Temple Land Scam: మల్కాజిగిరిలోని జయగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భూములపై సమగ్ర విచారణ జరిపించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం. పద్మనాభరెడ్డి(M. Padmanabha Reddy) ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి లేఖ రాశారు. 2003లో 9 మంది అధికారులు (7గురు జీహెచ్ ఎంసీ అధికారులు ఒక తహసీల్దారు, ఒక సబ్ రిజిస్ట్రార్) కుట్రతో జయగిరి లక్ష్మీ నరసింహస్వామి(Jayagiri Lakshmi Narasimha Swamy) మల్కాజిగిరి దేవస్థానం భూములను నకిలీ పత్రాలతో ఒక కాంట్రాక్టరుకు రిజిస్టర్ చేశారని ఆరోపించారు.
అధికారులపై క్రిమినల్ కేసు..
టౌను ప్లానింగు అధికారి ఇల్లు నిర్మించుకోవడానికి తప్పుగా మంజూరీ చేశారన్నారు. దానితో ఆ దేవస్థాన భూములలో గృహనిర్మాణం ప్రారంభమైందని, ఆలయభూముల కబ్జా పై పత్రికలలో వార్తలు రావడంతో డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ సమగ్ర విచారణ చేసి విచారణ రిపోర్టును 2014లో ప్రభుత్వానికి అందజేశారన్నారు. విజిలెన్స్ అధికారులు తమ నివేదికలో ఇద్దరు అధికారులపై క్రిమినల్ కేసు పెట్టాలని, మిగిలిన ఐదుగురు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అలాగే గృహ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులు క్యాన్సిల్ చేయమని, ఇక ప్లాట్‌నంబర్ 24కు గృహనిర్మాణానికి అనుమతి ఇవ్వవద్దని నివేదికలో పేర్కొన్నారని తెలిపారు.
సమాచారహక్కు చట్టం ద్వారా..
విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వం ఆమోదిస్తూ దానిని కమీషనర్ జీహెచ్ఎంసీ(GHMC) కి లేఖ 7459/Vig.II(1)/2014-16 dated 7-11-2014 ద్వారా తగుచర్యలకు పంపిందన్నారు. అయితే గత 11ఏళ్లుగా నేరారోపణ చేసిన అధికారులపై సరైన చర్యలు ఏమీ తీసుకోలేదన్నారు. విజిలెన్స్ రిపోర్టు పక్కన పెట్టారని ఆరోపించారు. సమాచారహక్కు చట్టం(RTI) ద్వారా విజిలెన్స్ రిపోర్టుపై తీసుకున్న చర్యలపై అడిగితే సమాచారము ఇచ్చినా విచారణలో సమస్యలొస్తాయని, సమాచారం ఇవ్వడం కుదరదని తెలిపారన్నారు. చర్యలను గోప్యంగా ఉంచుతున్నారని, సీఎం జోక్యం చేసుకోవాలని, ఆలయభూములపై సమగ్ర విచారణ చేసి తొందరగా విజిలెన్స్ నివేదికపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read: Maoists: మావోయిస్టుల పని ఖతమేనా? అశోక్ లేఖతో తేలిపోయిన వైనం!
