CPI Narayana: ఐబొమ్మ రవి అరెస్టు తర్వాత తెలుగు సినిమాల పైరసీకి బ్రేక్ పడుతుందని అంతా భావించారు. అయితే అతడి అరెస్ట్ తర్వాత కూడా కొన్ని పైరసీ సైట్లలో కొత్తగా విడుదలైన టాలీవుడ్ సినిమాలు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ‘అఖండ 2’ చిత్రం కూడా ఒక రోజు వ్యవధిలోనే పైరసీ సైట్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ సినీ పెద్దలపై సూటి ప్రశ్నలతో విరుచుకుపడ్డారు.
పైరసీ ఎలా వచ్చింది?
ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న ఐబొమ్మ రవిని ఉరి తీయాలని కొందరు దర్శక నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారని సీపీఐ నేత నారాయణ అన్నారు. అలా చేయడం వల్ల పైరసీ ఆగదని ఆయన తేల్చి చెప్పారు. రవి పోలీసు కస్టడీలో ఉండగానే పైరసీ ఎలా వచ్చింది? అంటూ ప్రశ్నించారు. అలా అయితే రవి లాంటి వాళ్లను ఎంత మందిని ఉరి తీస్తారని నిలదీశారు. పైరసీకి మూలం ఎక్కడుంది? దానికి ఆధారాలు ఎక్కడ లభ్యం అవుతున్నాయి? అనేది తెలుసుకోవాలని నారాయణ సూచించారు. వ్యవస్థీకృతమైన లోపాలు వల్లే పైరసీ పుట్టుకొస్తోందని సీపీఐ నేత అభిప్రాయపడ్డారు.
ఒక్కొక్కరికి రూ.1000 ఖర్చు
దర్శక, నిర్మాతలు వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారని సీపీఐ నారాయణ అన్నారు. దానిని తిరిగి ప్రజల నుంచి రాబట్టేందుకు టికెట్ రేట్లు రూ.600-1000 వరకూ ప్రభుత్వ అనుమతితో పెంచుకుంటున్నారని పేర్కొన్నారు. అంతపెట్టి మల్టీ ప్లెక్స్ లకు వెళ్లినవారు స్నాక్స్ కూడా తినే పరిస్థితి ఉండటం లేదన్నారు. నీళ్ల బాటిల్ కూ రూ.100+, స్నాక్స్ కు రూ. 300-400 పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటోందని చెప్పుకొచ్చారు. మెుత్తంగా చూసుకుంటే సినిమా చూడటానికి ఒక్కో వ్యక్తికి రూ.1000 వరకూ ఖర్చు అవుతోందని నారాయణ అన్నారు. అందుకే ఫ్యామిలీతో సినిమాలకు వెళ్లాలంటే చాలా మంది భారంగా ఫీలవుతున్నారని పేర్కొన్నారు.
‘అందువల్లే పైరసీ చూస్తున్నారు’
అధిక రేట్లు కారణంగా సినిమా.. సామాన్య ప్రేక్షకులకు దూరం అవుతోందని సీపీఐ నేత అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఎలాగోలా సినిమాను చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఫ్రీగా పైరసీ లభిస్తుండటంతో ఎక్కువ మంది ఆ మార్గంలో మూవీలు చూస్తున్నారని సీపీఐ నారాయణ చెప్పుకొచ్చారు. ఈ వ్యవస్థీకృతమైన లోపాల వల్లే ఈ విధమైన పైరసీలు పుట్టుకు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. దీనిని ఆపకుండా ఒక మనిషిని పట్టుకొని అరెస్ట్ చేసి, గందరగోళం చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని నారాయణ అన్నారు.
Also Read: Messi India Visit: మెస్సీ భారత్‌కు ప్రయాణించిన విమానం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారేమో!
జనాలను దోపిడి చేస్తారా?
అయితే తానేమి పైరసీని, ఐబొమ్మ రవి సపోర్ట్ చేయడం లేదని నారాయణ స్పష్టం చేశారు. పాలసీలో మార్పుల చేయాల్సిన అవసరాన్ని మాత్రమే సూచిస్తున్నట్లు చెప్పారు. టికెట్ ధరలు మాములుగా ఉంచి, థియేటర్లలో స్నాక్స్ తగ్గించడం లేదా బయట నుంచి తెచ్చుకునేందుకు వీలు కల్పిస్తే ప్రయోజనం ఉండొచ్చని హితవు పలికారు. అంతేగానీ ‘సినిమాకు అంత ఖర్చు చేసేశాం. తమకు లాభాలు రావాలని ధరలు పెంచుకుంటూ పోతే ఎలా కుదురుతుంది. జనాలను దోపిడి చేస్తారా?. మీరు తప్పు చేస్తున్నారు.. ఆ తప్పు ఫలితంగా మరో తప్పు జరుగుతోంది’ అని సీపీఐ నారాయణ చెప్పుకొచ్చారు.
అఖండ్-2 పైరసీ.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..
ఐ బొమ్మ రవిని ఉరి తీయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల పైరసీ ఆగదు
రవి పోలీస్ కస్టడీలో ఉండగానే అఖండ-2 పైరసీ ఎలా వచ్చింది?
ఫైరసీకి మూలం ఎక్కడుంది? దానికి ఆధారాలు ఎక్కడ లభ్యం అవుతున్నాయి?
వ్యవస్థీకృతమైన లోపాలు వల్లే పైరసీ… pic.twitter.com/KEhXHN7AOA
— BIG TV Breaking News (@bigtvtelugu) December 13, 2025

