Yellampet Municipal Elections: ఎల్లంపేట మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని డబిల్పూర్ గ్రామంలో నామినేషన్ ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన పోటీ చేస్తున్న అభ్యర్థులకు శాలువాలు కప్పి, వీర తిలకం దిద్ది ఎన్నికల బరిలోకి పంపించారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ అన్ని పార్టీలను ప్రజలు చూసారని, ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై విమర్శలు
నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత దేశంలో శాంతి, భద్రత, అభివృద్ధి పెరిగాయని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
ప్రజలు తింటున్న బియ్యం కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని, హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి వేల కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్లు కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోందని అన్నారు. తాను ఎంపీ అయిన తర్వాత మల్కాజిగిరిలో రైల్వే బ్రిడ్జిల నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకి ఓటు వేసినా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని ఈటల వ్యాఖ్యానించారు. పట్టణాల్లో అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ హామీలపై ప్రశ్నలు
ఆడబిడ్డలకు రూ.2500, పెళ్లికి లక్ష రూపాయలు, ఆటో డ్రైవర్లకు నెలకు రూ.1000, నిరుద్యోగ భృతి రూ.4000, స్కూటీ, పెన్షన్ పెంపు వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని ఈటల విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, 66 హామీలు మాటలకే పరిమితమయ్యాయని అన్నారు. సఫాయి కార్మికులకు జీతాలు ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు లేవని కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే ఎన్నికలు నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు.
Also Read: Tirumala Laddu Controversy: జగన్ కాళ్లు కడిగి.. నీళ్లు నెత్తిన జల్లుకోండి.. చంద్రబాబు, పవన్‌పై రోజా ఫైర్
‘అక్రమాలకు ఎదురొడ్డి నిలబడ్డా’
పేదల ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకంగా నిలబడ్డానని, ల్యాండ్ బ్రోకర్ల అక్రమాలకు ఎదురుగా పోరాడానని ఈటల రాజేందర్ గుర్తుచేశారు.దోపిడీ లేని పాలన కావాలంటే బీజేపీని గెలిపించాలని ఎల్లంపేట మున్సిపాలిటీలో కమలం జెండా ఎగురవేయాలని కోరారు. కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎల్లంపేట మున్సిపల్ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

