Telangana Cold Wave: తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా, గత రెండు రోజులుగా పలు జిల్లాల్లో కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడ్డకట్టే చలితో జనాలు వణికిపోతున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం (డిసెంబర్ 20) చాలా ప్రాంతాల్లో ఈ సీజన్‌లోనే అత్యుల్ప స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. డిసెంబర్ 12 నాటి స్థాయిలో చలి తీవ్రత వణికించింది.
కోహిర్‌లో 4.5 సెంటీగ్రేడ్
శనివారం రాత్రి, ఉదయం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యుల్ప స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యుల్పంగా 4.5 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయింది. ఇక, అసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో కూడా దాదాపు అదే స్థాయిలో 4.8 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయింది. దీంతో, ఆ ప్రాంతాల్లో ప్రజలు చలికి గజగజ వణికిపోయారు.
హైదారాబాద్‌లో కనిష్టం 6.3 డిగ్రీలు
తెలంగాణ రాజధాని హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో అత్యుల్పంగా 6.3 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయింది. ఇతర ప్రాంతాల విషయానికి వస్తే, రాజేంద్రనగర్‌లో 7.4 సెంటీగ్రేడ్, మౌలాలిలో 7.5 సెంటీగ్రేడ్, గచ్చిబౌలిలో 8.4 సెంటీగ్రేడ్, శివరాంపల్లిలో 8.4 సెంటీగ్రేడ్, బొల్లారంలో 9.4 సెంటీగ్రేడ్, మారేడ్‌పల్లిలో 10 సెంటీగ్రేడ్, కుత్బుల్లాపూర్‌లో 10.1 సెంటీగ్రేడ్, షేక్‌పేట్‌లో 10.8 సెంటీగ్రేడ్, సులేమాన్ నగర్‌లో 10.9 సెంటీగ్రేడ్, జీడిమెట్లలో 11 సెంటీగ్రేడ్,, బేగంపేటలో 11.5 సెంటీగ్రేడ్, ఆర్సీపురంలో 12 సెంటీగ్రేడ్, మోండా మార్కెట్‌లో 12.9 సెంటీగ్రేడ్, గోల్కొండలో 13.2 సెంటీగ్రేడ్, బంజారాహిల్స్‌లో 13.4లో, మాదాపూర్ , అమీర్‌పేట్‌లలో 13.6 సెంటీగ్రేడ్, హఫీజ్‌పేట్‌లో 14.3 సెంటీగ్రేడ్, ఏఎస్ రావు నగర్‌లో 14.4 సెంటీగ్రేడ్, అంబర్‌పేట్‌లో 14.7 సెంటీగ్రేడ్, బోరబండలో 14.9 సెంటీగ్రేడ్, కూకట్‌పల్లిలో 15 సెంటీగ్రేడ్, బాలానగర్‌లో 15.5 సెంటీగ్రేడ్, టోలిచౌకిలో 15.7 సెంటీగ్రేడ్, ఎల్బీ నగర్‌లో 15.9 సెంటీగ్రేడ్, నాంపల్లిలో 16 సెంటీగ్రేడ్ చొప్పన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
శివార్లు సైతం గజగజ
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా అత్యుల్ప స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా, మొయినాబాద్‌లో 5.1 సెంటీగ్రేడ్, ఇబ్రహీంపట్నంలో 6.1 సెంటీగ్రేడ్, పాశమైలారంలో 7.1 సెంటీగ్రేడ్, శామీర్‌పేట్‌లో 9 సెంటీగ్రేడ్, ఘట్‌కేసర్‌లో 9.4 సెంటీగ్రేడ్, ధూలపల్లిలో 9.7 సెంటీగ్రేడ్, మోకిలాలో 10.6 సెంటీగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ‘తెలంగాణ వెధర్‌మ్యాన్’ (ట్విటర్ పేజీ) తెలిపింది. రాష్ట్రంలో తీవ్రమైన శీతల గాలులు (Cold Wave) వాతావరణం కొనసాగుతోందని సూచించింది. కాబట్టి, మరో రెండూ మూడు రోజులు ఇలాంటి వాతావరణమే ఉండే అవకాశం ఉంది. కాబట్టి, అత్యవసరమైతే తప్ప, రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో బయటకు వెళ్లకపోవడమే ఉత్తమం.
కాగా, ఉత్తర భారతం నుంచి వీస్తున్న పొడి గాలుల ప్రభావంతో రాత్రి సమయాల్లో తెలంగాణలో కనిష్ఠ స్థాయికి పడిపోతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది. చలివైపు, దట్టమైన పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

