Cyber Crime: ట్రేడింగ్, హ్యాకింగ్, డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ ముఠా పక్కా స్కెచ్ తో వేల కోట్లను కొల్లగొట్టేస్తోంది. మీ పెట్టుబడులకు అదనపు ఆదాయం వస్తుందని ఆశ పెట్టి ఖాజేస్తున్న లక్షల సొత్తును చైనా(Chaina), దుబాయ్(Dhubai), ఇతర ప్రాంతాల సైబర్ క్రిమినల్స్ సూచనల మేరకు ఇక్కడి బ్యాంకు ఖాతాల నుంచి క్రిప్టో కరెన్సీగా మార్చి చైనా సైబర్ క్రిమినల్స్ ఖాతాలకు మళ్లించేందుకు అవసరమైన బ్యాంకు ఖాతాల సేకరణకు దళారులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఈ తరహా మోసపూరితమైన, చట్ట విరుద్ధమైన నగదు స్వీకరణ, బదిలీ చేసేందుకు వినియోగించే( మ్యూల్) బ్యాంకు ఖాతాలను సైబర్ ముఠా క్రిమినల్స్ కు అందించే దళారుల వ్యవస్థ పల్లెలు, తండాలు, పట్టణాలకు మరింత విస్తరిస్తోంది. బ్యాంకు ఖాతా ఇచ్చినందుకు డబ్బులు ఇస్తామని దినసరి కూలీలతో పాటు ప్రైవేట్ ఎంప్లాయిస్, గృహిణిలు, చిరు వ్యాపారులకు, అన్ని వర్గాల ప్రజలకు ఆశ చూపి వారి నుంచి దళారులు పెద్ద ఎత్తున బ్యాంకు ఖాతాలను కొనుగోలు చేస్తూ సైబర్ ముఠా చేసే ఇల్లీగల్ దోపిడీకి కీలక సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారు. బ్యాంకు ఖాతాల సేకరణకు ఆదేశాలు ఇచ్చే ప్రధాన వ్యక్తులకు (మ్యూల్) ఖాతాలలో జరిగే నగదు బదిలీలపై 10 నుంచి 15 శాతం కమిషన్ వస్తున్న క్రమంలో ఈ దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇటీవల మిర్యాలగూడ(Miryalaguda) నియోజకవర్గ పరిధిలో బ్యాంకు ఖాతాలను సేకరించి ఇస్తే కమిషన్ ఇస్తామని కొంతమంది ఏజెంట్లు మిర్యాలగూడ పట్టణ కేంద్రానికి చెందిన ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేసే యువకులను అడగగా అందుకు నిరాకరించిన పెద్ద ఎత్తున కమిషన్ ఆశ పెడుతున్నట్లు సమాచారం.
జిల్లాలో సైబర్ బాధితులు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి, చౌటుప్పల్, హాలియా సూర్యపేట, హుజూర్ నగర్, కోదాడ తోపాటు పలు ప్రాంతాలకు చెందిన సుమారు 6 నుంచి 10 వేల మంది వరకు సైబర్ బాధితులు ఉన్నట్లు పోలీసుల అంచన. ఆడియో, వీడియో కాల్స్ చేయడంతో పాటు ఫోక్సో యాక్ట్, ఇతర ఫేక్ కాల్స్ చేస్తూ సైబర్ ముఠా ఈ ప్రాంత వాసుల నుంచి లక్షలను గుంజేసింది. అయితే బాధితులు సైతం బహిరంగంగా సమాచారాన్ని షేర్ చేసుకునే పరిస్థితి లేక కొన్నిసార్లు నష్టాన్ని భరిస్తున్న పరిస్థితి నెలకొంది. మిర్యాలగూడ పట్టణ చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగికి ఫోక్సో యాక్ట్ కేసు పేరిట ఫోన్లు వీడియో కాల్ చేసిన సైబర్ ముఠా మొదట రూ. 30 లక్షల ను డిమాండ్ చేసింది. ఈ క్రమంలో 20 లక్షలైన చెల్లించాలని ఒత్తిడి చేయగా మూడు రోజులపాటు ఇబ్బందిపడిన ఆ విశ్రాంత ఉద్యోగి చివరికి పోలీసులను ఆశ్రయించి సైబర్ ముఠా ముప్పు నుంచి తప్పించుకున్నాడు.
