Congress Leader: సాధారణంగా రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు దూకుడు ప్రదర్శిస్తుంటారు. విపక్ష పార్టీకి చెందిన వారితో బాహాబాహీకి దిగుతుంటారు. ఇక తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తే వారి చేసే పనులకు ఇక అడ్డుఅదుపు ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అధికారులను సైతం వారు ఎదిరించిన ఘటనలు ఇటీవల కాలంలో చూస్తూనే ఉన్నాం. తాజాగా తెలంగాణలో ఈ తరహా ఘటనే జరిగింది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత రెచ్చిపోయాడు. విధి నిర్వహణలో ఉన్న ఎస్సైపై దాడికి దిగాడు. ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగిందంటే?
కల్లూరు కు చెందిన కాంగ్రెస్ నేత రాయల రాము చౌదరి హోటల్లో మధ్యాహ్నం భోజనానికి తన అనుచరులతో వెళ్లారు. భోజనం చేస్తున్న సమయంలో పరోట విషయంలో సప్లై చేసే వ్యక్తికి రాముకు మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో రాయల రాము తన అనుచరులతో చౌదరి హోటల్ యజమానులతో ఘర్షణకు దిగారు. దీంతో హోటల్ యజమాని 100 డయల్ కు ఫోన్ చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్స్ వారికి సర్ది చెప్పారు. తాత్కాలికంగా సద్దుమణిగినప్పటికీ సాయంత్రం సమయంలో కాంగ్రెస్ లీడర్ రాయల రాము మళ్ళీ తన అనుచరులతో చౌదరి హోటల్ వద్దకు వచ్చి గొడవకు దిగాడు.
విధి నిర్వహణలో ఉన్న లేడీ ఎస్సైపై దాడి..
ఖమ్మం జిల్లా కల్లూరు చౌదరి హోటల్ వద్ద ఉద్రిక్తత
హోటల్ సిబ్బందితో రాము అనే వ్యక్తి వాగ్వాదం
హోటల్ వద్దకు చేరుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేసిన మహిళా ఎస్సై
ఈ క్రమంలో రాముపై చెయ్యి చేసుకున్న ఎస్సై
వెంటనే ఎస్సై ను బలంగా నెట్టేసిన రాము… pic.twitter.com/IGxQHjUMnv
— BIG TV Breaking News (@bigtvtelugu) June 7, 2025
బూతులు తిడుతూ హంగామా!
గొడవ గురించి తెలుసుకున్న స్థానిక ఎస్సై హరిత చౌదరి హోటల్ వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలోనే రాయల రాము తన నోటికి పని చెప్పి నానా బూతులు హోటల్ యజమానిపై ప్రయోగించాడు. అనవసర రాద్ధాంతం చేయవద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని ఎస్సై హరిత.. రాముకు సూచించారు. అయినప్పటికీ రాము వెనక్కి తగ్గలేదు. నానా బూతులు తిడుతూ రచ్చ చేసే ప్రయత్నం చేశాడు. ఎంత చెప్పినా వినకుండా అదేపనిగా బూతులు దండకం అందుకున్నారు. అధికార పార్టీకి చెందిన నేతనే అడ్డుకుంటారా అన్న రీతిలో హద్దుమీరి ప్రవర్తించాడు.
Also Read: Minister Ponguleti Srinivasa Reddy: జీవనోపాధికి ఇబ్బంది లేకుండా.. ఇందిరమ్మ ఇండ్లు!
ఎస్సైపై దాడి
ఈ క్రమంలో తీవ్ర అసహనాన్నికి గురైన ఎస్సై సరిత.. రాయల రాముపై చేయి చేసుకున్నారు. దీంతో రాము వెంటనే స్పందించి.. ఎస్సైని సైతం బలంగా వెనక్కి తోసేశాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ లీడర్ రాముతో సహా అతని అనుచరులను పోలీసులు వాహనంలో ఎక్కించుకొని స్టేషన్ కు తరలించారు. చౌదరి హోటల్ యజమాని, అదేవిధంగా రచ్చ చేసిన కాంగ్రెస్ లీడర్ రాయల రాము, అతని అనుచరులపై కల్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. విధులు నిర్వహిస్తున్న ఎస్సై హరితను నెట్టివేసిన ఘటనలో ఉన్నత స్థాయి అధికారులు ఆరాతీస్తున్నట్లుగా సమాచారం.