Doctors Fraud (imagecredit:twitter)
తెలంగాణ

Doctors Fraud: సంతాన సాఫల్య కేంద్రాల పేర చైల్డ్ ట్రాఫికింగ్!

Doctors Fraud: పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న కొందరు డాక్టర్లు కంత్రీగాళ్లలా మారుతున్నారు. డబ్బు సంపాదించటమే ధ్యేయంగా చేయరాని పనులు చేస్తున్నారు. పిల్లలు పుట్టిస్తామంటూ కొందరు మోసాలు చేస్తుంటే మరికొందరు కాసుల కోసం భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. చట్ట విరుద్ధమని తెలిసి కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ ఈ కిరాతకాలకు ఒడి గడుతున్నారు. వీరికి తోడుగా కొన్ని గ్యాంగులు రక్తం వీర్యం అండాలతో దందాలు చేస్తున్నారు. కిడ్నీ మార్పిడులు చేస్తున్నారు. పోలీసుల నిఘా కొరవడటం వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తుండటంతో వీళ్లు ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా కొనసాగుతోంది. ఏవైనా ఫిర్యాదులు అందినపుడో ఏదైనా జరగరాని సంఘటన జరిగినపుడో ఇలాంటి దారుణాలు వెలుగు చూస్తున్నాయి. ఆ సమయంలో కొన్ని రోజులు హడావిడి చేస్తున్న అధికార యంత్రాంగాలు ఆ తరువాత షరా మామూలే అన్నట్టుగా మిన్నకుండి పోతున్నాయి. దీంతో డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్న కొందరు డాక్టర్లు…ముఠాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.

సరోగసీ పేర
తాజాగా వెలుగు చూసిన యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఉదంతాన్ని విశ్లేషిస్తే అధికార యంత్రాంగాలు ఎంత అలసత్వంతో వ్యవహరిస్తున్నాయో స్పష్టమవుతుంది. ఈ సెంటర్ ను నడిపిస్తున్న డాక్టర్ నమ్రతపై ఇప్పటికే వేర్వేరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. కొన్నేళ్ల క్రితమే ఆమె డాక్టర్ గా పని చేయటానికి వీల్లేదంటూ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నిషేధం కూడా విధించింది. ఆమె నడుపుతున్న టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్​ ను సీజ్ కూడా చేశారు. అయితే, మరో డాక్టర్ పేర అనుమతులు తెచ్చుకున్న డాక్టర్ నమ్రత తన అక్రమాలను కొనసాగిస్తూ వచ్చింది. సంతానం కోసం తన వద్దకు వచ్చిన వారిని మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు…సరోగసీ ద్వారానే బిడ్డలను కనాల్సి ఉంటుందని నమ్మించింది. పోనీ, ఆ పనైనా సక్రమంగా చేసిందా? అంటే అదీ లేదు. వచ్చిన దంపతుల్లో భర్త నుంచి వీర్యం సేకరించి దాని ద్వారా కాకుండా ఎవరికో పుట్టిన పసికందులను కొని మీకు పుట్టిన బిడ్డే అంటూ అప్పగించింది. ఒక్కొక్కరి నుంచి 30 నుంచి 35లక్షల రూపాయలు వసూలు చేసింది. పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో గడిచిన రెండేళ్లలోనే డాక్టర్ నమ్రత ఇలా ముప్పయి మందిని సరోగసీ పేర లూటీ చేసినట్టుగా వెల్లడి కావటం గమనార్హం.

Also Read: Weight Loss Tips: బరువు తగ్గాలా.. జిమ్, డైట్ అక్కర్లేదు.. ఈ పండ్లు తింటే చాలు!

