TG Rice Scam: ప్రభుత్వం రైతుల దగ్గర సేకరించిన ధాన్యాన్ని మిలర్లకు అప్పగించాలి. ఆ మిల్లర్లు ప్రభుత్వానికి దఫాల వారీగా బియ్యాన్ని ఇవ్వాలి. కానీ 2022 – 23 రబీ సీజన్‌లో రైతుల వద్ద సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించినా, దానికి బదులుగా ఒప్పందం ప్రకారం బియ్యాన్ని ఇవ్వలేదు. దీనిపై మిలర్ల యాజమాన్యం జాప్యం చేస్తున్నది. గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్లకు ప్రభుత్వం టెండర్ పద్దతిలో ధాన్యం అప్పగించింది. కానీ రంగారెడ్డి(Rangareddy), మేడ్చల్(Medchal), ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రమే టెండర్ పద్దతిలో కాకుండా పాత పద్దతి ద్వారా అంగీకారం చేసుకున్నది. అయినప్పటికీ రైస్ మిల్లర్ల యాజమాన్యం ఒప్పందాలకు విరుద్దంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం అప్పగించిన ధాన్యానికి సరిపడా బియ్యం ఇవ్వకుండా అక్రమంగా విక్రయించుకున్నది. ఈ విషయాన్ని గమనించిన సంబంధిత అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మిల్లర్లపై దాడులు నిర్వహించారు. దీంతో ఈ బాగోతం బహిర్గతమైంది. టెండర్ పద్ధతిలో నిర్వహించిన వికారాబాద్ జిల్లాలో కూడా రికవరీ లేదు. రంగారెడ్డి జిల్లాలో అదే దుస్థితి ఉన్నది.
Also Read: S Thaman: థమన్‌పై ఈ ట్రోలింగ్ ఏంటి? ‘అఖండ 2 – రాజా సాబ్’ మధ్య ఈ పోలికలేంటి?
రికవరీ సాధ్యం అయ్యేనా?
రైస్ మిల్లర్లకు ధాన్యం అప్పగించి ఏండ్లు గడుస్తున్న ప్రభుత్వానికి బియ్యం ఇవ్వడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఈ విషయాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకోకపోవడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఏఏ రైస్ మిల్లర్లకు ఎన్ని క్వింటాళ్ల ధాన్యం అప్పగించారో వివరాలు సేకరించారు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం వివరాలతో క్షేత్రస్థాయి పర్యటనలతో దాడులు నిర్వహించారు. దాంతో మిల్లర్లు చేసే అక్రమాలపై నోరు తెరిచారు. బాధ్యతాయుతంగా ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం సేకరించి మిల్లర్లకు అప్పగిస్తే అక్రమ మార్గంలో విక్రయాలు చేయడంపై అధికారులు సీరియస్ అయ్యారు. రంగారెడ్డి జిల్లాలో 12 రైస్ మిల్లర్లకు 2022 – 23 రబీ సీజన్‌లో 41,305 క్వింటాళ్ల ధాన్యం ప్రభుత్వం అప్పగించింది. అందుకు 12,196 క్వింటాళ్ల ధాన్యానికి సంబంధించి బియ్యం ప్రభుత్వానికి 2024 మే నెలలో అప్పగించాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి 8,253 క్వింటాళ్ల బియ్యం 12 రైస్ మిల్లర్ల యాజమాన్యం ఇవ్వాలి. కానీ, ఇప్పటి వరకు కేవలం 5,162 క్వింటాళ్ల బియ్యం మాత్రమే ప్రభుత్వానికి అప్పగించారు. మిగిలిన 3,091 క్వింటాళ్ల బియ్యం పెండింగ్‌లో ఉన్నది. వికారాబాద్ జిల్లాలోని 30 రైస్ మిల్లర్లకు 38,613 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం అప్పగించారు. ఇందుకుగాను 25,870 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి మిల్లర్లు సరఫరా చేయాలి. సుమారుగా 23 వేల మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే బియ్యం అప్పగించినట్లు తెలుస్తున్నది. ఇంకా 2 వేలకు పైగా మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అప్పగించాలి. అయినప్పటికీ మిల్లర్ యాజమాన్యం మీనమేషాలు లెక్కిస్తున్నది.
అధికారులతో యాజమాన్యం కుమ్మక్కు
రెండేండ్లలో సీఎంఆర్ ఇవ్వాల్సిన మిల్లులు దాటవేత ధోరణితో కాలం వెళ్లదీస్తున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు జరిగి నెలలు గడుస్తున్నా చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టినా పట్టించుకోవడం లేదు. దీంతో మిల్లులతో కుమ్మక్కు అయ్యారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
Also Read: Mahabubabad Tahsildar: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ తహసిల్దార్

