Congress vs BJP: తెలంగాణ కేబినేట్ మంత్రిగా అజారుద్దీన్ (Mohammad Azharuddin) చేరికను బీజేపీ (BJP) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆయన ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవాలంటూ బీజేపీ నేతలు.. ఎన్నికల సంఘాన్ని సైతం ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జాతీయ క్రికెట్ జట్టుకు సుదీర్ఘ కాలం సేవలు అందించిన వ్యక్తిని కేబినేట్ చేర్చుకోకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
బీజేపీ కుట్రలు చేస్తోంది: భట్టి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మాట్లాడుతూ ‘దేశానికి ఖ్యాతి తెచ్చిన అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేస్తోంది. బీజేపీ నాయకత్వం ఎన్నికల అధికారికి లేఖ రాసి అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవద్దని ఫిర్యాదు చేసింది. దేశ ఖ్యాతిని పెంచిన క్రీడాకారుడ్ని మంత్రిని చేస్తుంటే అడ్డుకోవడం విడ్డూరం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో లబ్ది పొందాలని బీజేపీ కృషి చేస్తోంది. బీఆర్ఎస్ (BRS)ను గెలిపించాలని బీజేపీ తాపత్రయ పడుతోంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గొప్ప వ్యక్తి. కానీ ఆయనపై ఒత్తిడి తెచ్చే పనిలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయాయని కవిత ఇప్పటికే చెప్పారు. విలీనంపై చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కవిత చెప్పిన మాటలు నిజమనే అనిపిస్తోంది’ అని భట్టి చెప్పుకొచ్చారు.
‘గవర్నర్ పై బీజేపీ ఒత్తిడి’
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) మాట్లాడుతూ అజారుద్దీన్ ను కచ్చితంగా కేబినేట్ లోకి తీసుకుంటామని తేల్చిచెప్పారు. ‘మైనారిటీకి అవకాశం ఇస్తుంటే బీజేపీ విషం కక్కుతోంది. అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది చాలా దుర్మార్గం. బీజేపీ ద్వంద వైఖరి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. రాజస్థాన్ లో ఉపఎన్నిక సందర్భంగా బీజేపీ అభ్యర్థి సురేంద్ర పాల్ ని మంత్రిగా చేశారు. రాజస్థాన్ లో ఒక నీతి, తెలంగాణలో ఒక నీతా. జూబ్లీహిల్స్ లో బీజేపీ నామమాత్రంగా పోటీ చేస్తూ బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేస్తోంది. ప్రమాణ స్వీకారం ఆపేందుకు గవర్నర్ పై బీజేపీ ఒత్తిడి తీసుకొస్తోంది. అజారుద్దీన్ జూబ్లీహిల్స్ బరిలో లేరు. ఆయన అభ్యర్థి కాదు. అయినా బీజేపీ ఎందుకు వ్యక్తిరేకిస్తోంది’ అని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు.
Also Read: Hyderabad Traffic: హైదరాబాద్ వాహనదారులకు ట్రాఫిక్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో 9 నెలల వరకు రోడ్ బ్లాక్?
రేపే ప్రమాణ స్వీకారం
టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్.. రేపు (శుక్రవారం) తెలంగాణ మంత్రిగా ప్రమాణం స్వీకరం చేయనున్నారు. మధ్యాహ్నం 12.15 గం.లకు రాజ్ భవన్ లో ఆయన ప్రమాణ స్వీకారం జరగనుంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.. అజారుద్దీన్ చేత మంత్రిగా ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులందరూ హాజరుకావాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారిక అహ్వానం సైతం వెళ్లింది. అయితే అజారుద్దీన్ ను కేబినేట్ లోకి చేర్చుకోవడంపై బీజేపీ, బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న క్రమంలోనే ఆయన ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ప్రభుత్వం టైమ్ ఫిక్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.
