తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ కానిస్టేబుల్ కుటుంబానికి (Constable Family) డీజీపీ శివధర్ రెడ్డి (Shivadhar Reddy) గురువారం తన కార్యాలయంలో కోటి 31 లక్షల రూపాయల చెక్కును అందచేశారు. బోయ పాండు అనే కానిస్టేబుల్అంబర్ పేట సీపీఎల్‌లో విధులు నిర్వర్తించేవాడు. గతేడాది మార్చి 25న తన భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. దుర్ఘటనలో బోయ పాండు, ఆయన భార్య మృత్యువాత పడ్డారు. అతడికి బ్యాంక్ ఆఫ్ బరోడాలో బ్యాంక్ అకౌంట్ ఉంది. బ్యాంకు నుంచి ఇన్సూరెన్స్ ఉండటంతో ఆయన కుటుంబానికి కోటి 31 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ చెక్కును డీజీపీ శివధర్ రెడ్డి పాండు కుటుంబీకులకు అందచేశారు. కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా డీజీఎం మురళీకృష్ణ, సలహాదారు, రిటైర్డ్ బ్రిగేడియర్ ఎస్‌కే ప్రసాద్ పాల్గొన్నారు.
బాధ్యతలు స్వీకరించిన డీసీపీలు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: పునర్ వ్యవస్థీకరించిన హైదరాబాద్ కమిషనరేట్‌లోని వేర్వేరు జోన్లకు డీసీపీలుగా నియమితులైన అధికారులు గురువారం బాధ్యతలు స్వీకరంచారు. అనంతరం కమిషనర్ వీసీ సజ్జనార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో శాంతిభద్రతల పరిరక్షణతోపాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా పని చేయాలని కమిషనర్ వారికి మార్గనిర్ధేశనం చేశారు. చార్మినార్ జోన్ డీసీపీగా ఖరే కిరణ్ ప్రభాకర్, రాజేంద్రనగర్ జోన్ డీసీపీగా ఎస్.శ్రీనివాస్, గోల్కొండ జోన్ డీసీపీగా చంద్రమోహన్, జూబ్లీహిల్స్ జోన్ డీసీపీగా రమణారెడ్డి, శంషాబాద్ జోన్ డీసీపీగా బీ.రాజేశ్ బాధ్యతలు స్వీకరించారు.
Read Also- Seethakka Meets KCR: మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసి మంత్రులు సీతక్క, కొండా సురేఖ.. కారణం ఏంటంటే?
సంక్రాంతి ఆఫర్ల పేర మోసాలు
జాగ్రత్త అంటున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: సంక్రాంతి పండుగ సమీపించిన నేపథ్యంలో సైబర్ క్రిమినల్స్ సరికొత్త మోసాలకు తెర లేపారు. పండుగ ఆఫర్ అంటూ సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా మెసేజీలు పంపిస్తూ జనాన్ని ఉచ్ఛులోకి లాగుతున్నారు. చిక్కిన వారి నుంచి లక్షలు కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ సూచించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకొనే విషయం తెలిసిందే. చాలామంది సొంతూళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంబరాలు జరుపుకొంటారు. మరికొందరు సెలవుల్లో తీర్థయాత్రలు, పర్యాటక స్థలాలకు వెళుతుంటారు. ఇదే అవకాశంగా సైబర్ క్రిమినల్స్ వాట్సాప్, ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా ఫెస్టివల్ ఆఫర్ అంటూ మెసేజీలు పంపిస్తున్నారు. బస్సు, రైలు, విమానం, క్రూయిజ్ బుకింగ్ లకు సంబంధించి నకిలీ వెబ్ సైట్లను ఇంటర్ నెట్ లో పెట్టి మోసాలు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తిని ఇలాగే క్రూయిజ్ బుకింగ్ పేర 2.40 లక్షలు మోసం చేశారు. ఇక, లక్కీ డ్రాలో బహుమతులు గెలుచుకున్నారని, డిస్కౌంట్ లో ఆన్ లైన్ షాపింగ్ అని కేటుగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. ఇక, సంక్రాంతి శుభాకాంక్షల పేర ఏపీకే ఫైళ్లను పంపించి అవతలి వారి ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఆ తరువాత వారి బ్యాంక్ ఖాతాల్లో ఉన్న నగదును ఊడ్చేస్తున్నారు. మోసానికి గురైతే మొదటి గంటలోపు 1930 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. మొదటి గంటలో ఫిర్యాదు ఇస్తే పోగొట్టుకున్న డబ్బును ఫ్రీజ్ చేయించే అవకాశాలు ఉంటాయని తెలిపారు.
Read Also-Celebrity Controversy: మరోసారి వైరల్ అవుతున్న అనసూయ వీడియో.. శివాజీని ఏం అన్నారంటే?

