Sarpanch Elections: తెలంగాణలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఆసక్తికర ఘటనలు వెలుగుచూస్తున్నాయి. జగిత్యాల జిల్లా తల్లిపై కూతురు విజయం సాధించింది. తల్లిపై 91 ఓట్ల తేడాతో గెలుపొంది.. సర్పంచ్ పదవిని కైవసం చేసుకుంది. దీంతో కూతురు వర్గం ఆనందంలో మునిగి తేలగా.. తల్లి వర్గం మాత్రం నిరాశలో కుంగిపోయింది.
వివరాల్లోకి వెళ్తే..
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్య పల్లెలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తిమ్మయ్య పల్లె సర్పంచ్ పదవి బీసీ మహిళకు కేటాయించారు. దీంతో తల్లి శివరాత్రి గంగవ్వ బరిలోకి దిగగా.. ఆమెకు పోటీగా కూతురు సుమలత సైతం నామినేషన్ వేశారు. అయితే తల్లిని బీఆర్ఎస్ పార్టీ బలపరచగా.. కూతురు తరపున అండగా అధికార కాంగ్రెస్ పార్టీ నిలిచింది. తాజాగా వెలువడిన ఫలితాల్లో కూతురు 91 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
ప్రేమ పెళ్లి చేసుకోవడంతో..
వాస్తవానికి తల్లి, కూతుర్ల మధ్య గొత కొన్నేళ్లుగా విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. కూతురు సుమలత ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో కుటుంబంలో వివాదం తలెత్తింది. అప్పటి నుంచి గంగవ్వ, సుమలత కుటుంబాల మధ్య మనస్పర్థలు కొనసాగుతూ వచ్చాయి. తాజాగా సర్పంచ్ ఎన్నికల సందర్భంగా అది మరింత ముదిరింది. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. చివరికి కూతురు విజయం సాధించడంతో భర్త కుటుంబ ఆనందంలో మునిగి తేలుతున్నారు.
ఒక్క ఓటుతో గెలుపు..
అయితే ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించేది ఒక్క ఓటు మాత్రమేనని పదే పదే రాజకీయ నాయకులు చెబుతుంటారు. ఈ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అది సరిగ్గా రుజువైంది. సూర్యపేట జిల్లా మద్దిరాల మండలం తూర్పుతండాలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి భూక్య వీరన్న ప్రత్యర్థిపై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించాడు. దీంతో అతడి ఆనందానికి ఆవధులు లేకుండా పోయింది.
Also Read: Spain Woman: ఆఫీసుకు త్వరగా వస్తోందని.. ఉద్యోగినిపై వేటు.. ఇదేందయ్యా ఇది!
సర్పంచ్ గా 82 ఏళ్ల వృద్ధురాలు..
మరోవైపు పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల గ్రామ సర్పంచ్ గా 82 ఏళ్ల వృద్ధురాలు ఎన్నికయ్యారు. కాసిపేట వెంకటమ్మ సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే వయసు పైబడినా తనపై నమ్మకం ఉంచి ఓటు వేసిన గ్రామస్తులకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా నేరవేరుస్తానని ఆమె స్పష్టం చేశారు.

