Sahasra Murder Case: హైదరాబాద్ కూకట్ పల్లిలో సంచలనం సృష్టించిన సహస్ర హత్య కేసుపై సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మర్డర్ కు సంబంధించి కీలక విషయాలను పంచుకున్నారు. క్రికెట్ బ్యాట్ కోసమే మైనర్ బాలుడు సహస్ర ఇంట్లోకి ప్రవేశించినట్లు సీపీ తెలిపారు. ఈ క్రమంలో బాలుడ్ని గమనించిన సహస్ర.. దొంగ దొంగ అరిచినట్లు చెప్పారు. దొరికిపోతానన్న భయంతో బాలికపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడని స్పష్టం చేశారు.
ఓటీటీ, క్రైమ్ థ్రిల్లర్ల ప్రభావంతో..
సహస్రను హత్య చేసిన అనంతరం.. బాలిక ఇంటి పక్క ఉన్న టెర్రస్ దూకి నిందితుడు వెళ్లిపోయినట్లు సీసీ అవినాష్ మహంతి అన్నారు. బాలుడు.. ఓటీటీ, క్రైమ్ థ్రిల్లర్లను అధికంగా చూసేవాడని సీపీ తెలిపారు. వాటి ద్వారా క్రైమ్ అనంతరం ఎలా తప్పించుకోవాలో తెలుసుకున్నాడని అన్నారు. సహస్ర హత్య అనంతరం.. బాలుడి తల్లికి అనుమానం వచ్చిందని.. అయితే ఒట్టు వేసి ఆమెను నమ్మించాడని చెప్పారు. కాగా కేసులో కీలకంగా ఉన్న కత్తిని, లెటర్ ను బాలుడి ఇంట్లోనే స్వాధీనం చేసుకున్నట్లు సీపీ చెప్పారు.
హత్య తర్వాత స్నానం చేసి..
హత్య తర్వాత ఇంటికి వెళ్లే ముందు బయట ఆరేసిన షర్ట్ వేసుకొని లోపలికి వెళ్లాడని సీపీ అవినాష్ మహంతి అన్నారు. అనంతరం రక్తపు మరకలు ఉన్న షర్ట్ ను వాషింగ్ మిషన్ లో వేసి.. స్నానం చేశాడని అన్నారు. క్లూస్ టీమ్ అతి కష్టం మీద బాలుడి బట్టలపై రక్తపు మరకలు గుర్తించిందని అన్నారు. అయితే గతంలో కూడా పలుమార్లు టెర్రస్ దూకి వెళ్లానని బాలుడు చెప్పినట్లు సీపీ అన్నారు. ‘బ్యాట్ కొనే పరిస్థితుల్లో కుటుంబం లేదని బాలుడు భావించాడు. అందుకోసమే దొంగతనం చేయాలనుకున్నాడు. పద్నాలుగేళ్ల వయస్సు కాబట్టి ఆ వయస్సులో అతనికి బ్యాట్ దొంగతనం పెద్ద సమస్యే కాదని అనుకున్నాడు’ అని చెప్పారు. సహస్రను దారుణంగా చంపిన బాలుడ్ని జువైనల్ హోమ్ కు తరలించనున్నట్లు సీపీ వివరించారు.
కూకట్ పల్లి సహస్ర హత్య కేసు వివరాలు వెల్లడించిన సీపీ అవినాష్ మహంతి
క్రికెట్ బ్యాట్ దొంగతనం కోసం అని వెళ్లి బాలికని హత్య చేశాడు
బ్యాట్ దొంగలించడం చూసి ఇంట్లో ఉన్న పాప గట్టిగా అరిసింది
దొరికిపోతానేమోనన్న భయంతో వెంట తెచ్చుకున్న కత్తితో బాలికను పొడిచి చంపాడు
నిందితుడు మొదట్లో… pic.twitter.com/qkpMYNRKxq
— BIG TV Breaking News (@bigtvtelugu) August 23, 2025
Also Read: Kukatpally Murder Case: నా కూతుర్ని చంపినట్లు.. బాలుడి పేరెంట్స్‌కు ముందే తెలుసు.. సహస్ర తండ్రి
అసలేం జరిగిందంటే?
కూకట్‌పల్లి(Kukatpally) సంగీత్ నగర్‌లో నివాసముంటున్న 12 ఏళ్ల సహస్ర.. సోమవారం (ఆగస్టు 18న) దారుణ హత్యకు గురికావడం సంచలనం రేపింది. రేణుక, కృష్ణ దంపతులకు సహస్ర (12), కుమారుడు ఉన్నారు. రేణుక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగం చేస్తుండగా కృష్ణ బైక్ మెకానిక్. కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతున్న సహస్ర స్కూల్ కు సెలవులు ఉండటంతో ఇంటి వద్దనే ఉంటోంది. సోమవారం రేణుక, కృష్ణలు తమ తమ పనులపై వెళ్లిపోయారు. వారి కుమారుడు స్కూల్ కు వెళ్లగా సహస్ర ఇంట్లో ఒంటరిగా ఉండిపోయింది. ఈ క్రమంలో ఆమె ఇంట్లోకి దొంగతనానికి వచ్చిన బాలుడు.. సహస్రను హత్య చేసి పరారయ్యాడు.