కిడ్నీ మార్పిడి దందా
ఇక, కొందరు వైద్యులు కిడ్నీ మార్పిడి దందాను యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎవరికైనా కిడ్నీ మార్పిడి చేయాలంటే దానికి పలు నిబంధనలు ఉన్నాయి. ఎవరికైతే కిడ్నీ అవసరమో వారికి కిడ్నీని ఇచ్చే దాత కుటుంబ సభ్యుడై ఉండాలి. కనీసం సమీప బంధువైనా కావాలి. స్వచ్చంధంగా కిడ్నీ ఇస్తున్నట్టు లిఖిత పూర్వకంగా తెలియచేయాలి. ఇలా వీలు పడని పక్షంలో వైద్యులతో కూడిన కమిటీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్దతిలో మ్యాచ్ అయ్యే కిడ్నీ దాత నుంచి దొరికినపుడు కమిటీ తెలియ చేస్తుంది. అయితే, డబ్బు సంపాదించటమే లక్ష్యంగా పని చేస్తున్న కొందరు డాక్టర్లు ఈ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కుతున్నారు. ఏజెంట్లను పెట్టుకుని పేదరికంలో మగ్గుతున్న వారికి తాము చెప్పినట్టుగా చేస్తే 4 నుంచి 5లక్షలు ఇస్తామని చెప్పి కిడ్నీలు ఇవ్వటానికి ఒప్పిస్తున్నారు. ఆ తరువాత అప్పటికే తమ వద్దకు కిడ్నీ సమస్యలతో వచ్చిన వారికి దాత దొరికాడు…అయితే ఖర్చు కాస్తా ఎక్కువవుతుందని చెప్పి 20 నుంచి 3‌‌0లక్షలు వసూలు చేస్తున్నారు. సరూర్​ నగర్ డాక్టర్స్ కాలనీలోని అలకనంద హాస్పిటల్​ లో ఇలా అక్రమంగా కిడ్నీ మార్పిడుల ఆపరేషన్లు జరుగుతుండగా సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు దాడులు జరిపారు. పలువురు డాక్టర్లతోపాటు 15మందికి పైగా నిందితులను అరెస్ట్ చేశారు.

భ్రూణ హత్యలు
ఇక, మరికొందరు డాక్టర్లు, ఆర్ఎంపీలు గర్భంలో బిడ్డ పిండంగా ఉన్నపుడే చిదిమి వేస్తున్నారు. విచ్చలవిడిగా అబార్షన్లు చేస్తూ బిడ్డ భూమ్మీద పడక ముందే కాటికి పంపిస్తున్నారు. నిజానికి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 ప్రకారం అబార్షన్ చేయించుకోవచ్చు. అయితే, ఇలా చేయాలంటే గర్భస్థ శిశువు వయసు 12 వారాలలోపు ఉండాలి. అబార్షన్​ అవసరమని రిజిష్టర్డ్ డాక్టర్​ నివేదిక తప్పనిసరి. గర్భస్థ శిశువు వయసు 12 వారాలు దాటితే ఇద్దరు డాక్టర్ల నివేదిక ఉండాలి. ఇక, ఈ చట్టంలోని 3వ సెక్షన్​ ప్రకారం గర్భధారణ తల్లి ప్రాణానికి ప్రమాదమని, ఆమె శారీరక, మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని తేలితే అబార్షన్ చేయవచ్చు. అయితే, చాలా మంది పుట్టబోయేది ఆడబిడ్డా?…మగబిడ్డా? అన్నది నిర్ధారించుకుని ఆడ సంతానమైతే అబార్షన్లు చేయించుకుంటున్నారు. డబ్బు తీసుకుని వైద్యులు చేస్తున్నారు. నిజానికి లింగ నిర్ధారణ పరీక్షలు చేయటమే చట్టరీత్యా నేరం. అబార్షన్లు…లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్టుగా నిర్ధారణ అయితే చట్టంలో కఠిన శిక్షలు ఉన్నాయి. డాక్టర్ లైసెన్స్ కూడా రద్దవుతుంది. అయినా, చాలామంది డాక్టర్లు గుట్టుచప్పుడు కాకుండా ఈ పని చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు పెద్ద ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. పలువురు మహిళలు చనిపోతున్నారు కూడా. తాజాగా సూర్యాపేటలో ఇలాగే ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. తరచూ ఇలాంటి విషాదాలు వెలుగు చూస్తున్నా పట్టించుకునే నాధుడే లేడు.

Also Read: Cancer: షాకింగ్.. ధూమపానం చేయని వారిలో కూడా తల, మెడ క్యాన్సర్‌?