బ్యాంకు ఖాతాలు లోకల్… విదేశాల్లో అక్రమ నగదు బదిలీ వ్యవహారం
సైబర్ ముఠా క్రిమినల్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న దళారులతో బ్యాంకు ఖాతాలను సేకరించి చైనా, ముంబై, దుబాయ్ సహా ఇతర ప్రదేశాల్లో మకాం వేసి ఆర్థిక దోపిడీ కొనసాగిస్తున్నారు. ఫేస్ బుక్, టెలిగ్రామ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ప్రకటనలు ఇస్తూ ట్రేడింగ్, స్టాక్ మార్కెట్, డిజిటల్ అరెస్ట్, హ్యాకింగ్ లతో వేలకోట్లను క్షణాల్లో దోచేస్తున్నారు. ఒక్కో ఖాతా నుంచి రూ. 20 లక్షల నుంచి రూ. 1 కోటికి పైగా అక్రమ నగదు బదిలీ వ్యవహారం నిర్వహిస్తారు. ఈ నగదు లావాదేవీలపై దళారులకు కీ పర్సన్ గా ఉండే వ్యక్తులకు పెద్ద ఎత్తున కమిషన్ వస్తుండడంతో ఈ దందా గుట్టుగా నడుస్తున్నట్టు తెలుస్తోంది. వివిధ ఖాతాల్లో చేరిన అక్రమ సొమ్మును డిజిటల్, క్రిప్టో కరెన్సీ గా మారుస్తూ చైనా, ఇతర దేశాల సైబర్ క్రిమినల్స్ ఖాతాలకు చేరవేస్తున్నారు. అందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర స్టేట్ లలో బ్యాంకు ఖాతాలనే వినియోగిస్తుండటం గమనార్హం. కేవలం రూ. 6 నుంచి 10 వేల కు ఆశపడి బ్యాంకు ఖాతాలను దళారులకు అమ్మేస్తుండడంతో ఈ ప్రాంత ప్రజలు సైబర్ వలలో చిక్కి పెద్ద ఎత్తున నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. గత కొన్ని నెలల క్రితం దుబాయ్ కేంద్రంగా వెలుగు చూసిన మ్యూల్ ఖాతాల నుంచి వేలకోట్ల అక్రమ నగదు దందా వ్యవహారంలో మిర్యాలగూడ పట్టణ కేంద్రానికి చెందిన కీలక సూత్రదారులతో పాటు పలువురిపై కేసు నమోదు కాగా జైలుకు వెళ్లి వచ్చారు. మొత్తానికి ఈ ముఠా సైతం మిర్యాలగూడ తో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజల నుంచి 6 వేల కు పైగా బ్యాంకు ఖాతాలను తెరిచి సైబర్ ముఠాకు అందజేసినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read: Ponnam Prabhakar: ఈవీ పాలసీని కంపెనీలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్!
చైనా సైబర్ క్రిమినల్స్ ఖాతాలకు క్రిప్టో కరెన్సీ రూపంలో బదిలీ
తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఆదిత్య బిర్లా గ్రూప్ పేరిట ఉన్న ప్రకటనపై క్లిక్ చేశాడు. దీంతో ట్రేడ్ అడ్వైజర్ నంటు జోసెఫ్ అనే యువతి ఆ వ్యక్తిని పరిచయం చేసుకుంది. అనంతరం అతడి నుంచి పలు దఫాలుగా రూ. 32 లక్షలను పెట్టుబడులను పెట్టించింది. రూ. 32 లక్షల లాభాలపై ప్రశ్నించగా మరో రూ. కోటి వరకు ఇన్వెస్ట్ చేయాలని సూచించగా అతను నిరాకరించారు. దీంతో ఆమె కాంటాక్ట్ లో లేకుండా పోయింది. మోసపోయినట్టు గుర్తించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు ముంబై కి చెందిన అన్సారి మహమ్మద్ ఉమర్ మురాద్ తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అయితే అన్సారి మహమ్మద్ ఉమర్ మురాద్ టెలిగ్రామ్ గ్రామ్ యాప్ ద్వారా చైనా సైబర్ క్రిమినల్స్ తో తో టచ్ లో ఉండి కొల్లగొట్టిన డబ్బును క్రిప్టో కరెన్సీ గా మార్చి చైనా సైబర్ క్రిమినల్స్ ఖాతాలకు బదిలీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే కేసులో ఇనామ్ దార్ వినాయక రాజేందర్ కమిషన్లు తీసుకుంటూ తన బ్యాంకు అకౌంట్లను చైనా సైబర్ క్రిమినల్స్ కోసం వినియోగిస్తున్నట్లు తేలింది. దీంతో ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కుతరలించారు. వీరిపై హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల తో పాటు వేరువేరు రాష్ట్రాల్లో 12 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
బ్యాంకు ఖాతాలను ఇస్తే చట్టపరమైన చిక్కులే
బ్యాంకు ఖాతా ఇచ్చినందుకు రూ. 6 వేల నుంచి 10 వేలు వస్తున్నాయని ఆశ పడుతున్న సామాన్య ప్రజలు సైబర్ క్రైమ్ లో చిక్కి చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వివిధ రూపాల్లో సైబర్ క్రిమినల్స్ కొల్లగొడుతున్న నగదును ఈ ఖాతాల నుంచే మళ్లిస్తున్న నేపథ్యంలో … కేసులు నమోదవుతుండగా బ్యాంకు ఖాతాలను ఇచ్చిన వారే బాధ్యులుగా మారే పరిస్థితి ఉన్నది. దీంతో అవగాహన లేక, దళారుల మాటలు నమ్మి బ్యాంకు ఖాతాలను అమ్మేసుకుంటున్న ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వారి ఖాతాలో ఉన్న డబ్బులు ఫ్రీజ్ కావడంతో పాటు కోర్టులకు స్టేషన్లకు తిరగాల్సిన పరిస్థితి వస్తోంది. మిర్యాలగూడ లాంటి పారిశ్రామిక కేంద్రంలో దళారులుbమ్యూల్ ఖాతాలను సేకరించే వ్యవహారంపై పోలీసులు నిఘా పెట్టాలని పలువురు కోరుతున్నారు.
మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు
ప్రజలను మభ్యపెట్టి సైబర్ క్రిమినల్స్ కు బ్యాంకు ఖాతాలను సేకరిస్తున్న దళారుల వ్యవహారంపై ఇప్పటికే ఫోకస్ పెట్టాం. చట్ట విరుద్ధంగా బ్యాంకు ఖాతాలకు డబ్బులు చెల్లించటం, డబ్బులకు ఆశపడి బ్యాంకు ఖాతాలను తెరిచేందుకు సహకరిస్తే వాటి ద్వారా మనీ లాండరింగ్ జరుగుతుందని ఈ తరహా చర్యలు జరగకుండా ప్రజల అప్రమత్తంగా ఉండాలని, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని, చట్ట విరుద్ధమైన లావాదేవీలకు బ్యాంకు ఖాతాలను సేకరిస్తే కేసులు, మిర్యాలగూడ డీ ఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు.

