గ్రీన్ ఫీల్డ్ హైవే స్పీడప్..
భారత్ ఫ్యూచర్ సిటీ-అమరావతి-మచిలీపట్నం 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవేకు వెంటనే అనుమతులు ఇవ్వాలని ఎన్‌హెచ్ఏఐ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో తాము డ్రైపోర్ట్, లాజిస్టిక్ పార్క్,ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేతో రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య అనుసంధానం ఏర్పడడంతో సరకు రవాణా, ప్రయాణికులకు ఎంతగానో సౌకర్యవంతంగా ఉంటుందని సీఎం అన్నారు. హైదరాబాద్-విజయవాడల మధ్య 70 కిలోమీటర్లు దగ్గరవడంతో పాటు సరకు రవాణాతో భారత దేశంలో మరే జాతీయ రహదారిపై లేనంత రద్దీ.. ఆదాయం ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేతో ఉంటుందని సీఎం తెలిపారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోనూ రెండు రాష్ట్రాల మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించాలని పేర్కొన్నారని సీఎం గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తక్షణమే రంగంలోకి దిగి పీఎం గతిశక్తి లేదా మరే పథకంలోనైనా ఈ రహదారికి అవసరమైన అనుమతులు ఇవ్వడంతో పాటు అలైన్‌మెంట్ ఖరారు చేయాలని సూచించారు. ఈ రహదారికి సమాంతరంగా తాము రైలు మార్గం అడుగుతున్నామని… బెంగళూర్-శంషాబాద్ ఎయిర్‌పోర్ట్-అమరావతి మధ్య రైలు మార్గం అవసరమని.. వందేభారత్ సహా ఇతర రైళ్ల రాకపోకలకు ఇది అనువుగా ఉంటుందని.. లాభసాటి మార్గమని సీఎం అన్నారు.
ఆ హైవేకు పర్మిషన్ అవసరం..
హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో రావిర్యాల- మన్ననూర్‌కు సంబంధించి ఎలివేటెడ్ కారిడార్‌కు వెంటనే అనుమతులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. శ్రీశైలం దేవస్థానం, శ్రీశైలం రిజర్వాయర్, టైగర్ ఫారెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు రాకపోకలు సాగిస్తారని సీఎం తెలిపారు. ఎలివేటెడ్ కారిడార్‌కు అవసరమైన అనుమతులు మంజూరు చేసి తక్షణమే పనులు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్ఏఐ అధికారులకు సీఎం సూచించారు. హైదరాబాద్-మన్నెగూడ రహదారిలో మర్రి చెట్ల తొలగింపునకు సంబంధించి ఎన్జీటీలో ఉన్న కేసు పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం సూచించారు. హైదరాబాద్-మంచిర్యాల-నాగ్‌పూర్ నూతన రహదారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమర్పించిన ప్రతిపాదనలనే అంగీకరించాలని సీఎం కోరారు. తాము ప్రతిపాదించిన మార్గంతో నూతన పారిశ్రామిక పార్క్‌ల ఏర్పాటుతో పాటు పలు జాతీయ రహదారుల అనుసంధానం పూర్తవుతుందని సీఎం తెలిపారు. దీంతో పాటు మంచిర్యాల-వరంగల్-ఖమ్మం-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-163జి), ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల (ఎన్‌హెచ్-63), జగిత్యాల-కరీంనగర్ (ఎన్‌హెచ్-563), మహబూబ్‌నగర్-మరికల్-దియోసుగూర్ (ఎన్‌హెచ్-167) రహదారులకు సంబంధించి భూ సేకరణ, పరిహారం పంపిణీలో జాప్యంపై ఆయా జిల్లాల కలెక్టర్లను వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
అవసరమైన చోట ప్రత్యామ్నాయంగా భూ కేటాయింపు..
జాతీయ రహదారుల నిర్మాణంలో అటవీ, పర్యావరణ శాఖ పెడుతున్న కొర్రీలపైనా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. 2002 నుంచి 2022 వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అటవీ, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించారని.. దాంతో ప్రస్తుతం అనుమతులు ఇవ్వడం లేదని ఫారెస్ట్ సౌత్ రీజియన్ ఐజీ త్రినాధ్ కుమార్ తెలిపారు. దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పని చేసిన అధికారులు ఇప్పుడు లేరన్నారు. ఉల్లంఘనలకు సంబంధించి వివరాలు సమర్పించాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. అవసరమైనచోట ప్రత్యామ్నాయ భూమిని అటవీ పెంపకానికి ఇస్తామని సీఎం తెలిపారు. ఈ విషయంలో అవసరమైతే జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌లతో తాను స్వయంగా భేటీ అవుతానని సీఎం తెలిపారు. వన్యప్రాణులు లేని అటవీ ప్రాంతాల్లోనూ వన్య ప్రాణుల చట్టం అమలు చేస్తున్నారని సీఎం అన్నారు. నాన్ వైల్డ్ లైఫ్ ఏరియాల్లో వైల్డ్ లైఫ్ మిటిగేషన్ ప్లాన్‌కి ఎన్‌హెచ్ఏఐలో ఎటువంటి ప్రొవిజన్ లేకపోవడంతో అనుమతులు ఆలస్యమవుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో అవసరమైన వ్యయం భరించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో చొరవ చూపి అటవీ అనుమతుల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణకు సీఎం సూచించారు. ఇక తమ కార్యాలయ నిర్మాణానికి హైదరాబాద్‌లో రెండు ఎకరాల భూమి కేటాయించాలని ఎన్‌హెచ్ఏఐ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. వారికి అవసరమైన భూమిని చూసి ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.