రక్తంతో దందా
ఇక, రక్తంతో దందా చేసేవారు రాష్​ట్రంలో రక్తబీజుల్లా విస్తరించి ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం దేశ జనాభాలో కనీసం 1 శాతం రక్తం నిల్వలు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. ఈ క్రమంలో మన దేశ జనాభా 140 కోట్లు అనుకుంటే కోటీ 40లక్షల యూనిట్ల రక్తం నిల్వలు ఉండాలి. అయితే, వైద్య శాఖకు చెందిన అధికారులు చెబుతున్న ప్రకారం ఏ నెలలో చూసినా ఉండాల్సిన దానికన్నా 25శాతం రక్తం నిల్వలు తక్కువగా ఉంటున్నాయి. ఎండాకాలంలో ఈ శాతం 50శాతానికి కూడా చేరుతోంది. సరిగ్గా ఈ పరిస్థితిని అవకాశంగా చేసుకుంటున్న కొన్ని ముఠాలు రక్తంతో వ్యాపారం చేస్తున్నాయి. ఎవరికైనా రక్తం అవసరమైతే ప్రభుత్వ, ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా రక్తం ఇచ్చినందుకు ఆయా బ్యాంకులు ఒక్క రూపాయి కూడా తీసుకోవటానికి వీల్లేదు. వచ్చిన వారికి ఎన్ని యూనిట్ల రక్తం ఇస్తున్నారో…వారి నుంచి వారి సంబంధీకుల నుంచి అన్ని యూనిట్ల రక్తాన్ని తీసుకోవాలి. కాగా, ఆయా బ్లడ్ బ్యాంకుల్లో పని చేస్తున్న కొందరు ఉద్యోగులను డబ్బు ఇచ్చి లొంగదీసుకుంటున్న గ్యాంగులు అక్రమంగా రక్తం యూనిట్లను అమ్ముతున్నారు. అవతలి వారి అవసరాన్ని బట్టి ఒక్కో యూనిట్​ ను 3 వేల నుంచి 5వేల రూపాయలకు అమ్ముతున్నారు. ఇక, రక్తంతోపాటు దాంట్లో నుంచి తెల్ల రక్త కణాలు, ప్లాస్మా వేరు చేసి వాటిని కూడా అంగట్లో సరుకుల్లా విక్రయిస్తున్నారు.

వీర్యం.. అండాలతో వ్యాపారం
తాజాగా కొంతమంది వీర్యం అండాలతో కూడా వ్యాపారం చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. దీని కోసం రెజిమెంటల్ బజార్ లో అక్రమంగా నడుస్తున్న ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థ గుట్టును టాస్క్ ఫోర్స్​ పోలీసులు రట్టు చేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే అనుకోకుండా ఈ సెంటర్ బాగోతం వెలుగు చూడటం. విశ్వసనీయంగా తెలిసిన ప్రకారం టాస్క్ ఫోర్స్ లో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్​ ను సదరు సెంటర్ నిర్వాహకులు వీర్యం దానం చేయాలని అడిగారు. వీర్య దానమేందో అర్థంగాక ఆ కానిస్టేబుల్ సెంటర్ కు వెళ్లటం అక్కడ జరుగుతున్న తతంగాన్ని గమనించి పై అధికారులకు సమాచారం అందించటంతో దీని వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ సెంటర్ నిర్వాహకులు అన్ని నిబంధనలను తుంగలో తొక్కుతూ 3 నుంచి 5వేల రూపాయలు ఇచ్చి వీర్యం 15 నుంచి 20వేలు ఇచ్చి అండాలు సేకరిస్తున్నట్టుగా బయట పడింది. ఇలా సేకరించిన వీర్యం, అండాలను గుజరాత్, మధ్య ప్రదేశ్ లలో ఉన్న టెస్ట్ ట్యూబ్​ బేబీ సెంటర్లకు పంపిస్తున్నట్టుగా వెల్లడైంది. ఇలా ‘కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ల.. కాదేవీ కవితకు అనర్హ’ అన్నట్టుగా అక్రమ సంపాదనలకు మరిగిన కొంతమంది డాక్టర్లు…ప్రైవేట్ వ్యక్తులు మనుషులతోనే దందాలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని కోట్ల రూపాయల్లో కొనసాగుతున్న ఈ అక్రమాలకు చెక్ పెడతారని ఆశిద్ధాం.

Also Read: Mobiles Handed over: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు బాధితులకు అప్పగింత

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?