Kodanda Reddy: మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన రైతులు రైతు కమిషన్‌ను ఆశ్రయించారు. నకిలీ వరి విత్తనాలతో మోసపోయామని, తమకు న్యాయం చేయాలని కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డిని వేడుకున్నారు. ఓ ప్రైవేట్ సీడ్ కంపెనీని నమ్మి 40 మంది రైతులు 100 ఎకరాలకుపైగా వరి సాగుచేస్తే ఆశించిన దిగుబడి రాలేదని, పెట్టిన పెట్టుబడి కూడా దక్కలేదని వాపోయారు. సీడ్ కంపెనీ వాళ్ళు ఎకరానికి 30-35 క్వింటాళ్ల ధాన్యం పండుతుందని, కోత సమయంలో వచ్చి ప్రభుత్వం ఇచ్చే ధరకంటే క్వింటాల్‌కు అదనంగా రూ.150 ఇస్తామని ఆశపెట్టారని తెలిపారు.
Also Read: Kodanda Reddy: పత్తి రైతుల సమస్యలను పరిష్కరించాలి : గవర్నర్ తో రైతు కమిషన్ భేటి
రైతులు ఆవేదన వ్యక్తం
కానీ, ఇప్పుడు చూస్తే నకిలీ విత్తనాలతో ఎకరాకు 8 క్వింటాళ్లు రావడంతో వరి సాగు చేసిన రైతుల్లో ఆందోళన మొదలైందని కమిషన్ ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సీడ్ కంపెనీల మోసాన్ని కలెక్టర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయితే అధికారులు కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారని కమిషన్‌కు వివరించారు. తమకు నష్టపరిహారం ప్రకటించడం లేదన్నారు. రైతు కమిషన్ చొరవ తీసుకొని రుక్మాపూర్ రైతులకు సత్వర న్యాయం చేయాలని కోరారు. రైతుల ఆవేదన విన్న కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి ఒకటి రెండు రోజుల్లో అధికారులను ఫీల్డ్‌లోకి పంపి నివేదిక తెప్పించుకున్న తర్వాత న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
Also Read: Kodanda Reddy: రైతులకు పక్కా రసీదులు ఇవ్వాలి.. రైతుకమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

