Tirumala Laddu Controversy: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ నేతృత్వంలోని సిట్ ఇచ్చిన నివేదిక చెప్పు దెబ్బతో సమానమని వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా అన్నారు. తిరుమల లడ్డు తయారీకి వాడిన నెయ్యిలో పందికొవ్వు, ఫిష్ ఆయిల్, ఎన్.డి.డి.బి లేదని సిట్ రిపోర్టు తేల్చి చెప్పిందని పేర్కొన్నారు. రాజకీయ లబ్ది కోసం కూటమి ప్రభుత్వం ఎంతటికైనా దిగజారుతుందని ఈ ఘటన రుజువు చేస్తోందని విమర్శించారు.
‘పవన్.. డ్రామా ఆర్టిస్టు’
తిరుమల లడ్డులో జంతువులు కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు (CM Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తప్పుడు ప్రచారం చేశారని చిత్తూరు జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి రోజా ఫైర్ అయ్యారు. ప్యాకేజీ అందగానే పవన్ కళ్యాణ్ డ్రామాలు వేశారని.. చంద్రబాబు ఆడించే రాజకీయ డ్రామా ఆర్టిస్టు డిప్యూటీ సీఎం అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జంతువుల కొవ్వు కలిసిందని మీరు చేసిన ఆరోపణలు సిట్ నివేదికతో అబద్దమని తేలిపోయిందన్నారు. కాబట్టి భక్తుల కాళ్లు, జగన్ మోహన్ రెడ్డి కాళ్లు కడిగి ఆ నీళ్లను నెత్తిన చల్లుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పవన్ ఏ గుడి మెట్లు కడుగుతారో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు.
‘వీళ్ల నోళ్లను ఫినాయిల్‌తో కడగాలి’
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యేపై మహిళ చేసిన లైంగిక ఆరోపణల అంశంపైనా రోజా మాట్లాడారు. ఆడవాళ్లకు అబార్షన్ లు చేయించి.. రోడ్డున పడేసిన వాళ్లు సనాతన ధర్మాన్ని కాపాడుతారా? అంటూ పరోక్షంగా పవన్ ను ఉద్దేశించి విమర్శించారు. లడ్డుపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై సుమోటోగా సుప్రీంకోర్టు కేసు నమోదు చేయాలని రోజా అన్నారు. దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వీళ్ల నోళ్లను ఫినాయిల్ తో కడగాలని భక్తులకు సూచించారు. విజయవాడ వరదలను డైవర్ట్ చేయడానికే లడ్డు ప్రసాదంలో కల్తీ అంశం తెరపైకి తెచ్చారని ఆక్షేపించారు.
Also Read: NCP Politics: అజిత్ పవార్ మృతితో ఎన్‌సీపీలో మొదలైన పాలిటిక్స్!.. డిప్యూటీ సీఎం పదవి ఆమెకు ఫిక్స్?
‘తరిమి తరిమి కొట్టాలి’
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిపై విషం చిమ్మడంపై ప్రధాని మోదీ వెంటనే స్పందించాలని రోజా కోరారు. దేవుడు లడ్డు ను కూడా రాజకీయంగా ఉపయోగించుకున్న వీళ్లని తరిమి తరిమి కొట్టాలన్నారు. ఒక వేళ ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో సిట్ విచారణ చేసి ఉంటే అసలు నిజాలు బయటకు వచ్చేవి కావని రోజా అన్నారు. పక్క దేశాల్లో పాలకులను తరిమి కొట్టినట్లు కూటమి ప్రభుత్వ నేతలను సైతం రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టాలని రోజా పిలుపునిచ్చారు.

