహించాలని కోరారు.
Also Read: Temple Land Scam: జయగిరి ఆలయ భూములపై విచారణ జరిపించాలని సీఎం కు వినతి!
