SLBC Canal Lands: ఎస్ఎల్బీసీ కాలువ కబ్జాకు గురవుతున్నది. నిత్యం పర్యవేక్షణ చేయాల్సిన నీటిపారుదలశాఖ (Irrigation Department) అధికారులు కార్యాలయాలకే పరిమితం కావడంతో ఇరిగేషన్ భూములన్నీ ఆక్రమణకు గురవుతున్నాయి. అంతేకాదు మేజర్, మైనర్ కాలువుల భూములు కనుమరుగవుతున్నాయి. మరికొన్ని రోజులు పోతే అసలు ఆనవాళ్లు లేకుండాపోయే ప్రమాదం ఉన్నది. కొందరైతే భూములను సాగు చేసుకోవడంతో పాటు కాలువలకు ఇచ్చిన భూమి వెంట బాటలు సైతం లేకుండా చేస్తున్నారు. రైతులు ఫిర్యాదు చేస్తున్నా అటు ఇరిగేషన్, ఇటు రెవెన్యూ అధికారుల్లో స్పందన కరువైందని బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి.
200 ఎకరాల దాకా ఆక్రమణ
(Nalgonda District) నల్లగొండ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు, తాగు నీరందించాలనే లక్ష్యంతో ఏఎంఆర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువలను నిర్మించారు. పుట్టంగండి నుంచి మూసీ వరకు ప్రధాన కాలువను నిర్మించారు. మేజర్, మైనర్ కాలువలతో చెరువులు, కుంటలు నింపుతున్నారు. అయితే, ఆ భూములు అధికారుల పర్యవేక్షణ కొరవడంతో ఆక్రమణకు గురవుతున్నాయి. ఏకంగా కొందరు సమీపంలోని రైతులు ఆక్రమించుకొని తమ భూముల్లో కలిపేసుకుని సాగు చేస్తున్నారు. ఆక్రమణతో కాలువల ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి.
ప్రధాన కాలువ పుట్టంగండి నుంచి నకిరేకల్ మండలం నడిగూడెం వద్ద మూసీ రిజర్వాయర్‌లో 135 కిలో మీటర్ల పొడవు ప్రవహించి కలుస్తుంది. ఈ కాలువకు 55 డిస్ట్రిబ్యూటర్లు, 250కి పైగా మైనర్ కాలువలు ఉన్నాయి. అయితే, నకిరేకల్ నియోజకవర్గంలో మైనర్ వాటికి సీజన్ వారీగా నీరు వచ్చినవి కొన్ని, నీరు రాక కొన్ని ఉన్నాయి. ఈ క్రమంలో భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. అలా ఆక్రమణకు గురైన భూములు 200 ఎకరాల వరకు ఉంటుందని సమాచారం.
Also Read:Illegal Constructions: పుట్ట గొడుగుల్లా వెలుస్తున్న అక్రమ కట్టడాలు
కాలువ ఆనవాళ్లు లేకుండా..
కాలువలకు భూ సేకరణ సమయంలో రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. ఎవరి భూమి పోతుందని గుర్తించి వారికి ప్రభుత్వం నష్టపరిహారం సైతం చెల్లించింది. రెవెన్యూ రికార్డుల్లోంచి సైతం ఆ రైతుల పేర్లను తొలగించింది. ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో సైతం నమోదు చేసింది. దీంతో భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి హక్కులు ఉండవు. ఎస్‌ఎల్బీసీ కాలువలు నకిరేకల్ డివిజన్ పరిధిలో 124 నుంచి 125 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి. మెయిన్ కెనాల్‌తో పాటు సమీపంలోని చెరువులు, కుంటలు నింపేందుకు సబ్ కెనాల్స్‌ను తవ్వారు.
అయితే, తిరిగి నకిరేకల్ పట్టణం, మండల పరిధితో పాటు కేతేపల్లి, కట్టంగూర్ మండలాల్లో సైతం కాలువ భూములు కబ్జాకు గురవుతున్నాయి. నాడు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు కొంతమంది మళ్లీ అందులో సాగు చేసుకుంటున్నారు. అంతేకాదు ఆ భూములు తమవి అంటూ నిర్మాణ సమయంలో వేసిన బాటలను సైతం తొలగించి సాగు చేస్తుండడం గమనార్హం. గతంలో అధికారులు కాలువల వెంట వేసిన హద్దు రాళ్లను సైతం తొలగించారు. రహదారికి సమీపంలో ఉంటే ఆ భూములను ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న ఘటనలు ఉన్నాయి. పాలెం నుంచి గుడివాడ చెరువుకు నీటిని తీసుకెళ్లె డీ 53 కాలువకు ఇరువైపులా ఉన్న పలువురు రైతులు భూములను ఆక్రమించారు. ప్రభుత్వ భూమిని తమ పట్టా భూమిలో కలిపివేశారు. కాలువ ఆనవాళ్లు లేకుండా చేశారు.
అధికారుల నిర్లక్ష్యం
నిత్యం పర్యవేక్షణ చేస్తూ, భూములను పరిరక్షించాల్సిన ఇరిగేషన్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. కాలువల ఆనవాళ్లు లేకుండా పోతున్నా పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కొంతమంది రైతులు ఫిర్యాదులు చేస్తే అధికారులు పరిశీలించి వెళ్తున్నారు తప్ప హద్దురాళ్లను పాతి పకడ్బందీగా చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో మళ్లీ ఆ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
మంత్రి ఆదేశాలు
రాష్ట్ర వ్యాప్తంగా అన్యాక్రాంతం అవుతున్న నీటిపారుదల శాఖ భూముల పరిరక్షణకు తక్షణమే చర్యలు చేపట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు ఈ నెల 19న ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పూడిక తీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రత్యేక డ్రైవ్‌తో నీటిపారుదల శాఖ భూములన్నింటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. అయితే, మంత్రి ఆదేశాలతోనైనా కాలువల భూముల పరిరక్షణకు అధికారులు కదులుతారా అనేది ఇప్పడు చర్చకు దారి తీసింది.
Also Read: Vizag Scam: వైజాగ్‌లో అంబేద్కర్ పేరిట భారీ మోసం.. బోర్డు తిప్పేసిన మ్యాక్స్!